Akhanda Review : అఖండ రివ్యూ.. మాస్‌, ఎలివేషన్లకు కేరాఫ్ అడ్రస్

Akhanda Review : అఖండ రివ్యూ.. మాస్‌, ఎలివేషన్లకు కేరాఫ్ అడ్రస్

    Akhanda Telugu Movie Review మాస్ పల్స్ తెలిసిన దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎలాంటి మీటర్‌లో ఏ హీరోకు ఎంత మోతాదులో సీన్లు,ఎలివినేషన్లు పెట్టాలో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను.అయితే ఒక్కోసారి బోయపాటి అంచనాలు కూడా తప్పాయి. కానీ బాలయ్యతో బోయపాటి అంటే అడ్డూ అదుపూ ఉండదు.ఎంత రెచ్చిపోయినా కూడా అభిమానులు అంగీకరిస్తారు. అలా ఇప్పుడు సింహా, లెజెండ్ తరువాత అఖండ అంటూ వచ్చాడు. ముందు నుంచి అఘోర పాత్రపై అందరికీ అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఇప్పుడు అందుకున్నారా? లేదా? అన్నది చూద్దాం.

    కథ
    అఖండ కథ అనంతపురంలో జరుగుతుంది. అక్కడ మురళీ కృ‌ష్ణ (బాలకృష్ణ) ఫ్యాక్షన్‌ను అంతం చేసి అందరి చేత వ్యవసాయాన్ని చేయిస్తుంటాడు. అక్కడి మైనింగ్ ఏరియాను వరదరాజులు (శ్రీకాంత్) శాసిస్తుంటాడు. యురేనియం తవ్వకాలతో ప్రజలంతా ఇబ్బంది పడతారు. వరదరాజులను ఎదురించేందుకు మురళీ కృష్ణ నిలబడతాడు. అయితే మురళీ కృష్ణకు ఏర్పడిన ప్రమాదం ఏంటి? ఆయన కుటుంబాన్ని వరదరాజులు ఏం చేశాడు? అఖండ పాత్ర ఎంట్రీతో ఏం జరిగింది? అసలు అఖండ పాత్రకు మురళీ కృష్ణకు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ శరణ్య పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ఏంటన్నదే మిగతా కథ.

    నటీనటులు
    మురళీ కృష్ణ పాత్రలో బాలయ్య అందంగా కనిపిస్తాడు. ఇక అఘోర పాత్రలో బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించేస్తాడు. అఘోర పాత్ర ఎంట్రీతో సినిమా మరో లెవెల్‌కు వెళ్తుంది. యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్సులు, డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులకు కన్నుల పండువగా అనిపిస్తాయి. బాలయ్య పడిన కష్టం మాత్రం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక శ్రీకాంత్‌కు ఇది కొత్త తరహా పాత్ర. మరీ కెరీర్ టర్న్ అయ్యే కారెక్టర్ అని చెప్పలేం. కానీ శ్రీకాంత్ మాత్రం విలనిజాన్ని పండించాడు. ఇక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కు రెండు మూడు మంచి సీన్లు పడ్డాయి. జగపతి బాబు, పూర్ణ వంటి వారు మెప్పించారు.

    విశ్లేషణ
    మాస్ హీరో.. అంతకు మించి అనేలా తీసే మాస్ డైరెక్టర్. ఇక జనాలు కోరుకునేది కూడా ఎలివేషన్లు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, మాస్ సాంగ్, స్టెప్పులు. ఇవి మాత్రమే కోరుకునే వారికి అఖండ అద్బుతంగా అనిపిస్తుంది. కానీ కథ, కథనం, కథలోని ఎమోషన్ వంటివి కావాలంటే మాత్రం నిరుత్సాహ పడతారు. సింహ, లెజెండ్ తరహాలోనే ఇందులోనూ భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు పెట్టాడు బోయపాటి.

    కథ గురించి ఆలోచిస్తే ఎక్కడా ఎవ్వరికీ ఏమీ తోచదు. అసలు జనాలను ఆ కోణంలోంచి ఆలోచించుకుండా ఉండేందుకే నిమిషానికో ఓ ఎలివేషన్, ఫైట్ అన్నట్టుగా సినిమాను ముందుకు కొనసాగించాడేమోననిపిస్తుంది. మాస్‌ను ఆకాశమంత ఎత్తులో చూపించాలంటే అది బోయపాటి వల్లే సాధ్యమని మరోసారి నిరూపించాడు.అయితే బోయపాటి చేసే అతి ఒక్కోసారి వర్కవుట్ కాదు.

    కానీ బాలయ్య విషయంలో మాత్రం బోయపాటి ఎంత అతి చేసినా అది కన్విన్సింగ్‌గానే ఉంటుంది. ఈ అఖండలోనూ అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు హీరోనే దేవుడిలా మార్చేస్తుంటాడు బోయపాటి. అలాంటిది దేవుడు, దైవాంశ సంభూతుడినే అఖండ పాత్రలో హీరోగా చూపిస్తే ఇక యాక్షన్ సీక్వెన్సులు, ఎలివేషన్లకు కొదవేం ఉంటుంది.

    అలా సినిమాలో మాస్ ప్రేక్షకులను కట్టిపడేసే సీన్లు ఎన్నో ఉంటాయి. ఇక తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నిలబెట్టేశాయి. కెమెరా, ఎడిటింగ్ ఇలా ప్రతీ ఒక్క డిపార్ట్మెంట్ కష్టం తెరపై కనిపిస్తుంది. మిర్యాల రవీందర్ రెడ్డి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఖర్చు చేశాడు.

    రేటింగ్ 2.5

    చివరగా : బాలయ్య అఖండ.. మాస్‌కు కడుపునిండా

    Leave a Reply