• August 3, 2022

Bimbisara : మా సినిమా బాహుబ‌లి కాదు.. బాబాయ్‌కి కథ నచ్చలేదేమో!.. నందమూరి కళ్యాణ్ రామ్

Bimbisara : మా సినిమా బాహుబ‌లి కాదు.. బాబాయ్‌కి కథ నచ్చలేదేమో!.. నందమూరి కళ్యాణ్ రామ్

    విల‌క్ష‌ణ‌మైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో వెర్స‌టైల్ హీరోగా డైన‌మిక్ స్టార్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘బింబిసార’. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ మీడియాతో బింబిసార సినిమా గురించి మాట్లాడారు. ఆ ఇంట‌ర్వ్యూ విశేషాలు..

    * 2018 డిసెంబ‌ర్‌లో వ‌శిష్ట ‘బింబిసార’ సినిమా చెప్పడానికి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేను ‘మహా నాయకుడు’ సినిమా షూటింగ్‌లో ఉన్నాను. క‌థ చెప్పే ముందు న‌న్ను లాజిక్స్ అడ‌కండి సార్‌.. ఇందులో మ్యాజిక్స్ ఉంటాయి అని ముందుగానే చెప్పాడు. త‌ను నాకు బాగా తెలిసిన కుర్రాడు. 2015 నుంచి మంచి ప‌రిచ‌యం ఉంది. అప్పుడ‌ప్పుడు వ‌చ్చి క‌థ‌లు చెబుతుండేవాడు. ఆ ప‌రిచ‌యంతో క‌థ చెప్ప‌మ‌న్నాను. 2019లో త‌ను ఆ క‌థ చెప్పాడు. స్టోరి బేసిక్‌ను చెప్పాడు. టైమ్ ట్రావెల్‌, ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న క‌థ కావ‌టంతో నేను కూడా ఎగ్జ‌యిట్ అయ్యాను. కొత్తగా అనిపించ‌టంతో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాను.

    * నేను అత‌నొక్క‌డే సినిమా చేసిన‌ప్పుడు అది నాకు పెద్ద స్పాన్ మూవీ. ఎందుకంటే అంత‌కంటే ముందు నేను చేసిన రెండు సినిమాలు ల‌వ్‌స్టోరీస్‌. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు. ఆ స‌మ‌యంలో సురేంద‌ర్ రెడ్డి తీసిన అత‌నొక్క‌డే .. యాక్ష‌న్ బేస్డ్ మూవీ. ఆడియెన్స్‌కు అప్ప‌ట్లో అది కొత్త అనే చెప్పాలి. అంద‌రికీ న‌చ్చింది. కొత్త క‌థ‌.. మంచి టీమ్ కుదిరితే ప్రేక్ష‌కులు సినిమాను ఆదరిస్తారు.

    * ఎంత మంచివాడ‌వురా వంటి సినిమాలో క‌ళ్యాణ్ రామ్ మంచి వాడు అనే కోణంలో చూపించారు. అయితే నాలో ఓ ఎగ్రెసివ్‌నెస్ ఉంటుంది. కానీ నేను దాన్ని బ‌య‌ట‌కు చూపించ‌లేదు. ఆ ఎగ్రెసివ్‌నెస్‌ను ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ ద్వారా చేయ‌గ‌లిగాను.

    * బింబిసార అనే రాజు పాత్ర చేయాల‌న్న‌ప్పుడు ముందు రాజుగా నేను సెట్ అవుతానా? అని ఆలోచించాను. ఎందుకంటే అంత‌కు ముందు ఎప్పుడూ అలాంటి పాత్ర‌ను చేయ‌లేదు. అప్ప‌ట్లో తాతగారు.. త‌ర్వాత బాబాయ్‌.. రీసెంట్ జ‌న‌రేష‌న్స్‌లో బాహుబ‌లితో ప్ర‌భాస్‌.. రాజు అంటే ఇలానే ఉంటార‌నే ఓ స్టాండ‌ర్డ్స్ క్రియేట్ చేశారు. సో మ‌నమేదైనా కొత్త‌గా చేయ‌క‌పోతే.. కంపేరిజ‌న్ వ‌చ్చేస్తుంద‌నిపించింది. దాంతో నా హైట్‌కు త‌గ్గ వెయిట్ ఉండాల‌ని, పేస్‌లో ఫ్యాట్ ప‌ర్సెంటేజ్ ఎంత ఉండాలి..క‌ళ్ల కింద కాటుక పెట్ట‌టం కానీ.. ఇలా రెండు నెల‌ల పాటు చాలా హార్డ్ వ‌ర్క్ చేశాం.

    * మా సినిమా బాహుబ‌లి కాదు. ఆ సినిమాలో ఉన్న‌ట్లు యాక్ష‌న్ ఎలిమెంట్స్ లేవు. బింబిసారుడు అనే క్రూరుడైన రాజు ఎలా మంచి వాడుగా మారాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. యుద్ధాలు..సినిమా స్పాన్ చూపించాల‌నే ఉద్దేశంతో కాకుండా మా సినిమాను ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో చూపించ‌బోతున్నాం.

    * లుక్ ప‌రంగా బ‌రువు త‌గ్గే విష‌యంలో బ్యాలెన్స్‌డ్ డైట్ ఫాలో అయ్యాను. రెండు వారాల‌కు ఓసారి ఛీటింగ్ మీల్ తీసుకుంటూ వ‌చ్చాను. తాత‌గారి సినిమాల‌ను నేను ఎక్క‌డా రెఫ‌రెన్స్‌గా తీసుకోలేదు. ఆయ‌నో లెజెండ్‌. నా లిమిట్స్ నాకు తెలుసు. ఆయ‌న యాంగిల్‌లో రెఫ‌రెన్స్ తీసుకోవాలంటేనే నాకు భ‌యం. నేను ఎప్ప‌టికీ రామారావుగారిని రీచ్ కాలేను.

    * డైరెక్ట‌ర్ వ‌శిష్ట్‌కి ఫాంట‌సీ సినిమాలంటే చాలా ఇష్టం. అలాగే రామారావుగారికి పెద్ద ఫ్యాన్‌. డిక్ష‌న్ విష‌యంలో త‌ను, రైట‌ర్స్‌తో క‌లిసి నేను కూడా వ‌ర్క్ చేశాను.

    * ఈ సినిమాతో క‌ళ్యాణ్ రామ్ 2.0ను చూస్తారు. ఎన్టీఆర్‌, దిల్‌రాజు వంటివారు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. ఈ జ‌న‌రేష‌న్ బెస్ట్ అయిన ఎన్టీఆర్ వంటి యాక్ట‌ర్ నుంచి అలాంటి అప్రిషియేష‌న్ రావ‌టం గొప్ప విష‌యం కదా.

    * రామారావుగారి సినిమాల‌ను రీమేక్ చేయాలంటే నా కెరీర్ స‌రిపోదు. తాత‌గారి పాతాళ భైర‌వి నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తుంది. దాన్నే కాస్త మార్చి బాబాయ్ భైర‌వ ద్వీపం వంటి సినిమా చేశారు. జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సినిమా చూసి అరే భ‌లే బ్లెండ్ చేశారే అనిపించింది.

    * మ‌న ప్రేక్ష‌కులకి సినిమాలే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. మ‌న ముందు జ‌న‌రేష‌న్స్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఓ వ్య‌క్తి క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాడు. త‌ర్వాత కుటుంబంతో క‌లిసి ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం వెళ్లే ప్ర‌దేశం సినిమా థియేట‌ర్స్‌. మంచి సినిమాల‌ను తీస్తే.. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌కు థియేట‌ర్స్‌కు వ‌స్తారు. ట్రైల‌ర్‌ను చూసి ప్రేక్ష‌కులు సినిమాను చూడాలా వ‌ద్దా! అని నిర్ణ‌యించుకుంటారు. అలాగే మౌత్ ప‌బ్లిసిటీ కూడా హెల్ప్ అవుతుంది. మేజ‌ర్‌, విక్ర‌మ్ వంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు క‌దా.

    * నేను బింబిసార సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాను. కాబ‌ట్టి ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో జ‌రుగుతున్న స్ట్ర‌యిక్ గురించి వివ‌రాలు తెలుసుకోలేదు. వివ‌రాలు తెలుసుకున్న త‌ర్వాత క‌చ్చితంగా మాట్లాడుతాను. ఎవ‌రైనా దీని గురించి మాట్లాడితే, బింబిసార సినిమా గురించే మాట్లాడండి అని చెబుతున్నాను.

    * నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నప్పుడు అన‌వ‌స‌ర‌మైన ఒత్తిడికి లోన‌వుతున్నాన‌నిపించింది. దాంతో నిర్మాత అనే ఆలోచ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాను. ఆ ప్రెష‌ర్ క్యారీ చేస్తే వంద శాతం ఔట్‌పుట్ ఇవ్వ‌లేం. రెండు ప‌డ‌వ‌ల‌పై నేను ట్రావెల్ చేయ‌లేను.

    * నా సినిమాల‌కు ఎంత మార్కెట్ అవుతుందో తెలుసు. అంతలోనే సినిమాను పూర్తి చేశాం. ఇత‌ర నిర్మాత‌లు మ‌రి ఎలా తీస్తున్నారో నేనెలా చెప్ప‌గ‌ల‌ను.

    * బింబిసార రిలీజ్‌కి ముందే మంచి హైప్ క్రియేట్ కావ‌టం ఓ న‌టుడిగా నాకెంతో హ్యాపీగా ఉంది. అయితే క‌చ్చితంగా ఈ సినిమాతో ఆ అంచ‌నాల‌ను అందుకుంటాన‌నే న‌మ్మ‌కం ఉంది. సినిమాలో చూసి ఎంజాయ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. వాటిని ట్రైల‌ర్‌లో ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

    * ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బాల‌య్య బాబాయ్‌కి క‌థ చెప్పించాను. నాకు న‌చ్చిన క‌థ ఆయ‌న‌కు న‌చ్చాల‌ని లేదు క‌దా. అందుకే అది మెటీరియ‌లైజ్ కాలేదు.

    * బింబిసార 2 క‌థ అయితే ఉంది. కాబ‌ట్టి సినిమా ఉంటుంది. మ‌రి బింబి సార 3.. 4 ఉంటుందా..లేదా? అని ఇప్పుడే చెప్ప‌లేను.

    * ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో తార‌క్ గ్లోబెల్ రేంజ్ ఇమేజ్ వ‌చ్చింది. ఇక‌పై త‌ను చేయ‌బోయే సినిమాను ఎంతో బాధ్య‌త‌గా చేయాలి. మాకు కూడా ఎన్టీఆర్ 30కి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వాల‌నే ఉంది. తార‌క్‌పై..డైరెక్ట‌ర్‌పై.. నిర్మాత‌లుగా మాపై చాలా ప్రెష‌ర్ ఉంటుంది. ఏదో చేసేయాల‌ని త్వ‌ర‌త్వ‌ర‌గా చేసేయ‌కూడ‌దు.