- November 18, 2021
Pushpa: ‘శ్రీవల్లి’ పాటలో అదే సవాల్‌తో కూడుకున్న అంశం : చంద్రబోస్

Pushpa చంద్రబోస్ పాటలు అంటే నచ్చని తెలుగు శ్రోతలుండరు. ఆయన వ్యక్తీకరించే భావాలు, రాసే పాటలు మనసుకు ఇట్టే హత్తుకుంటాయి. ప్రేమ భాషను చంద్రబోస్ ఎంతో హృద్యంగా రాస్తుంటారు. చంద్రబోస్ రాసిన ప్రేమ గీతాలన్నీ కూడా సూపర్ హిట్టే. పది కాలాల పాటు చెవుల్లో మార్మోగిపోతూ గుండెల్లో నిలిచిపోతాయి. ఇప్పుడు అందరి నోట శ్రీవల్లి పాట వినిపిస్తుంది.
ఇందులో భావ వ్యక్తీకరణ కొత్తగా ఉంటుంది. ప్రేయసిని పొగుడుతూ పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మన పుష్ప రాజ్ మాత్రం కాస్త డిఫరెంట్ కాబట్టి.. పుష్ప పాత్రలోకి దూరి పాటను రాయడం చంద్రబోస్‌కు సవాల్‌గా మారిందట. ఈ మేరకు ఆయన కొన్ని విషయాలను బయటపెట్టేశారు. ‘రంగస్థలం’లో రామలక్ష్మి ఎంత అందగత్తో… ఆమె తనకు ఎంత అపురూపమో చెబుతూ చిట్టిబాబు పాడుకొనే పాట.. ‘ఎంతసక్కగున్నావే..’ అని చంద్రబోస్ తెలిపాడు.
కానీ చిట్టిబాబులా మెత్తనైన వ్యక్తి కాదట పుష్పరాజ్. పొగరున్నోడు. బిరుసున్నోడు. మరి అతను తన ప్రియురాలి పట్ల ఎలా స్పందిస్తాడు? అనేదే శ్రీవల్లి పాటలో చూపించారట. నువ్వేం పెద్ద అందగత్తెవు కాదు… పద్దెనిమిది ఏళ్లు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా అందంగుంటారు అని అందుకే పాటలో రాశారట. ఏ పాట రాసినా అందులో రచయిత కన్పించకూడదని, పాత్ర స్వభావమే దర్శనమివ్వాలని చంద్రబోస్ అంటున్నారు.
అలా రాసినప్పుడే అది ఎక్కువ మందికి చేరవవుతుందట. ‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్ చాలా మొండివాడు. ఎవరికీ తలవంచని మనస్తత్వం. అయినా శ్రీవల్లి అంటే ఇష్టం. తను ఎక్కడా తగ్గకుండా … తన ప్రేయసి కోసం పాట పాడాలి. ఇందులో అదే సవాల్‌తో కూడుకున్న అంశం అని చంద్రబోస్ అన్నారు. మామూలుగా అయితే ప్రియురాలు అద్భుతం.. దేవదూత అంటూ పొగుడుతూ పాటలు చాలా రాశానని, కానీ ఇక్కడ మాత్రం.. ‘ఎవ్వరికీ ఎపుడు తలవంచని నేను… నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను’ అని మొదటి చరణంలో రాశానని అన్నారు.