- October 20, 2023
టైగర్ నాగేశ్వరరావు రివ్యూ.. మంచి దొంగ!

Tiger Nageswara Rao Review టైగర్ నాలుగేశ్వరరావు సినిమా మీద ముందు నుంచి టీం అంతా ఎంతో నమ్మకంగా ఉంది. అసలు టీజర్ చూసే వరకు టైగర్ నాగేశ్వరరావు మీద జనాలకు అంతగా ఇంట్రెస్ట్ అయితే కలగలేదు. కానీ టీజర్, ట్రైలర్‌లు సినిమా స్థాయిని పెంచేశాయి. దసరా బరిలోకి నేడు టైగర్ నాగేశ్వరరావు సినిమా దిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
స్టువర్టుపురం అంటే మనకు ఇన్నాళ్లు దొంగల ముఠా, దొంగల పేర్లు, అక్కడి గజదొంగల పేర్లు మాత్రమే తెలుసు. అందులో నాగేశ్వరరావు పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మూవీ కూడా ఆయన జీవిత చరిత్ర ఆధారంగానే తెరకెక్కించారు. స్టువర్టుపురం నాగేశ్వరరావు.. టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు? ఎందుకు మారాడా? పీఎం ఆఫీస్‌లోనే చెప్పి మరీ దొంగతనం ఎందుకు చేశాడు? ఆ తరువాత పీఎం తీసుకున్న నిర్ణయం ఏంటి? స్టువర్టుపురం కోసం టైగర్ ఏం చేశాడు? ఏకఛత్రాదిపతి స్టువర్టుపురాన్ని ఏలుతున్న ఎలమందను టైగర్ చివరకు ఏం చేశాడు? అన్నది కథ.
నటీనటులు
టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ అద్భుతంగా నటించేశాడనే చెప్పాలి. మామూలుగా అయితే ఇది రవితేజ లాంటి హీరో చేయాల్సిన పాత్ర లేదు. కామెడీకి గానీ, కమర్షియల్ అంశాలకు గానీ చోటు లేని ఓ సీరియస్ డ్రామా. ఇందులో రవితేజ తన శైలిని పక్కన పెట్టి ఎంతో హుందాగా నటించాడు. మాస్‌ను మెప్పించేందుకు భారీ యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్లు ఉన్నంత మేరకు మెప్పించారు. కానీ వారి వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం ఉండదు. హరీష్ పేరడి విలనిజం బాగుంటుంది. జిషు సేన్ గుప్తా కారెక్టర్ మెప్పిస్తుంది. రేణూ దేశాయ్ పాత్ర ఎంతో హుందాగా అనిపిస్తుంది. నాజర్ పాత్ర, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ పాత్రలే కథను ముందుకు తీసుకెళ్తాయి. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.
విశ్లేషణ
టైగర్ నాగేశ్వరరావు కథను చెప్పాలనుకోవడమే ఓ సాహసం. స్టువర్టుపురం పరువుతీసేందుకు ఇలా సినిమా తీస్తున్నారని, సినిమాను ఆపేయాలంటూ వారంతా నిరసనకు దిగారు. కానీ సినిమా చూస్తే స్టువర్టుపురం మీద మనకు జాలి కలుగుతుంది. సమాజం, పరిస్థితులు, పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి అక్కడి వారి బతుకుని ఎలా సమాధి చేశాయో అర్థం అవుతుంది. అదంతా నిజ జీవితంలో జరిగిందా? లేదా? అన్నది తెలియదు. కానీ తెరపై చూస్తే మాత్రం స్టువర్టుపురం మీద జాలి కలుగుతుంది.
తినడానికి తిండి దొరకని సమయం.. పని చేసుకోవడానికి ఏ దిక్కు కనిపించని టైంలో దొంగతనమే దిక్కైందని, కడుపు నింపుకునేందుకు దొంగలుగా మారాల్సి వచ్చిందంటూ స్టువర్టుపురం కథను ఎంతో ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు. టైగర్ నాగేశ్వరరావును ప్రథమార్దంలో క్రూరుడిగా చూపిస్తారు. ఆడదాన్ని కడుపులో తన్నే నీచుడిగా చూపిస్తారు. వేశ్యల దగ్గరకు వెళ్లి జల్సాలు చేసే వాడిలా చూపిస్తారు. దారి దోపిడీలు, దొంగతనాలు చేసే నేరస్తుడిగానే చూపిస్తారు.
కానీ సెకండాఫ్‌లోనే టైగర్ చేసిన ఒక్కో పని వెనుకున్న సదుద్దేశాన్ని చూపిస్తాడు. అప్పటి వరకు గజ దొంగ అనుకున్న టైగర్.. మంచి దొంగలా ప్రేక్షకుడికి కనిపిస్తాడు. రాబిన్ హుడ్‌లా కనిపిస్తాడు. ఉన్నవాడి దగ్గర కొట్టేసి.. లేనోడికి పెట్టే దేవుడిలా అనిపిస్తాడు. టైగర్‌ను ఫస్ట్ హాఫ్‌లో విలన్‌గా, రెండో భాగంలో హీరోగా చూపిస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే వంశీ టాలెంట్‌కు ఓ ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది.
వంశీ ఈ సినిమా కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో నిడివి ప్రధాన సమస్య అవుతుంది. అనవసరంగా వచ్చే పాటలు, ప్రేమ సన్నివేశాలు కథలోని ఎమోషన్‌ను నీరుగార్చినట్టుగా అనిపిస్తుంది. అవన్నీ తీసేసి ఉంటే సినిమా ఇంకో స్థాయిలో ఉండేది.
ఫస్ట్ హాఫ్ ఎంత వేగంగా, ఎంత ఊపుతో ఉంటుందో.. రెండో భాగం అంత నీరసంగా సాగుతుంది. ఇలా సినిమాలో కొన్ని లోపాలున్నా కూడా టెక్నికల్ స్టాండర్డ్స్ వల్ల సినిమా నిలబడింది. మాటలు గుండెలను తాకుతాయి. జీవీ ప్రకాష్ బ్యాక్ గ్రౌండ్ నెక్ట్స్ లెవెల్ అనిపిస్తుంది. మధి సినిమాటోగ్రపీ మెప్పిస్తుంది.నాటి కాలాన్ని ప్రతిబింబించేలా వేసిన సెట్స్ బాగున్నాయి. నాటి రోజుల్లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడంలో టీం సక్సెస్ అయింది. నిర్మాత పెట్టిన డబ్బులకు లాభాలు వస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ.. టైగర్ నాగేశ్వరరావు, స్టువర్టుపురం మీద మాత్రం సింపతీ కలిగించడంలో టీం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. చదువుకుంటే దొంగగా మారాల్సిన పని లేదని, సమాజంలో గౌరవం వస్తుందని ఇచ్చిన సందేశం బాగుంది.
రేటింగ్ 3
బాటమ్ లైన్ : తెలిసిన కథ.. తెలివైన కథనం