• July 14, 2023

Baby Movie Review : బేబీ మూవీ రివ్యూ.. గుండెను బరువెక్కిస్తుంది కానీ!

Baby Movie Review : బేబీ మూవీ రివ్యూ.. గుండెను బరువెక్కిస్తుంది కానీ!

  Baby Movie Review : ప్రేమ కథలు ప్రతీ ఏడాది వస్తూనే ఉంటాయి.. పోతుంటాయి.. ప్రేమను మెయిన్ పాయింట్‌గా తీసుకుని ప్యూర్ లవ్ స్టోరీని చూసి చాలా రోజులే అవుతోంది. అయితే ఈ మధ్య కాలంలో బేబీ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే రాలేదు. టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నీ కూడా యూత్‌ను ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

   

  బస్తీలో ఉండే అమ్మాయి వైష్ణవి (వైష్ణవి చైతన్య). స్కూల్ ఏజ్ నుంచి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను వైష్ణవి ప్రేమిస్తుంటుంది. ఆనంద్, వైష్ణవిల ప్రేమ స్కూల్‌లోనే మొదలవుతుంది. ఆనంద్‌కు చదువు అంతగా రాకపోవడంతో ఆటో నడుపుతూ బతుకుతుంటాడు. వైష్ణవి మాత్రం బీటెక్ అంటూ సిటీలోని కాలేజ్‌కు వెళ్తుంది. అక్కడ విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే మరోతను పరిచయం అవుతాడు. విరాజ్‌ను బెస్ట్ ఫ్రెండ్ అంటుంది.. ఆనంద్‌తో ప్రేమలో ఉంటుంది.. తరువాత వైష్ణవి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? ఎవరిని మోసం చేసింది? చివరకు ఏం జరిగింది? అన్నది కథ.

  బేబీ సినిమా కొత్త కథ ఏమీ కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో కథలు, ఎంతో మంది జీవితాల్లో జరుగుతున్నదే. నిబ్బా నిబ్బి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండే ఎన్నో కథల్లో ఇది కూడా ఒకటి. స్కూల్ ఏజ్‌లోనే ప్రేమలు, ఆటో ప్రేమలో, ఆటో కొటేషన్లు ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్. దీనికి తగ్గట్టుగానే సాయి రాజేష్ కథను రాసుకున్నాడు. చూస్తుంటే ఈ కథ అనుభవంలోంచి పుట్టినట్టు అనిపిస్తుంది.

   

  ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ఉంటాయి. తొలి ప్రేమలో ఆనందాన్ని,బాధని చక్కగా చూపించాడు. ప్రేమకు, కోరికలకు, బంధానికి, బరితెగించడానికి అర్థం తెలియని అమ్మాయి అనుకోవాలో.. తెలిసినా అలాంటి పనులు చేస్తోందని అనుకోవాలో చూసే ప్రేక్షకుడికి కాస్త అర్థం కాక గందరగోళానికి గురవుతాడు.

   

  ఊరి నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిలు ఎలా మారే అవకాశం ఉంది.. ఎలా మారుతారో అన్నది చక్కగా చూపించాడు సాయి రాజేష్. అసలు ప్రేమ అంటే ఎవరిది? అనేది కూడా కళ్లకు కట్టినట్టు చూపించాడు. అమ్మాయి ప్రేమలో ఉండి.. అమ్మను కనీసం తిన్నావా? అని అడగని కొడుకు.. ప్రేమ మైకంలో ఉండి.. అమ్మను పట్టించుకోని కొడుకు.. చివరకు అసలైన ప్రేమను తెలుసుకుంటాడు. అమ్మ ప్రేమే గొప్ప అని రియలైజ్ అవుతాడు. అమ్మాయి వాడిన, పనికి రాని వస్తువులను కూడా పెట్టుకునే హీరో.. తల్లి ఫోటో ఇంట్లో ఉందో లేదో కూడా చూసుకోడు.

   

  హీరోయిన్ పాత్రలో ఎన్నో వైరుధ్యాలు కనిపిస్తాయి. ప్రేమించే వాడి దగ్గర హగ్గు కూడా ఇచ్చేందుకు మొహమాట పడుతూ పతివ్రతలా బిల్డప్ ఇస్తుంది. కానీ కార్లు, లగ్జరీ లైఫు, పబ్బులు, తాగుతూ ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్ దగ్గర పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎవరి కోణంలో వారు కరెక్ట్‌ అని అనుకుంటారు. వైష్ణవి కథతో ఓ నీతి అయితే చెప్పాడు సాయి రాజేష్. వేరే వాళ్లని మోసం చేస్తే ఎలాగోలా బయటపడొచ్చు గానీ మనల్ని మనం మోసం చేసుకుంటే బయటపడలేం.. అంటూ వైష్ణవి చేత చెప్పించిన డైలాగ్స్ అద్భుతంగా హార్ట్ టచింగ్ ఉంటాయి.

  ఈ సినిమాలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌కు కనెక్ట్ అవుతుంటారు. అమ్మాయి చేతిలో మోసపోయిన అబ్బాయి.. కన్నె ప్రేమలో పడి అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే అబ్బాయి.. ఇలా ఏదో ఒక రకంగా ప్రతీ ఒక్కరూ రిలేట్ అవుతారు. ఇక చివరకు వైష్ణవి చేసిన పని వల్ల ఆనంద్ కుమిలి కుమిలి బాధపడిపోతుంటాడు. తొలి ప్రేమ చేసిన గాయాన్ని మరవలేడు.

   

  క్లైమాక్స్ మాత్రం అందరికీ రుచించకపోవచ్చు. ఏదో ఒక అసంతృప్తి కలుగుతుంది. విషాదాంతంగా ఈ సినిమాకు క్లైమాక్స్‌ ప్లాన్ చేసే అవకాశం ఉన్నా కూడా సాయి రాజేష్ ఆ చాన్స్ తీసుకోలేదు. యువతకు తప్పుడు సందేశం ఇచ్చినట్టుగా అవుతుందని అలా చేశాడే ఏమో తెలియదు. క్లైమాక్స్‌ను జనాలు ఇంకో రకంగా ఊహించి ఉండొచ్చు. అదే ఈ సినిమాకు కాస్త నెగెటివ్ అయ్యేలా ఉంది.

   

  సాంకేతికంగా ఈ సినిమా మరో స్థాయిలో ఉంది. విజయ్ సంగీతం, పాటలు, ఆర్ఆర్ ఈ సినిమాకు గుండెలాంటిది. బాల్ రెడ్డి కెమెరా ఆత్మలాంటిది. ఈ సినిమాకు ఎడిటర్ విప్లవ్ ప్రాణం పోశాడు. ఇక సాయి రాజేష్ రాసిన హార్ట్ టచింగ్ మాటలే ఈ సినిమాను ముందుకు నడిపిస్తాయి. మరీ అంత నిడివి కాకుండా.. కాస్త తగ్గిస్తే బాగుండనే ఫీలింగ్ వస్తుంది. అయితే ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయితే మాత్రం అది పెద్ద సమస్యగా అనిపించదు.

  రేటింగ్ : 3

  బాటమ్ లైన్ : బేబీ.. బాధపెడుతుంది.. ఏడిపిస్తుంది.. ఓ వెలితిని కూడా ఇస్తుంది