- November 13, 2021
రిపబ్లిక్ డేకు రాబోతోన్న ‘హీరో’

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు మేనళ్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు గల్లా అశోక్.. హీరోగా ‘హీరో’ చిత్రంతోనే ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే వదిలిన పాటలు, టీజర్, పోస్టర్లు సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు.
తాజాగా మేకర్లు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్లో అశోక్ గల్లా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. రానా దగ్గుబాటి ఈ సినిమాలోని మొదటి పాట అయిన అచ్చ తెలుగందమే లిరికల్ వీడియోను విడుదల చేయగా.. అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్‌లు కెమెరామెన్లు వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ పెంచే పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై పాటలతో ప్రమోషన్స్ షురూ చేసేలా కనిపిస్తోంది.