• November 11, 2023

చంద్రమోహన్ మృతి.. చిరు, పవన్, ఎన్టీఆర్ సంతాపం

చంద్రమోహన్ మృతి.. చిరు, పవన్, ఎన్టీఆర్ సంతాపం

    సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ శనివారం (నవంబర్ 11) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు. ఆయన వయసు 78 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

    ఆయన మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. చిరంజీవి స్పందిస్తూ.. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం.

    నా తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారాయన. ఆ సందర్భంగా ఏర్పడిన మా తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారింది. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు.

    ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ , ఆయన కుటుంబ సభ్యులకు , అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను అని అన్నారు. ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.

    వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను. అని ట్వీట్ వేశాడు.

    చంద్ర మోహన్ కన్ను మూశారని తెలిసి ఆవేదన చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన్ని తెరపై చూడగానే మనకు ఎంతో పరిచయం ఉన్న వ్యక్తినో, మన బంధువునో చూస్తున్నట్లు అనిపించేది. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన నటనను చూపించారు. పదహారేళ్ళ వయసు, సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి, రాధా కళ్యాణం లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. చంద్ర మోహన్‌తో మా కుటుంబానికి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులలో అన్ని తరాలవారికి చంద్రమోహన్ చేరువయ్యారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి  అని పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.