Leo Movie Review : లియో రివ్యూ.. అయ్యో!

Leo Movie Review : లియో రివ్యూ.. అయ్యో!

    Vijay Leo Review లియో సినిమాను విజయ్ నటించిన సినిమాగా కంటే.. లోకేష్ కనకరాజ్ తీస్తోన్న సినిమాగానే ఎక్కువ మంది చూశారు. ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలో కోలీవుడ్, టాలీవుడ్‌ను షేక్ చేశాడు లోకేష్. డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. అందుకే ఈ లియో సినిమా మీద అంతగా హైప్ పెరిగింది. ఇప్పుడు ఈ లియో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

    కథ
    పార్తీబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లోని థియోగ్‌లో కాఫీ షాపు నడుపుతూ తన భార్య సత్య (త్రిష), కొడుకు, కూతురితో కలిసి సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలాంటి పార్తీబన్ జీవితంలోకి కొన్ని ఘటనలు ఎదురవుతాయి. అతడ్ని ఆ ఊరికి హీరోని చేస్తాయి. దాంతో మీడియాలో పార్తీబన్ హీరోయిజం హైలెట్ అవుతుంది. అలా పార్తీబన్‌ను చూసిన అన్ని రాష్ట్రాల్లోనూ కదలికలు మొదలవుతాయి. తెలంగాణలోని దాస్ అండ్ కో కంపెనీ అధినేత ఆంటోని దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్)ల కంట పార్తీబన్ పడతాడు. అతడే లియో దాస్ అని అనుకుంటారు. అతను ఎవరు? అని తెలుకునేందుకు ఆంటోని దాస్ బయల్దేరుతాడు. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఈ పార్తీబన్ ఎవరు? ఆ లియో దాస్ ఎవరు? ఈ ఇద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ఆ ఇద్దరూ ఒక్కరా? లేదా? ఒక్కరే ఇద్దరిలా నటించాడా? అన్నదే కథ.

    నగరం సినిమా టైంకి లోకేష్ కనకరాజ్ మీద ఎలాంటి అంచనాలు లేవు. ఖైదీ సినిమాకు సైతం లోకేష్ అసలు క్రేజ్ అన్నదే లేదు. అది పూర్తిగా కార్తీ క్రేజ్ మీద బయటకు వచ్చింది. ఆ తరువాత ఖైదీని తీసిన విధానంకు లోకేష్ మేకింగ్‌కు అంతా ఫిదా అయ్యారు. అంత చీకట్లో, అలాంటి లైటింగ్‌తో అసలు పాటలు లేకుండా హీరోయిన్ లేకుండా సినిమా ఎలా తీశాడని అంతా షాక్ అయ్యారు.

    ఆ తరువాత మాస్టర్ అంటూ విజయ్‌తో చేసిన సినిమా అంతగా ఆకట్టుకోలేదు. తరువాత కమల్ హాసన్‌తో విక్రమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. విక్రమ్ సినిమాతో లోకేష్ పేరు దేశ వ్యాప్తంగా మారిపోయింది. అప్పటి నుంచి లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పేరు మార్మోగిపోయింది. విక్రమ్‌లో ఖైదీ రిఫరెన్సులుంటాయి. అలానే ఈ లియో సైతం ఎల్ సీ యూలో భాగమే. లియోలోనూ విక్రమ్, ఖైదీల రిఫరెన్సులుంటాయి.

    ఖైదీ, విక్రమ్‌లు చూసి లోకేష్‌ను ఆకాశపు అంచున ఊహించుకుంటాం. లియో సైతం అదే స్థాయిలో ఉంటుందని అనుకుంటాం. అలాంటి అంచనాలతో పోయే ప్రేక్షకుడు పాతాళంలోకి పడతాడు. లియో సినిమా ఏ మాత్రం కూడా లోకేష్ స్థాయికి తగ్గ చిత్రమని అనిపించదు. ఈ కథ కూడా కొత్తది కాదు. మన తెలుగులో ఎన్నో సార్లు వాడిన కథే. వారసుడు, గాయం 2 ఇలా ఎన్నో సినిమాలు అదే లైన్‌లో వచ్చాయి. ఇక హాలీవుడ్లో ఏ హిస్టరీ ఆఫ్ వయలెన్స్ అంటూ వచ్చింది. ఈ మూవీ నుంచే లియోను కాపీ కొట్టాడో రిఫరెన్స్ తీసుకున్నాడో ఏమో గానీ.. టైటిల్స్‌లో మాత్రం క్రెడిట్ ఇచ్చాడు లోకేష్.

    గతాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి హీరో రావడం.. అక్కడే ఓ కొత్త కుటుంబాన్ని ఏర్పర్చుకుని హాయిగా గడుపుతూ ఉండటం.. ఇంతలో మళ్లీ గతాన్ని వెంటాడుతూ కొత్త సమస్యలు రావడం.. ఆ గతం ప్రభావం తన కుటుంబం మీద పడటం.. కుటుంబాన్ని కాపాడుకునేందుకు హీరో ఫైట్స్ చేయడం.. ఆ గతాన్ని పూర్తిగా తుదముట్టించడం, విలన్లను చంపేయడం అనే ఫార్మూలా ఏ కాలందో చెప్పాల్సిన పని లేదు.

    కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉండి.. అందులోని ఎమోషన్స్ ప్రేక్షకుడికి ఎక్కితే సినిమా ఆడేస్తుంది. కానీ లియోలో ఏ మూలన కూడా ఎమోషన్స్ ఆకట్టుకోదు. తండ్రి ఏంటో.. తమ్ముడు ఏంటో.. కొడుకు ఏంటో..కూతురు ఏంటో.. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ ఏంటో.. ఇలా ఏ ఒక్క ఎమోషన్‌ కూడా ప్రేక్షకుడికి అర్థం కాదు. కనెక్ట్ కాదు. ఆంటోని దాస్, హరోల్డ్ దాస్, లియో దాస్, హెలినాల రిలేషన్, ఎమోషన్ అంత ఇంపాక్ట్ చూపించదు. కనీసం పార్తీబన్ కేసులో అయినా భార్య, పిల్లల ఎమోషన్ ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. లియోకు అదే ప్రధాన సమస్య. ఖైదీలో పాప ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. విక్రమ్‌లో మనవడి కోసం తాత పోరాడే ఎమోషన్ ఆకట్టుకుంటుంది. కానీ లియోలో అది కనిపించదు. వెరసి లియో సాదాసీదా సినిమాగా నిలిచింది.

    కొంతలో కొంత ఏంటంటే.. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, విక్రమ్‌లోని వేశ్య పాత్రను ఇందులో చూపించి ఎల్ సీ యూని కనెక్ట్ చేశాడు. చివరకు లియోకి విక్రమ్ ఫోన్ చేస్తాడు. అలా లింక్ చేసి వదిలి పెట్టడంతో నెక్ట్స్ పార్టులో విక్రమ్, లియోలు కలిసి పని చేస్తారని చెప్పకనే చెప్పాడు. రోలెక్స్‌ మీద విక్రమ్, డిల్లీ, లియోలు పోరాడతారనిపిస్తోంది.

    లియోలో ప్రథమార్దం కాస్త గ్రిప్పింగ్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్ మాత్రం బోరింగ్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే గందరగోళంగా అనిపిస్తుంది. ఆ మూడ నమ్మకం ఏంటో.. కూతురిని బలి ఇవ్వడం ఏంటో.. అసలేం అర్థం కాకుండా పోతుంది. నువ్వు లియో అని ఒప్పుకో అని విలన్లు పార్తీబన్ వెంటపడుతుంటారు. ఒప్పుకుంటే ఏం చేస్తారు? ఏం అవుద్ది? అన్నది మాత్రం జనాలకు అర్థమే కాదు. అసలు లియోను పట్టుకోవాలా? చంపాలా? విలన్ల ప్లాన్ ఏంటి? అన్నది ఎవ్వరికీ అంతు పట్టదు. ఇలా గందరగోళంగా మారిన సెకండాఫ్ సినిమాను ముంచేసింది. క్లైమాక్స్‌లో బీభత్సమైన యాక్షన్ సీక్వెన్ పెట్టాడు లోకి.

    సాంకేతికంగా సినిమా ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం, అనిరుధ్ ఆర్ఆర్, ఫిలమిన్ ఎడిటింగ్ బాగుంటుంది. కారు చేజింగ్ సీన్లో వీఎఫ్ఎక్స్ తేలిపోయింది. నిర్మాత బాగానే ఖర్చు పెట్టాడు. కానీ ఫలితం మాత్రం రాబట్టుకోలేకపోయాడు.

    రేటింగ్ : 2.5
    బాటమ్ లైన్ : లియో అనాల్సిందే అయ్యో పాపం