- August 22, 2025
బన్ బటర్ జామ్ రివ్యూ.. తల్లులు దిద్దిన ప్రేమ కథ

తమిళంలో హిట్ అయిన బన్ బటర్ జామ్ మూవీని తెలుగులోకి తీసుకు వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ చూస్తే ఈ కథ జెన్ జీ బ్యాచ్‌కు కనెక్ట్ అవుతుందని తెలుస్తోంది. మరి ఈ బన్ బటర్ జామ్ తెలుగు ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుందో చూడాలి.
కథ
లలిత (శరణ్య) మరియు ఉమ (దేవ దర్శిని) ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు ఏవీ శాశ్వతంగా ఉండటం లేదని తెలుసుకుని ఆందోళన చెందుతారు. దీనికి పరిష్కారంగా, తమ ఇంటర్ చదువుతున్న పిల్లలు చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆద్య ప్రసాద్) లకు పెళ్లి చేయాలనుకుంటారు. వీరిద్దరినీ ఒకే చోట ఉంచేందుకు లలిత ఇంటి పక్కనే ఉమ ఇల్లు అద్దెకు తీసుకుంటుంది.
అయితే, కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. చంద్రు ఇప్పటికే నందిని (భవ్య త్రికా) అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు, మధుమిత కూడా ఆకాష్ (వీజే పప్పు)తో ప్రేమలో ఉంటుంది. ఈ క్రమంలో, ఇద్దరు తల్లులు వేసిన ప్లాన్‌లు ఎలా బెడిసికొట్టాయి? లేదా సక్సెస్ అయ్యాయా? అనేది కథ యొక్క ప్రధాన అంశం.
ఈ ప్రేమకథల్లో చంద్రు తన ప్రాణ స్నేహితుడు శ్రీనివాస్ (మైఖేల్)కి ఎందుకు దూరం అవుతాడు? అనే మరో ఆసక్తికరమైన అంశం కూడా కథలో ఉంది. చివరికి, ఈ ప్రేమ కథలు తమ గమ్యాలను ఎలా చేరుకున్నాయి? తల్లులు వేసిన ప్లాన్‌లు చివరికి ఏమయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
విశ్లేషణ
బన్ బటర్ జామ్ టైటిల్ ఎందుకు పెట్టారా? అసలు ఈ కథకు, ఆ టైటిల్‌కు సంబంధం ఏంటా? అని అంతా అనుకుని ఉండొచ్చు. బన్ ఎక్కడో ఏదో దేశంలో పుట్టింది.. జామ్ ఇంకెక్కడో ఇంకేదో దేశంలో పుట్టింది.. కానీ ఆ రెండింటినీ ఒకటిగా చేసుకుని ఇంకేదో దేశంలో తింటాం.. ఎక్కడ నుంచి వచ్చింది.. ఎలా వచ్చింది.. అనే గతం కంటే.. ఆ బన్ బటర్ జామ్ టేస్ట్ ఆస్వాధించాలి అని చెప్పే సీన్ ఉంటుంది.
ఇప్పుడున్న తరంలో ఎవరిని ఎవరు ప్రేమిస్తున్నారు.. ఎందుకు వదిలేస్తున్నారు.. ఎంత మందిని ప్రేమిస్తున్నారు? అన్నది తెలియడం లేదు. గతం గురించి పట్టించుకోకుండా.. ముందుకు సాగాలి.. అన్నదే ఈ మూవీ సారాంశం. ఈ కథలో హీరో హీరోయిన్లు ఇతరుల్ని ప్రేమిస్తారు.. కానీ చివరకు ఆ ప్రయాణం వేరేలా ముగుస్తుంది? ప్రేమించిన వారిని వదిలేసి.. స్నేహంగా ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.
ఇద్దరు తల్లులు తమ బిడ్డల పెళ్లి గురించి చేసే ప్రయత్నం కాసింత నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగుతుంది. ప్రేమ, కాలేజీ సీన్లు ఇలా అన్నీ సరదాగా సాగుతాయి. ఇక సెకండాఫ్ ఎమోషనల్ ట్రాక్ ఎక్కుతుంది. అయితే ఎక్కడా కూడా ఏ పాత్ర కూడా అంత ప్రభావం చూపించదు. ఫస్ట్ హాఫ్‌లో చూపించిన ఆ స్నేహం.. సెకండాఫ్‌లో కనిపించదు. ఇక క్లైమాక్స్ ఏంటన్నది జనాలకు ఎప్పుడో అర్థమైపోతుంది. ఇక్కడ అదే సమస్య.
నటీనటులు
బన్ బటర్ జామ్ చూసిన తరువాత చంద్రు, నందిని, మధుమిత పాత్రలు ఎక్కువగా గుర్తుంటాయి. ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ కారెక్టర్, సీనియర్ పాత్రలో శివ చక్కగా నటించారు. ఇక హీరో హీరోయిన్ల తల్లి పాత్రల్లో శరణ్య, దేవ దర్శిని మెప్పిస్తారు. మిగిలిన పాత్రలన్నీ కూడా ఓకే అనిపిస్తాయి.
బన్ బటర్ జామ్ సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఆర్ఆర్ బాగుంటుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. బన్ బటర్ జామ్ చిత్రం అందరికీ నచ్చకపోయినా.. నేటి యూత్ బ్యాచ్‌కు బాగానే ఆకట్టుకునే అవకాశం ఉంది.
రేటింగ్ 2.5