- December 10, 2021
Lakshya Movie Review : గురి తప్పిన ‘లక్ష్య’

యంగ్ హీరో నాగ శౌర్య ఓ మంచి సక్సెస్ కోసం చాలానే పరితపిస్తున్నాడు. ఛలో వంటి బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ మళ్లీ ఇంత వరకు ఆ స్థాయి సక్సెస్‌ను చవి చూడలేకపోయాడు. అయితే వరుడు కావలెను అనే సినిమాతో ఓ మోస్తరు విజయం దక్కింది. ఇక ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వచ్చిన లక్ష్య సినిమాలో విలు విద్యలో ఆరితేరిన విలుగాడిలా నాగ శౌర్య కనిపించాడు. డిసెంబర్ 10న అంటే నేడు విడుదలైన లక్ష్య ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
తన కొడుకు సాధించలేని ఘనతను మనవడితో సాధింపజేయాలని తాత పడే తపనే ఈ లక్ష్య. తాత పాత్రలో సచిన్ ఖేదేకర్ నటించాడు. మనవడి పాత్ర పార్థుగా నాగ శౌర్య కనిపించాడు. అయితే తాత శిక్షణలో పార్దు రాటు దేలుతాడు. కానీ పార్థుకి ఓ బలహీనత ఉంటుంది. తాను పోటీల్లో ఉన్నప్పుడు తాత పక్కన ఉంటే తప్పా గురి చూసి కొట్టలేడు. దీంతో తాత మరణంతో పార్థు జీవితం మొత్తం మారుతుంది. అలాంటి పార్థు చివరకు ఎలా మలుపు తిరిగింది, ఆర్చరీలో వరల్డ్ చాంపియన్‌గా ఎలా ఎదిగాడు? ఇందులో రితిక (కేతిక శర్మ) పాత్ర ఏంటి? జగపతి బాబు రోల్ ఎంత వరకు ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానమే లక్ష్య.
నటీనటులు
పార్థు పాత్రలో నాగ శౌర్య అద్బుతంగా నటించాడు. పార్థు పాత్రలో వచ్చే మార్పులు, జీవితంలో జరిగే ఘటనలకు తగ్గట్టుగా తన లుక్స్, బాడీని మార్చుకునేందుకు నాగ శౌర్య పడ్డ కష్టం తెర మీద కనిపిస్తుంది. నాగ శౌర్య నటనలో కొత్త కోణం ఆవిష్కరించినట్టు ఉంటుంది. లుక్స్ పరంగా నాగ శౌర్య మాత్రం మరో లెవెల్‌లో ఉంటాడు. లక్ష్య చిత్రం మొత్తం కూడా పార్థు చుట్టే తిరుగుతుంది. దానికి తగ్గట్టుగా నాగ శౌర్య సినిమాను మోశాడు. ఇక సచిన్ ఖేడేకర్, జగపతి బాబుల తమ అనుభవాన్ని చూపించాడు. ఇక కేతిక శర్మ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రొమాంటిక్ సినిమాలో కనిపించిన కేతిక శర్మకు లక్ష్య సినిమాలో కనిపించిన కేతిక వర్మకు ఎంతో తేడా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అందరూ తమ పరిధి మేరకు నటించారు.
విశ్లేషణ
అసలు స్పోర్ట్స్ డ్రామా అంటేనే అందరికీ తెలిసిన ఫార్మూలా. చివరకు హీరో గెలుస్తాడు. హీరోకు ఆటలో ఆటంకాలు ఏర్పడటం, మధ్యలో నిషేధాలు రావడం వంటివి ఉంటాయని ఊహిస్తుంటారు. అలానే ఈ చిత్రంలోనూ ఉంటుంది. లక్ష్య సినిమాలోని ఎమోషన్ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.
ఓడిపోయి జీవితంలో దెబ్బ తిని మళ్ళీ గెలిచినవాడిగా హీరోను చూపించాలనే కోణంలో ఈ మధ్యలు బాగానే వస్తున్నాయి. జెర్సీ కూడా అందులోంచి వచ్చిందే. జీవితంలో ఎంతో అథమ స్థాయికి చేరుతారు.. ఆ తరువాత అత్యున్నత స్థానంలోకి వెళ్లిపోతారు. అయితే ఈ ఒడిదుడుకులతో పాటు, జనాలను కనెక్ట్ చేసే ఎమోషన్ ఉంటేనే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ ఎమోషన్ లక్ష్యలో మిస్ అయినట్టు కనిపిస్తుంది.
ఇందులో ఆర్చరీ గురించి చూపిస్తాం.. మరిచిపోయిన విద్యను భారత దేశానికి చూపిస్తామంటూ లక్ష్య ప్రమోషన్స్‌లో చెప్పింది చిత్రయూనిట్. విలు విద్య గురించి అందరికీ తెలుసు. పురాణ కథల్లో ఎక్కువగా విలు విద్యకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఇది మన దేశంలోనే పుట్టిన విద్య అని అందరికీ తెలుసు. అయితే ఇంత వరకు ఆర్చరీ బేస్డ్ సినిమా రాలేదు.
ఆ కోణంలో ఆలోచించి ఈ కథను రాసుకోవడం అభినందించదగ్గ విషయమే. కానీ ఈ స్పోర్ట్స్ డ్రామాను జనాలకు కనెక్ట్ చేయడంతో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. సినిమా ప్రథమార్థం మరీ నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. సచిన్ ఖేడెకర్ పాత్ర మరణానంతరం సినిమా కాస్త మలుపు తిరిగినట్టు అనిపిస్తుంది.
సెకండాప్‌లో జగపతి బాబు పాత్ర కాస్త ఓవర్ అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మరీ నిరాసక్తిగా సాగుతుంది. అందులో వాడిన గ్రాఫిక్స్ పనితనం అందరికీ నవ్వు తెప్పిస్తుంది. కాలభైరవ సంగీతం కూడా సినిమాను నిలబెట్టలేకపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి. నాగ శౌర్య సినిమా కథలో కూడా భాగస్వామి అయ్యాడట. మరి ఇద్దరూ కలిపి వండటంతో ఇలా తయారైందో ఏమో గానీ లక్ష్య గురి మాత్రం తప్పింది.
చివరగా.. ‘లక్ష్య’కు లక్ష్యం లేకుండా పోయింది!
రేటింగ్ 2.5