• August 17, 2022

వైజయంతీ మూవీస్ బ్యానర్ పేరు వెనుకున్న హిస్టరీ ఇదే

వైజయంతీ మూవీస్ బ్యానర్ పేరు వెనుకున్న హిస్టరీ ఇదే

    అశ్వనీదత్ నిర్మాతగా ఎన్నెన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు తీశారు. ఎప్పటికీ నిలిచే ఎన్నో క్లాసిక్ చిత్రాలను నిర్మించాడు. అయితే ఆయన తీసిన సినిమాలు ఎలా ఉన్నా కూడా ముందు ఆయన బ్యానర్ అందరినీ ఆకట్టుకుంటుంది. వైజయంతీ మూవీస్ అని స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. అరుపులు, ఈలలు, గోలలు వినిపిస్తాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కృష్ణావతారంలో మనకు దర్శనమిస్తారు. వైజయంతీ మూవీస్ అనే పేరుని కూడాపెట్టింది ఆయనే. దానికి వెనుక కూడా విచిత్రమైన కథ ఉందట.

    రామారావుతో సినిమా తీయాలనే ఇండస్ట్రీకి వచ్చానని అశ్వనీదత్ అంటారు. అందుకే ముందు కొన్ని సినిమాలు తీసి ఆయన వద్దకు వెళ్లానని, రెండు మూడు వారాలు ఆయన వెనక తిరిగి డేట్స్ సంపాదించాడట అశ్వనీదత్. ఇక ఆయన కాల్షీట్లు ఇచ్చే సమయంలో.. బ్యానర్ పేరు ఏంటని అడిగారట. ఇంకా పెట్టలేదు.. మీరే పెట్టండని అశ్వీనీదత్ కోరారట. దీంతో రామారావు గారు అలా పక్కన చూడటంతో.. కృష్ణుడి రూపంలో ఆయన చిత్రం ఉందట. అందులో వైజయంతీమాల కనిపించిందట.

    కృష్ణుడి మెడలో ఉండే వైజయంతీ మాల ఎప్పటికీ వాడిపోదు.. ఎప్పటికీ అలానే ఉంటుంది.. వైజయంతీ మూవీస్ అని పెడతామని పెట్టేశారట. అలా వైజయంతీ మూవీస్ అని నామకరణం చేశారట. అయితే ఎన్టీ రామారావు పూర్తిగా రాజకీయాల్లోకి రావడంతో ఆయన కృష్ణుడిరూపంలో ఉన్న బొమ్మనే వైజయంతీ బ్యానర్ ఎంబలమ్‌గా ఫిక్స్ చేశానని అశ్వనీదత్ తెలిపాడు. అంతకుముందు రాధాకృష్ణుల బొమ్మ ఉండేదట.