• January 13, 2023

Waltair Veerayya Movie Review : వాల్తేరు వీరయ్య రివ్యూ.. అభిమానివని నిరూపించుకున్నావయ్యా

Waltair Veerayya Movie Review : వాల్తేరు వీరయ్య రివ్యూ.. అభిమానివని నిరూపించుకున్నావయ్యా

    Waltair Veerayya Movie Review ఓ అభిమాని దర్శకుడైతే.. తన హీరోను ఎలా చూపిస్తాడో ఎన్నో సార్లు నిరూపితమైంది. ఓ అభిమాని తన హీరోను తెరపై ఎలా అయితే చూడాలని అనుకుంటాడో.. అలా చూపిస్తూ సినిమాలను తీయడం ఓ ఆర్ట్. అందులో బాబీ ఇప్పుడు పాసైపోయాడు. మెగాస్టార్ చిరంజీవిని వాల్తేరు వీరయ్యగా చూపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమా ఎలా ఉంది? దాని కథాకథనాలు ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

    సీఐ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్‌) పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌ను, అక్కడి పోలీసులను సాల్మాన్ (బాబీ సింహా), అతని మనుషులు కలిసి ఊచకోత కోసేస్తారు. దీంతో సీతాపతి ఎలాగైనా సాల్మాన్‌ను పట్టుకోవాలని, న్యాయం చేయాలని చూస్తాడు. ఈక్రమంలోనే వాల్తేరు వీరయ్య (చిరంజీవి) గురించి సీతాపతి తెలుసుకుని అతనితో సుపారీ మాట్లాడుకుంటాడు. సాల్మాన్‌ను పట్టుకోవడానికి వాల్తేరు వీరయ్య అండ్ కో మలేషియాకు వెళ్తుంది. అక్కడ హోటల్‌లోనే రిలేషన్ మేనేజర్‌గా అతిథి (శ్రుతి హాసన్‌) పరిచయం అవుతుంది. సాల్మాన్‌ను ఎత్తుకొచ్చే పనిలో భాగంగా వాల్తేరు వీరయ్య ఏం చేశాడు? సాల్మాన్ అన్న మైఖేల్ అలియాస్ కాలా (ప్రకాష్‌ రాజ్‌)కు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఈ కథలో ఏపీసీ విక్రమ్ (రవితేజ) పాత్ర ఏంటి? అసలు వాల్తేరు వీరయ్య టార్గెట్ ఎవరు? చివరకు వాల్తేరు వీరయ్య ఏం చేశాడు అనేది కథ.

    వాల్తేరు వీరయ్య కథ, కథనంలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. అయినా కూడా సినిమా అంతా కూడా అదిరిపోయేలా అనిపిస్తుంది. అనిపించేలా బాబీ చేశాడు. ఆ మ్యాజిక్ ఇక్కడ వర్కౌట్ అయింది. కథ, కథనాలు, అందులోని ట్విస్టులు ప్రేక్షకుల ఊహించేలానే ఉంటాయి. అయితే చిరంజీవి చేత బాబీ చేయించిన కామెడీ, ఎమోషనల్ సీన్స్ అందరినీ మెప్పిస్తాయి. రెండున్నర గంటలు అలా కూర్చుండబెట్టేస్తాయి.

    బాబీ రాసుకున్న కథ పాతథే అయినా.. ట్రీట్మెంట్ మాత్రం బాగుంటుంది. కమర్షియల్ ఎంటర్టైనర్‌కు కావాల్సిన సరుకంతా కూడా కథలో ఉండేలా రాసుకున్నాడు. దానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా తోడైంది. పాటలు కొన్ని వినడానికి, చూడటానికి బాగున్నాయి. రవితేజ, చిరంజీవిలు కలిసి వేసిన స్టెప్పులు ఫ్యాన్స్‌కు నిజంగానే పూనకాలు తెప్పిస్తాయి.

    అన్నాదమ్ముల సెంటిమెంట్‌ను బాగానే ఎలివేట్ చేశాడు బాబీ. ఎమోషనల్ సీన్స్‌లో చిరు మరోసారి అందరినీ ఏడిపించేస్తాడు. పూనకాలు లోడింగ్ అనే క్యాప్షన్‌కు సరిపోయేట్టుగా ఎలివేషన్ సీన్స్ రాసుకున్నాడు బాబీ. మొత్తానికి కథను ప్రేక్షకుడి ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది. ప్రథమార్థం మొత్తం చిరంజీవి నడిపిస్తే.. దిత్వీయార్థంలో రవితేజ ఎపిసోడ్స్ హైలెట్ అవుతాయి. ప్రథమార్థంలో చిరు కామెడీ బ్లాక్‌కు ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోతారు. క్లైమాక్స్‌లో కోర్టు సీన్, చివరి డైలాగ్ కూడా మెప్పిస్తుంది. కెమెరాపనితనం, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మ్ంట్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి.

    వాల్తేరు వీరయ్యగా చిరంజీవి విశ్వరూపం చూపించాడు. ఈ వయసులోనూ స్టెప్పులు వేశాడు. తనలోని గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు. యాక్షన్, ఎమోషన్, కామెడీ ఇలా అన్నింట్లోనూ అదరగొట్టేశాడు. రవితేజ అయితే మరింత పవర్ ఫుల్‌గా కనిపించాడు. చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేలా నటించాడు. ప్రకాష్‌ రాజ్‌కు ఇది అలవాటైన పాత్రే. బాబీ సింహా అవలీలగా నటించేశాడు. శ్రుతి హాసన్‌కు ఈ సినిమా కాస్త ఊపిరినిచ్చేలా ఉంది. నటన, అందం పరంగా ఆమె అందరినీ మెప్పిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, నాజర్, కేథరిన్ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. వీరయ్య గ్యాంగ్ అందరినీ నవ్విస్తుంది.

    రేటింగ్ : 3

    చివరగా : వాల్తేరు వీరయ్య.. చిరు విశ్వరూపమేనయ్య