Shyam Singha Roy Review : శ్యామ్ సింగ రాయ్ రివ్యూ.. సీరియస్సే కానీ!

Shyam Singha Roy Review : శ్యామ్ సింగ రాయ్ రివ్యూ.. సీరియస్సే కానీ!

    Shyam Singha Roy Movie Review న్యాచురల్ స్టార్ నాని సినిమా అంటే అందరికీ మినిమం నమ్మకం ఉంటుంది. అలాంటి నానికి సాయి పల్లవి తోడైతే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు చూసి ఈ సినిమా మీద బజ్ భాగానే పెరిగింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించాడు. నేడు (డిసెంబర్ 24) ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. నాని శ్యామ్ సింగ రాయ్‌గా మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం.

    కథ

    వాసు (నాని) అనే ఓ కుర్రాడు దర్శకుడిగా ఎదగాలని కలలు కంటాడు. ఇందుకోసం ఓ షార్ట్ ఫిల్మ్ చేయాలని అనుకుంటాడు. కీర్తి (కృతి శెట్టి)ని ఆ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్‌గా తీసుకుంటాడు. నానా తంటాలు పడి ఆమెను ఒప్పిస్తాడు. అయితే షార్ట్ ఫిల్మ్ తీసి నిర్మాతను మెప్పించిన వాసు.. సినిమాకు చాన్స్ కొట్టేస్తాడు. ఉనికి అనే సినిమాను తీస్తాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దాన్ని హిందీలో రీమేక్ కూడా చేయాలనే ఆఫర్లు వస్తాయి. అయితే అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఉనికి సినిమా అస్థిత్వం అనే బెంగాలీ నవలకు కాపీ అంటూ ఎస్ఆర్ పబ్లికేషన్ కోర్టులో కేసు వేస్తుంది. దీంతో అసలు కథ యూటర్న్ తిరుగుతుంది. బెంగాలీ తెలియని వాసు.. అసలు ఆ పుస్తకాలే తెలియని వాసు ఆ కథ ఎలా రాశాడు? ఆ ఎస్ ఆర్ పబ్లికేషన్‌కు వాసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ఆ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? ఆయన రచనలకు, కథలకు వాసుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది శ్యామ్ సింగ రాయ్.

     

    నటీనటులు

    వాసు పాత్రలో మోడ్రన్ లుక్కులో నాని ఆకట్టుకుంటాడు. అల్లరిచిల్లరగా, యూత్‌ను ఆకట్టుకునేలా ఆ పాత్ర ఉంటుంది. అందులో నాని సులభంగా నటించేశాడు. ఇక శ్యామ్ సింగ రాయ్ అనే పాత్రే సినిమాకు మూలం. అందులో నాని జీవించేశాడు. ఆ కట్టు, మీసంకట్టు, బాడీ లాంగ్వేజ్, పలికే మాట తీరు అన్నీ కూడా నాని అదరగొట్టేశాడు. నాని యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రతీ ఒక్క యాంగిల్‌లో ప్రేక్షకుడిని మెప్పిస్తాడు.

    ఇక నాని తరువాత సాయి పల్లవికే వంద మార్కులు పడతాయి. క్లైమాక్స్‌లో మాత్రం సాయి పల్లవిని చూడటం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సాయి పల్లవి ఉన్నంత సేపు స్క్రీన్ మీద ఆమెను మాత్రమే చూడాలనిపిస్తుంది. ఆమె చూపులు, నవ్వులు, నాట్యం ఇలా ప్రతీ ఒక్కటీ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సినిమాకు సాయి పల్లవి ప్రాణంగా నిలిచింది.

    ఇక మిగిలిన పాత్రలైన కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు ఉన్నంతలో ఆకట్టుకున్నారు. ఉప్పెన చూసి కృతి శెట్టిని బేబమ్మలా మాత్రమే ఊహించుకుని ఉంటారు. ఇందులో సిగరెట్లు తాగుతూ మోడ్రన్ గెటప్‌లో రచ్చ చేసింది. ఇక రొమాంటిక్ సీన్‌లోనూ రెచ్చిపోయి నటించేసింది. అభినవ్ గోమఠం, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పరిధి మేరకు చక్కగానే నటించారు. కానీ చివర్లో రాహుల్ రవీంద్రన్ గెటప్ చూస్తే నవ్వొస్తుంది.

     

    విశ్లేషణ

    శ్యామ్ సింగ రాయ్ కథలో కాస్త ఇంట్రెస్ట్ వచ్చే ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అది కేవలం సెకండాఫ్‌లోని సాయి పల్లవి సీన్సే. అందులో తప్పా మిగతా అంతా కూడా సినిమా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఇక సాయి పల్లవి, నానిల సీన్స్ మాత్రం అదిరిపోయేలా రాసుకున్నాడు. ఇక మరీ ముఖ్యంగా సాయి పల్లవి ఇంట్రడక్షన్ సాంగ్ మామూలుగా ఉండదు. అలా కొన్ని హైలెట్ అవుతున్నాయనుకున్న మూమెంట్స్‌ను డైరెక్టర్ రాహుల్ బాగానే డిజైన్ చేసుకున్నాడు.

    సాయి పల్లవికి ఎలాంటి ఫ్రేమ్స్ పెడితే జనాలు కనెక్ట్ అవుతారో బాగానే పట్టేసుకున్నాడు. అయితే కథలో ఏం చెప్పాలని అనుకున్నాడు.. అసలు ఎటు వెళ్తోంది.. ఆ కేసు, ఆ కోర్టులో వాదనలు మాత్రం జనాలకు కనెక్ట్ కావు. కొన్ని సీన్లు నవ్వు తెప్పించేలా ఉంటాయి. ట్విస్ట్‌లు అనుకున్నవేవీ కూడా జనాలకు కనెక్ట్ కాలేదు. సినిమాలో సీరియస్ నెస్ ఉన్నట్టే ఉంటుంది. కానీ అది జనాలకు కనెక్ట్ కాదనిపిస్తోంది.

    క్లైమాక్స్ మాత్రం పూర్తిగా దెబ్బేసినట్టు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సాయి పల్లవిని చివర్లో అలా వయసు మళ్లిన మేకప్‌లో చూడలేకపోతారు. మొత్తానికి డైరెక్టర్ అనుకున్న ఎమోషన్ మాత్రం జనాలకు కనెక్ట్ కాకపోవచ్చు. అలా ఈ సినిమాకు ప్రథమార్థంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ద్వితీయార్థంలో సాయి పల్లవి, దేవదాసీ వ్యవస్థ చుట్టూ ఉండే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం హైలెట్ అయ్యాయి.

    శ్యామ్ సింగ రాయ్ సినిమాకు సంగీతం, కెమెరా, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ జీవం పోశాయి. పాటలు, నేపథ్య సంగీతం అందరినీ మెప్పిస్తుంది. నాటి కాలంలోకి కెమెరామెన్ తీసుకెళ్లాడు. టెంపుల్ సెట్ మాత్రం నిజంగానే అదిరిపోయింది. మాటలు కొన్ని చోట్ల మనసుకు హత్తుకుంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

    రేటింగ్ 2.5

    చివరగా.. శ్యామ్ సింగ రాయ్.. ఇది చాలదోయ్!

    Leave a Reply