• November 26, 2021

Anubhavinchu Raja Movie Review : ‘అనుభవించు రాజా’ రివ్యూ.. భరించడమే తప్పా అనుభవించడం లేదు!

Anubhavinchu Raja Movie Review : ‘అనుభవించు రాజా’ రివ్యూ.. భరించడమే తప్పా అనుభవించడం లేదు!

    Anubhavinchu Raja Movie Review చాలా రోజులకు రాజ్ తరుణ్ హిట్ కొట్టబోతోన్నాడన అంతా అనుకున్నారు. అప్పుడెప్పుడో కుమారి 21 ఎఫ్‌తో మంచి విజయాన్ని అందుకున్న రాజ్ తరుణ్.. ఇప్పటికీ ఒక్క సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. ఎన్నో జానర్లు ట్రై చేసి చివరకు తన వర్కవుట్ అయ్యే పల్లెటూరి, గోదావరి యాసతో అనుభవించు రాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు (నవంబర్ 26) విడుదలైన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి.

    కథ
    రాజు (రాజ్ తరుణ్) హైద్రాబాద్‌లో ఓ ఐటీ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పని చేస్తాడు. అదే కంపెనీలో శ్రుతీ (కశిష్ ఖాన్) పని చేస్తుంది. రాజు కూడా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిన్ అని అనుకుంటుంది. ఇక సుదర్శన్ పాత్ర కూడా అక్కడే ఉంటుంది. రాజు మీద ఒకానొక సమయంలో అటాక్ జరుగుతుంది. ఆ తరువాత రాజు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కాదని, సెక్యూరిటీ గార్డ్ అని తెలుస్తుంది. ఆ తరువాత శ్రుతీ ఏం చేస్తుంది? అసలు రాజు మీద అటాక్ చేసింది ఎవరు? రాజు ఎందుకు సిటీకి వస్తాడు? సెక్యూరిటీ గార్డుగా ఎందుకు పని చేస్తాడు? అనే వాటికి సమాధానాలే అనుభవించు రాజా.

    నటీనటులు
    అనుభవించు రాజా సినిమాను రాజ్ తరుణ్ తన భుజాల మీద మోశాడు. రాజ్ తరుణ్ తనకు వచ్చిన, అలవాటైన కామెడీ, యాస, యాక్టింగ్‌తో మెప్పించాడు. ఇక హీరోయిన్ ఉందా? ఉంటే ఆమె ఎవరు? అనేది కూడా గుర్తు పట్టడం కష్టమవుతుంది. కశిష్ ఖాన్‌ వల్ల ఈ చిత్రానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. సుదర్శన్ నవ్వించాడు. అజయ్‌కి మంచి పాత్ర దొరికింది. చాలా రోజుల తరువాత కొత్తగా కనిపించాడు. ఇక అరియానా, రవికృష్ణ ఇలా అందరూ కూడా తమ పరిధి మేరకు నటించేశారు.

    విశ్లేషణ
    కథ రాసుకున్నప్పుడు, చెప్పుకున్నప్పుడు బాగానే ఉంటుంది. మనలో మనం జోకులు వేసుకుని నవ్వుకోవడం వేరు. మనం వేసిన జోకులకు ఎదుటి వారు నవ్వడం వేరు. దర్శకుడికి ఈ రెండింటి మధ్య తేడా తెలియనట్టుంది. ఈ చిత్రంలో చాలా చోట్ల సినిమాల్లోని నటీనటులు నవ్వుకుంటారే తప్ప.. ప్రేక్షకులకు మాత్రం నవ్వురాదు. కొన్ని సీన్లను అంత నీరసంగా రాసుకున్నాడు.

    సినిమాలో మిస్టరీ,యాక్షన్, కామెడీ ఇలా అన్నింటినీ జోడించాలని అనుకున్నాడు. కానీ అవి ప్రేక్షకులకు ఎక్కుతాయా? లేదా? అన్నది చూడలేదు. తనకు తోచిన విధంగా రాసుకుంటూ వెళ్లినట్టు అనిపిస్తుంది. ప్రథమార్థంతో వెకిలి జోకులకు నవ్వులు రాకపోయినా కూడా కనీసం సెకండాఫ్ భీమవరంకు షిఫ్ట్ అయితే నవ్వులు పూయిస్తాడేమోనని అంతా అనుకుంటారు.

    కానీ అక్కడా కూడా అదే అవుట్ డేటెడ్ కామెడీ. ఎక్కడా కూడా నవ్వులు రావు. పైగా జాలి వేస్తుంది. రెండు మూడు చోట్ల ఊరి గురించి చెప్పే డైలాగ్స్ బాగానే అనిపించినా ఎమోషన్ మాత్రం కనెక్ట్ కాదు. అలా సినిమాకు, కథకు, ప్రేక్షకుడి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంతో ఎక్కడో తేడా కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఊర్లో అనుభవించు రాజాగా ఉన్నోడు.. సిటీకి అలా ఎందుకు రావాల్సి వచ్చిందనే ఎమోషన్‌ను కూడా ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోయారు.

    ఇక ఈ చిత్రానికి సాంకేతికంగా కాస్త బలాన్నిచ్చే అంశాలున్నాయి. గోపీ సుందర్ అందించిన పాటల్లో టైటిల్ సాంగ్ బాగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సరిపోయింది. సినిమాటోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల పల్లెటూరి వాతావరణం కనిపించింది. ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌కు మాత్రం చాలా పని మిగిలే ఉన్నట్టు కనిపించింది. అన్నపూర్ణ బ్యానర్ స్థాయికి తగ్గట్టు సినిమాను నిర్మించారు.

    రేటింగ్ : 2

    Leave a Reply