• September 1, 2022

ఆచార్య ఓటమిని హుందాగా ఒప్పుకున్న మెగాస్టార్.. దటీజ్ చిరు

ఆచార్య ఓటమిని హుందాగా ఒప్పుకున్న మెగాస్టార్.. దటీజ్ చిరు

    మెగాస్టార్ చిరంజీవికి తత్వం బోధపడింది. సినిమాల్లో విషయం లేకపోతే ప్రేక్షకుడు ఆదరించడని, నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తాడు. ఈ విషయం మహామహులకే తెలుసు. కానీ కొంత మంది మాత్రం వీటికి అతీతులమని భావిస్తుంటారు. తాము కనిపిస్తే చాలు కాసుల వర్షం కురుస్తుందని అంతా భావిస్తుంటారు. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. చివరకు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రమైనా, స్పెషల్‌గా రామ్ చరణ్ ఓ పాత్రను పోషించినా, కొరటాల శివ వంటి స్టార్ దర్శకుడున్నా కూడా ఆచార్యను ఈడ్చి అవతల పారేశారు. రెండో రోజే థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని చిరంజీవి స్టేజ్ మీద ఓపెన్‌గా అందిర ముందు చెప్పేశాడు.

    ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి కొన్ని ఆసక్టికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ మధ్య తెలుగు పరిశ్రమలో ఓ అపోహ ఉండేదని, జనాలు థియేటర్లకు రావడం మానేశారని అనుకున్నారు. అందరూ ఓటీటీలకే అలవాటు పడ్డారని అనుకున్నారు. కానీ వారికి తృప్తినిచ్చే కంటెంట్‌తో సినిమాలు తీస్తే, వారు పెట్టే డబ్బులకు న్యాయం చేసే సినిమాలు వస్తే కచ్చితంగా థియేటర్లకు వస్తారని చిరంజీవి అన్నాడు. దానికి నిదర్శనమే బింబిసార, సీతారామం, కార్తికేయ 2 అని చెప్పుకొచ్చాడు. సినిమాలు బాగుంటే, కంటెంట్ ఉంటే.. థియేటర్‌కు జనాలు వస్తారు.. లేదంటే రెండో రోజే ఖాళీగా ఉంటాయని, అందులో తాను కూడా బాధితుడినేనని చిరంజీవి నవ్వులు పూయించాడు.

    ఇలా సినిమా రెండో రోజే ఖాళీగా ఉందని అందరి ముందు చెప్పడం ఒకెత్తు అయితే.. సినిమా పోయిందని చెబుతూ లైట్ తీసుకోవడం కోసం చిరు వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే కంటెంట్ గురించి అంతమాట్లాడిన మెగాస్టార్.. భోళా శంకర్ వంటి రీమేక్ చేయడం, మారుతి వంటి దర్శకుడితోనూ చేస్తాను అనడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంటుంది.