- August 22, 2022
HBD Chiranjeevi : అభిమానులకు ‘అన్నయ్య’..ఆపదల్లో ఉండేవారికి ‘ఆపద్భాంధవుడు’

Chiranjeevi Birthday మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అని అందరికీ గుర్తు చేయాల్సిన పనిలేదు. ఆగస్ట్ 15 స్వాత్రంత్ర్య దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని ఎవ్వరూ పని గట్టుకుని చెప్పం కదా? అలానే తెలుగు వారికి ఆగస్ట్ 22 అనేది చిరంజీవి పుట్టిన రోజు అని చెప్పాల్సిన పని లేదు. ప్రతీ ఒక్కరికీ చిరంజీవి పుట్టిన రోజు తెలుస్తుంది. అదే మెగాస్టార్ ఘనత. చిరంజీవి గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండదు. ఆ తరం ఈ తరం ఏ తరం అయినా కూడా చిరంజీవి ఇమేజ్ మాత్రం నిరంతరం. ఆయన ఖ్యాతి ప్రపంచాంతరాల వరకు విస్తరించి ఉంటుంది.
ఖైదీ అంటూ అభిమానుల గుండెల్లో బంధీ అయిపోయాడు. ‘స్వయంకృషి’తో ఎదిగాడు. ఇండస్ట్రీకే నెంబర్ వన్ అంటూ ‘చాలెంజ్’ విసిరాడు. సాధారణ వ్యక్తులు కూడా స్టార్లు కావాలన్న ఎంతో మంది ‘అభిలాష’లకు కారణమయ్యాడు. మాస్‌ను మెప్పించి స్టేట్ రౌడీగా మారిపోయాడు. యముడికి మొగుడు అంటూ బాక్సాఫీస్‌కు మొగుడయ్యారు. ఘరానా మొగుడు అంటూ ఇండస్ట్రీకి మొగుడయ్యాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి అంటూ ఇండియాను ఆశ్చర్యరిచాడు. తుపానుతో పాటు తుపాను లాంటి కలెక్షన్లు రాబట్టి అందరి చేత ఔరా అనిపించాడు.
మాస్‌కు క్లాసులు చెప్పే ‘మాస్టారు’. బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసే ‘హిట్లర్’. మళ్లీ మళ్లీ ‘చూడాలనివుంది’ అనిపించే గ్రేసు, మాసు కలిగి ఉన్న బిగ్ బాస్. రిక్షావోడు అయినా ముఠామేస్త్రీ అయినా కూడా తన స్టెప్పులతో అందరినీ మెప్పించేశాడు చిరంజీవి. ఇలా ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నంబర్ 150 అయినా ఎన్నెన్నో చిత్రాలు అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అయితే చిరంజీవి అంటే సినిమాలే కాదు.. ఆయనలోని ఇంకో కోణం అందరినీ ఆకట్టుకుంటుంది.
సాయం కావాలని ఆయన ముందుకు వస్తే.. ఆదుకునే ‘ఆపద్భాంధవుడు’.. తన అభిమానులకు ‘అన్నయ్య’. రక్తదానం, నేత్రదానం కోసం పిలుపునిచ్చి.. ఎంతో మంది ప్రాణాలను కాపాడిన, కాపాడుతున్న మహోన్నతమైన భోళా శంకరుడు. ఇప్పుడు చిత్రపురి కాలనిలో సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కట్టబోతోన్న గాడ్ ఫాదర్. ఇలా చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చిరంజీవి గురించి చెప్పాలన్నా, రాయాలన్నా అది సాధ్యం. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక చరిత్ర. దానికి అంతం ఉండదు. అలా చెప్పుకుంటూనే వెళ్లాల్సి వస్తుంది. చిరంజీవి ఇలాంటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని A2ZADDA కోరుకుంటోంది.