• November 24, 2021

Tollywood: పెద్ద సినిమాలకు పే..ద్ద దెబ్బ!.. రికవరీ అవ్వడం కష్టమే

Tollywood: పెద్ద సినిమాలకు పే..ద్ద దెబ్బ!.. రికవరీ అవ్వడం కష్టమే

    Tollywood భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల చిత్రాలకు ఇకపై చెల్లుచీటినే. ఎందుకంటే ఏప్రీ ప్రభుత్వం నేడు తీసుకొచ్చిన బిల్లుతో టాలీవుడ్ నడ్డి విరిగింది. సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం చెప్పిన ధరకే టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. పైగా రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుంది. దీంతో పెద్ద హీరోల హడావిడి, భారీ బడ్జెట్ చిత్రాలపై పిడుగు పడ్డట్టు అయింది.

    ఇది వరకు అయితే పెద్ద సినిమా వస్తోందంటే.. టిక్కెట్ల రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేవారు. బెనిఫిట్ షోల పేర్ల మీద ఎన్నెన్నో కోట్ల చేతులు మారేవి. అయితే ఇప్పుడు మాత్రం వాటికి చరమగీతం పాడినట్టు అయింది. ఈ చట్టం వల్ల అఖండ, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్, ఆచార్య వంటి సినిమాలకు పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. ఎందుకంటే వీటికి ఏపిలో ఉన్న డిమాండ్, అమ్ముడు పోయిన రేట్లు.. ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టంతో చుక్కలు కనిపిస్తాయి.

    ఆల్రెడీ డీల్స్ సవరించారట. దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు తగ్గించినట్టు తెలుస్తోంది. ఇంకా తగ్గించాలని నిర్మాతల మీద డిస్ట్రిబ్యూటర్లు ఒత్తిడి తెంచారట. మొత్తానికి ఇది వరకు జరిగిన లావాదేవీలు మాత్రం యథాతథంగా లేవని చాలా మార్పులు చేర్పులకు లోనైందని తెలుస్తోంది.

    ఈ లెక్కన నాలుగు షోలు హౌస్ ఫుల్ నడిచినా కూడా అక్కడి టికెట్ రేట్లకు వచ్చే రెవెన్యూ మాత్రం దేనికీ సరిపోదు. కనీసం పెట్టిన పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లకు వస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల టాలీవుడ్‌ పరిస్థితి కక్క మింగలేక అన్నట్టుగా మారిపోయింది. ఇకపై ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకుంటారా? లేదా బడ్జెట్‌లో కోతలు విధించుకుంటారా? అన్నది చూడాలి.

    Leave a Reply