Pushpa Review : పుష్ప మూవీ రివ్యూ.. నీయవ్వ తగ్గేదేలే!

Pushpa Review : పుష్ప మూవీ రివ్యూ.. నీయవ్వ తగ్గేదేలే!

    Pushpa Movie Review In Telugu అల్లు అర్జున్ సుకుమార్ సినిమా అంటే అందరికీ ఉండే అంచనాల గురించి తెలిసిందే. ఇక ఈ సారి పాన్ ఇండియన్ లెవెల్లో రాబోతోండటంతో దానికి తగ్గట్టే సినిమాను తెరకెక్కించారు. పుష్ప మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. నేడు (డిసెంబర్ 17) పుష్ప వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. మొత్తానికి పుష్ప కథ, కథనాలు, అల్లు అర్జున్ పర్ఫామెన్స్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పుష్ప కథ ఏంటో ఓ సారిచూద్దాం.

    కథ
    పుష్ప.. పుష్ప రాజ్ (అల్లు అర్జున్) ఇలా పేరు బాగానే ఉంది. కానీ దానికి ఇంటి పేరు మాత్రం ఉండదు. అక్రమ సంతానం అంటూ గేలి  చేస్తుంటారు. అలాంటి పుష్ప చిన్నస్థాయి నుంచి గంధపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్ లీడర్‌గా ఎదుగుతాడు. కానీ ఎంత ఎదిగినా కూడా ఈ ఇంటి పేరు లేదనే కారణంతో అవమానాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. అలా కొత్తగా వచ్చిన పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ (ఫాహిద్ ఫాజిల్) కూడా బ్రాండ్, ఇంటి పేరు లేదని పుష్పను పరోక్షంగా అవమానిస్తాడు. దానికి బధులుగా షెకావత్‌కు పుష్ప ఘోరమైన అవమానం చేస్తాడు. దాంతో పుష్ప మొదటి పార్ట్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది. ఆ అవమానం ఏంటి?  ఈ కథలో మంగళం శ్రీను (సునీల్), శ్రీవల్లి (రష్మిక), దాక్షాయణి (అనసూయ), జాలి రెడ్డి (ధనుంజయ్) పాత్రలు పుష్ప ప్రయాణంలో ఎలాంటి మలుపులు తిప్పాయో? అంటే సినిమా చూడాల్సిందే.

    నటీనటులు

    పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ తప్పా మరొకరిని ఊహించుకోలేం. పుష్పగా బన్నీ చేసిన సీరియస్ యాక్షన్ సీక్వెన్స్ అయినా, కామెడీ అయినా, ఎమోషన్ అయినా కూడా అదరగొట్టేశాడు. బన్నీ ఈ సినిమాతో నటుడిగా మరోసారి నిరూపించుకున్నాడు. ప్రత్యేకమైన మ్యానరిజంతో ఆకట్టుకున్నాడు. తగ్గేదేలే అనే డైలాగ్‌ను దాదాపు అన్ని ఎమోషన్స్‌లో పలికించేశాడు. కామెడీ, సీరియస్, రొమాంటిక్ సన్నివేశాల్లోనూ బన్నీ తగ్గేదేలే అనిపించుకున్నాడు. పుష్ప ఇగో చుట్టే ఈ కథ అంతా తిరుగుతుంటే.. దాన్ని బన్నీ తన భుజాల మీద మోసేశాడు.

    ఇక ఈ సినిమాలో బన్నీనే హైలెట్. బన్నీ తరువాత చెప్పుకోవాలంటే మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ, శ్రీవల్లిగా రష్మిక ఇలా అందరూ చక్కగా నటించేశారు. అయితే పుష్ఫలో వీరంతా అలా అవసరానికి వచ్చేసి వెళ్లిపోతున్నట్టు కనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రను పాటలకు, కొన్ని రొమాంటిక్ సీన్లకు మాత్రమే తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే రష్మిక కొన్ని చోట్ల మెప్పిస్తే.. ఇంకొన్ని చోట్ల అతితో చిరాకు పుట్టిస్తుంది. ఇక సునీల్‌కు గట్టిగా ఐదారు సీన్లు పడి ఉంటాయి. దాక్షాయణిగా అనసూయ మరీ అంత గొప్పగా ఏమీ అనిపించలేదు.

    రెండో పార్ట్‌లో అనసూయ, సునీల్ పాత్రలు ఎక్కువగా ఉండేట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఈ చిత్రంలో సెకండాఫ్ చివర్లో ఎంట్రీ ఇచ్చిన ఫాహిద్ ఫాజిల్ మాత్రం అదరగొట్టేశాడు. షెకావత్ సర్ అంటూ పుష్పతోనే పలికించేశాడు. పుష్ప, షెకావత్ పాత్రల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే అంటూ క్లైమాక్స్‌లో చెప్పే సీన్లలో అద్భుతంగా నటించేశారు. ఇక రెండో పార్ట్‌లో ఈ ఇద్దరి మధ్య సీన్లు పీక్స్‌లో ఉండబోతోన్నట్టు అనిపిస్తున్నాయి. అజయ్, అజయ్ ఘోష్, ధనుంజయ్ ఇలా అందరూ కూడా తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించేశారు.

    విశ్లేషణ

    పుష్ప కథను చెప్పిన విధానం, దానికి ఉన్న నేపథ్యాన్ని సుకుమార్ బాగానే రాసుకున్నాడు. జపాన్, చైనా, చెన్నై, తిరుపతి అంటూ లింక్ కలిపాడు. గంధపు చెక్కలకు ఉన్న విలువ, అవి మన దగ్గరే లభిస్తాయని చెప్పడం కోసం టైలిల్ కార్డ్స్‌‌లో రాసుకున్న విధానం, చెప్పిన విధానం అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతీ సినిమాలో టైటిల్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన సుకుమార్ ఇందులోనూ వెరైటీని ప్రదర్శించాడు. జపాన్ నుంచి చిత్తూరు వరకు కథను రివర్స్‌లో చూపిస్తాడు.

    అయితే ఈ కథలో ఎన్నో రకాల ఎమోషన్స్‌ను సుకుమార్ చూపించాలని ప్రయత్నించినట్టు కనిపిస్తోంది. పుష్ప లక్ష్యం ఏంటన్నది మాత్రం సరిగ్గా చెప్పలేకపోయాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ సామ్రాజ్యానికి అధిపతిలా ఎదగాలని చూశాడా? తనకంటూ లేని ఓ ఇంటి పేరును సంపాదించాలని అనుకున్నాడా? పుష్పలో ఉన్న ఎమోషన్ ఏంటన్నది మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయాడనిపిస్తుంది.

    పుష్ప రాజ్‌ను ఎలివేట్ చేసుకునేందుకు రాసుకున్న సీన్లు, చూపించిన విధానం మాత్రం మాస్ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. మాస్ ఆడియెన్స్‌కు, బన్నీ అభిమానులకు పుష్ప పండుగలానే ఉంటుంది. అయితే కేజీయఫ్ స్టైల్లో సుకుమార్ ఏదో కొత్తగా ట్రే చేద్దామని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కోల్.. ఇక్కడ రెడ్ శాండిల్. అలా డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో కేజీయఫ్ స్థాయిలో పుష్పను తీయాలని సుకుమార్ అనుకున్నాడో ఏమో.

    అందులో ఉన్నట్టుగా తల్లి సెంటిమెంట్ కూడా కాస్త యాడ్ చేశాడు. కానీ ఇందులో పుష్ప అసలు ఉద్దేశ్యం ఏంటన్నది మాత్రం అర్థం కాకుండా సుకుమార్ రాసేసుకున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి సుకుమార్ మాత్రం రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేసినట్టు అనిపిస్తుంది. ఢీ అంటే ఢీ అని కొట్టేసుకునేందుకు షెకావత్, పుష్ప రెడీ అయినట్టు చూపించాడు.

    బ్రాండ్ అంటే వేసుకునే బట్టల్లో కాదు.. బతుకులో ఉంటుందన్న పుష్ప చెప్పే డైలాగ్స్, బ్రాండ్ గురించి చెప్పే డైలాగ్స్ పుష్పగా కాకుండా అల్లు అర్జున్‌గా చెప్పినట్టు అనిపిస్తుంది. పుష్ప సినిమాకు పాటలు ప్లస్ కాగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నంత స్థాయిలో లేదనిపిస్తుంది. సమంత స్పెషల్ సాంగ్ థియేటర్లో కాస్త ఊపును తీసుకొస్తుంది. కెమెరావర్క్ మాత్రం అందరినీ కట్టిపడేస్తుంది. అడవిలోని అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా సినిమా లెంగ్త్ మాత్రం అందరినీ విసిగించేస్తుంది. మరీ అంత నిడివి ప్రేక్షకులను పరీక్షలా అనిపిస్తుంది. మైత్రీ మూవీస్ తమ స్థాయికి తగ్గట్టు సినిమాను నిర్మించారు.

    రేటింగ్ : 2.75

    చివరగా.. పుష్ప రాజ్ ఫ్లవర్ కాదు ఫైరే!, పుష్ప రాజ్ తగ్గేదేలే అన్నాడు.. కానీ కాస్త నిడివి తగ్గిస్తే బాగుండేదేమో.

    Leave a Reply