• October 28, 2023

మీడియా వర్సెస్ యాంకర్ సుమ.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?

మీడియా వర్సెస్ యాంకర్ సుమ.. ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు?

    యాంకర్ సుమ అజాతశత్రువు. టాలీవుడ్‌లో ఆమెకు ద్వేషించేవారు ఎవ్వరూ ఉండరు. స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ల నుంచి ప్రతీ ఒక్కరితో సుమ మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటుంది. టాలీవుడ్‌లోని బడా ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించే అన్ని చిత్రాలకు సుమ హోస్ట్ చేస్తుంటుంది. అసలు సుమ టైం ఇవ్వకపోతే ఈవెంట్లు కూడా క్యాన్సిల్ అవుతుంటాయి. పెద్ద హీరోలందరూ సుమకే ఓటేస్తుంటారు. సుమ హెస్ట్ చేస్తేనే ఈవెంట్లు నిర్వహించండని అంటారు. సుమ అందుబాటులో లేకపోతోనే ఇతర ఆప్షన్స్ చూసుకుంటారు. సుమ పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.

    ఇక సుమ వేసే పంచులు, సెటైర్ల గురించి అందరికీ తెలిసిందే. సుమకు ఉన్న ఆ స్పాంటేనియే ఆమె క్రేజ్‌కు కారణం. కేరళ కుట్టి అయినా కూడా అచ్చతెలుగు మహిళగా ఆమె తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంది. స్పష్టమైన తెలుగును ఉచ్ఛరిస్తుంటుంది. అలాంటి సుమ మొన్న ఓ ఈవెంట్లో మీడియా మీద కాస్త సెటైర్ వేసింది. ఇక ఆమె మాటలు కాస్త సెటైరికల్‌గానే ఉన్నాయి. అది కూడా మీడియా వారు తినే తిండి మీద సెటైర్ వేసింది. స్నాక్స్‌ను భోజనంలా చేస్తున్నారని, త్వరగా వచ్చి మైకులు పెట్టండి అని సుమ కౌంటర్లు వేసింది.

    దీని మీద ఓ మీడియా ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీరు చేసే కామెడీ, సెటైర్లు, పంచులు అందరికీ ఇష్టమే కానీ మీడియా మీద మాత్రం వద్దని, అలాంటి కామెంట్లు ఇంకోసారి చేయకండని అందరి ముందే స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. సుమ కూడా తప్పును ఒప్పుకుంది క్షమాపణలు చెప్పింది. మళ్లీ ఓ వీడియోను వదిలి మరీ క్షమాపణలు చెప్పింది.

    ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడే అసలు చర్చలు మొదలయ్యాయి.  ఆ చర్చలను బట్టి చూస్తే సినిమా జర్నలిస్టులు, మీడియా మీద సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా మీడియాకు అనుకూలంగా కామెంట్లు చేయలేదు. సుమ అలా అనేసిందేంటి? తిండి విషయంలో అలా అనొచ్చా? అని ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా కోసం మాట్లాడలేదు. అసలు మీడియా ఇలాంటి ఈవెంట్లను కవర్ చేసేందుకు నానా తంటాలు పడుతుంటుంది.

    వారిచ్చే కవర్ల కోసమే కదా? పని చేసేది అని కొందరు అంటారు. ఎవరికి ఎంత వెళ్తుంది.. అందరికీ ఇస్తారా? అనే విషయాలు పీఆర్‌కే తెలియాలి.  మీడియా వారికి కవర్ల సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు గానీ అది ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక ఓ ఈవెంట్‌ను చెప్పిన టైంకి ఎప్పుడూ నిర్వహించరు. కానీ మీడియా మాత్రం అందరి కంటే ముందుగా వస్తారు.. అందరికంటే చివరన వెళ్తారు. ఓ ఈవెంట్ కోసం మూడు నాలుగు గంటలు అలానే ఎదురుచూస్తుంటారు. ఒక రోజులో నాలుగైదు ఈవెంట్లు కవర్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా తింటారో వారికే తెలియదు. ఓ టైం అంటూ లేకుండా వేళాపాలా లేకుండా పని చేస్తూ దొరికింది తినేస్తుంటారు.

    అలాంటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లను అలా అనడం సబబు కాదు. సుమ అలా అనాల్సింది కాదు. కానీ నెట్టింట్లో ఏ ఒక్కరు కూడా మీడియా పక్షాన నిలబడలేదు. మీడియానే జనం తిట్టిపోశారు. దానికి కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా మీడియా, సినీ జర్నలిస్టులంటూ చెప్పుకునే కొంత మంది పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయడం, కెమెరాలో కనిపించాలని, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని ఇలా ఏదో ఒక కారణంతో ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేస్తూ వస్తున్న కొంత మంది వల్ల మొత్తం సినిమా జర్నలిస్టుల మీదే ఏహ్యాభావం కలిగింది జనాలకు. అందుకే నెట్టింట్లో ఒక్కరు కూడా మీడియాకు మద్దతుగా మాట్లాడలేదు. మైకు దొరికితే ఏం ప్రశ్నలు అడుగుతారో కూడా తెలియని కొంత మంది వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చేస్తోంది.

    కీర్తి ఖండూతి, అంతటా తామే కనిపించాలనే యావ వల్ల దొరికిన సెలెబ్రిటీలు, హీరో హీరోయిన్లను ఇష్టమొచ్చిన ప్రశ్నలు అడగడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనే ఛట్రంలో కొందరు పడిపోయారు. అలాంటి వారి వల్ల మొత్తం ఫిల్మ్ మీడియా ప్రతినిధులకు కూడా విమర్శలు తప్పడం లేదు. అందుకే సుమ వేసిన కౌంటర్లు అసందర్భం, తినడం గురించి అలా మాట్లాడటం సరైనది కాదని అందరికీ తెలిసినా.. ఏ ఒక్కరు మీడియా పక్షన నిలబడటం లేదు. మీరు అయితే ఎంతో మందిని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి బాధపెట్టొచ్చు.. మిమ్మల్ని ఒక్క మాట అనేసరికి కాలిందా? తట్టుకోలేకపోతోన్నారా? అంటూ మీడియా మీదనే జనాలు మండిపడుతున్నారు. సుమకు అండగా నిలుస్తున్నారు. ఇందులో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది వాళ్ల వాళ్ల మనస్సాక్షికే వదిలేయాలి.