మయసభ.. మాయ చేసిన దేవా కట్టా

మయసభ.. మాయ చేసిన దేవా కట్టా

    దేవాకట్టా పొలిటికల్ థ్రిల్లర్ చేస్తే అది ఎలా ఉంటుందో ప్రస్థానం సినిమా చూస్తే అర్థం అవుతుంది. అసలే దేవా కట్టా మేకింగ్, గ్రిప్పింగ్ నెరేషన్‌కు సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమాలు సమాజాన్ని తట్టి లేపేలా ఉంటాయి. ఈ క్రమంలో మయసభ అంటూ ఓటీటీలో సరికొత్త సంచనాల సృష్టిస్తున్నారు దేవాకట్టా. ఆయన తెరకెక్కించిన ఈ సిరీస్ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

    ఇద్దరి స్నేహితుల రాజకీయ ప్రయాణమే ఈ మయసభ. అనుకోకుండా కలిసిన ఇద్దరు కేకేఎన్ (ఆది పినిశెట్టి), ఎంఎస్ఆర్ (చైతన్య రావు) మిత్రులు రాజకీయ ప్రవేశం, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎదిగే క్రమంను ఈ మొదటి సీజన్‌లో చూపించారు. ఇక 70, 80వ దశకంలో ఉన్న కుల, ప్రాంత గొడవల్ని కల్లకు కట్టినట్టుగా చూపించారు. బెజవాడ గొడవలు, అనంతపురం, కడప ఫ్యాక్షన్ గొడవలు, మధ్యలో నక్సలైట్ల ట్రాక్ ఇలా అన్నీ కూడా చూపించేశారు. ఇక ప్రధాని ఐరావతి ట్రాక్, ఆర్‌సీఆర్ (సాయి కుమార్) రాజకీయ అరంగేట్రం కూడా ఈ మొదటి సీజన్‌‌లోనే చూపించారు. కేకేఎన్, ఎంఎస్ఆర్ ప్రయాణం ఎలా సాగింది? ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉండేది? అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు వారి లక్ష్యాల్ని, ఆశయాల్ని సాధించారా? అన్నదే మయసభ.

    మయసభ సిరీస్‌లో ఎంత కల్పితం, ఎంత నిజం అన్నది పక్కన పెడితే.. దేవా కట్టా ఈ సిరీస్‌ను తెరకెక్కించిన తీరు, రాసుకున్న విధానం మాత్రం అందరినీ కదిలిస్తుంది. నిజంగానే ఇలా జరిగిందా? ఆ ఇద్దరి మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా? అనేలా మాత్రం చేసేస్తాడు. ఇక ఇందులో పేర్లు మార్చి చూపించినా కూడా ఇది ఎవరి కథ? ఆ పాత్ర ఎవరిది? అన్నది అర్థం అవుతూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు, వైఎస్సార్, ఎన్టీఆర్, ఇందిరా గాంధీ ఇలా అందరి పాత్రలను పెట్టేశాడు.

    సీబీఎన్ రాజకీయాల్లోకి రావడం, ఆయన యవ్వనం, చదువుకునే రోజుల్లో ఉండే ఆశయాలు, కాలేజ్ ఎలెక్షన్స్, ప్రేమాయణం ఇవన్నీ కూడా దేవా కట్టా అద్భుతంగా చూపించాడు. ఇక వైఎస్సార్ ఫ్యామిలీ రౌడీయిజం గురించి కూడా చూపించాడు. ఫ్యాక్షన్ గొడవలు వద్దని డాక్టర్ చదువులు చదివిన వైఎస్సార్ ముందు నుంచీ చెబుతూనే ఉండటం ఇందులో చూపిస్తారు. ఇక ఆనాటి ఫ్యాక్షన్ గొడవలు, రెడ్ల ఆదిపత్యం గురించి కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

    రెడ్డి, నాయుడు మధ్య జరిగే ఈ ప్రయాణం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక అప్పటి రాజకీయ పరిస్థితులు, ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలు, సీఎంలు తోలు బొమ్మల కంటే దారుణంగా ప్రవర్తించడం వంటి సన్నివేశాల్ని కూడా చూపించారు. ఇక ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఎదురు పడే సన్నివేశం అన్నట్టుగా ఇందులో ఒక సీన్ పెట్టారు. అక్కడ ఐరావతి పాత్రలో దివ్యా దత్తా, ఆర్‌సీఆర్ పాత్రలో సాయి కుమార్ అద్భుతంగా నటించారు. అక్కడే ఆర్‌సీఆర్ అహం, ఇందిరా అహం దెబ్బ తిన్నట్టుగా చూపించారు. కాలు మీద కాలు వేసుకునే కూర్చునే ఆ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

    నాయుడు, రెడ్డి ఇద్దరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టి.. మంత్రులుగా మారేందుకు ఆడే రాజకీయ చదరంగం బాగుంటుంది. మంత్రులుగా మారిన తరువాత వారు తీసుకునే నిర్ణయాలు, పదవుల్ని కాపాడుకునేందుకు చేసే పనులు.. ఇవన్నీ చూస్తే కుల ఊబిలో పడిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఇక సమాంతరంగా అనంతపురంలో నక్సలైట్లు, బెజవాడ గొడవల గురించి, హీరోయిన్ అనుహారిక ట్రాక్ చూపించడంలో దేవా కట్టా సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ అనిపించదు. అసలు చూస్తుంటే టైం కూడా తెలియకుండా పోతుంది.

    టెక్నికల్‌గా మయసభ మాయ చేస్తుంది. విజువల్స్, క్యాస్టూమ్స్, ఎడిటింగ్, ఆర్ఆర్ ఇవన్నీ కూడా అప్పటి కాలానికి మనల్ని తీసుకుని పోతాయి. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆది పినిశెట్టి, చైతన్య రావు, దివ్యా దత్తా, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, నాజర్ ఇలా అందరూ బాగా నటించారు. అయితే ఇందులో చూపించింది ఎంత వరకు నిజం, ఎంత కల్పితం అన్నది మాత్రం ఆయా ప్రాంతాల ప్రజలకు తెలుస్తుంది.

    మయసభ అంటూ దేవా కట్టా నిజంగానే ఆడియెన్స్‌ను ఆ కాలంలోకి తీసుకువెళ్లి మాయ చేసినట్టుగా ఉంటుంది.

    రేటింగ్ 4