• February 2, 2024

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు రివ్యూ.. రంగస్థలం ఛాయలు

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు రివ్యూ.. రంగస్థలం ఛాయలు

    Ambajipeta Marriage Band అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే చిత్రం పూర్తిగా సుహాస్ పేరు మీదే సేల్ అయింది. వెనకాల గీతా ఆర్ట్స్ బ్యానర్, ధీరజ్ మొగిలినేని, బన్నీ వాస్ వంటి వారు ఉండటంతో మరి కొద్దిగా ప్రమోషన్స్ కలిసి వచ్చాయి. కానీ కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తరువాత సుహాస్ మరోసారి తనకు సరిపడా కథతో వస్తున్నాడని అందరికీ అర్థమైంది. దీంతో సుహాస్ మీద అంచనాలతో ఈ చిత్రానికి వచ్చిన ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి కలిగింది అనేది ఓ సారి చూద్దాం.

    కథ
    అంబాజీపేటలో 2007 ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఆ ఊర్లో డబ్బు, అహంకారం, మదంతో బలిసిన వ్యక్తిగా వెంకట్ (నితిన్ ప్రసన్న) కనిపిస్తాడు. ఇక అదే గ్రామంలో మ్యారేజిబ్యాండు వాయిస్తూ మల్లి (సుహాస్) తన కులవృత్తిని సైతం చేసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఇంటికి వెళ్లి కటింగ్ చేయడం అంటే మల్లికి ఇష్టం ఉండదు. కానీ వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ) ని చూసినట్టు అయినా ఉంటుందని ఇంటికి వెళ్తాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) ఆత్మాభిమానం కల వ్యక్తి. ఊర్లో ఎంత మంది ఎన్ని కారు కూతలు కూసినా పట్టించుకోదు. వెంకట్ చేసే ఆగడాలకు ధైర్యంగా ఎదురెళ్తుంది. ఎదురిస్తుంది. ఆ తరువాత పద్మ వెంకట్‌ల మధ్య జరిగిన ఘటనలు ఏంటి? మల్లి లక్ష్మీల ప్రేమ కథకు ఎలాంటి ముగింపు వస్తుంది? వెంకట్ అహం అణిచి వేయడానికి మల్లి, పద్మ ఏం చేస్తారు? చివరకు అంబాజీపేటలో వెంకట్ పరిస్థితి ఎలా మారుతుంది? అన్నది కథ.

    ఈ సినిమా మరీ అంత గొప్పదేమీ కాదు. కానీ ఇలా ఎలా తీయగలిగాడు? ఇలా ఎలా చూపించగలిగాడు? ఓ మహిళ పాత్రను ఇంత ఇంపాక్ట్‌ క్రియేట్ చేసేలా ఎలా రాసుకున్నాడు అని అనిపిస్తుంది. ఈ మూవీని చూస్తున్నంత సేపు రంగస్థలం సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. అందులోనూ ఇందులోనూ ఒకే పాయింట్ మీద కథ సాగుతుంది. కాకపోతే అక్కడ పూర్తిగా రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కులాలు, అహం, పొగరు, ఆత్మాభిమానం అనే పాయింట్ల చుట్టూ తిరుగుతుంది.

    అక్కడ ప్రెసిడెంట్‌ పాత్రలా ఇక్కడ వెంకట్ కారెక్టర్ ఉంటుంది.. ఆది పినిశెట్టి పాత్రలా శరణ్య కారెక్టర్ ఇందులో కనిపిస్తుంది. అక్కడ రామ్ చరణ్ ఉండటంతో మెయిన్ హీరో అని తెలుస్తుంది. కానీ ఇక్కడకు వచ్చే సరికి శరణ్యే మెయిన్ హీరో అన్నట్టుగా ఉంటుంది. సుహాస్ ఈ కథను ముందుకు నడిపించే ఓ సాధనంలా మారినట్టు అనిపిస్తుంది.  ఈ చిత్రం అలల్లా పడుతూ లేస్తూ ముందుకు సాగుతుంది. చాలా నీరసంగా, ఊహకు అందేలా సాగుతోందే.. ఇదెక్కడి పాత కథరా బాబు అనుకునే ప్రతీ సారి.. శరణ్య పాత్రతో హై ఇచ్చాడు దర్శకుడు. స్థూలంగా చెప్పుకుంటే ఇది పాత చింతకాయ పచ్చడి లాంటి కథ. ఇది వరకు ఎన్నో చూసేసి ఉంటాం. కానీ శరణ్య పాత్రతో ఈ సినిమాకు కాస్త ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది.

    శరణ్య ప్రదీప్ తన పాత్రతో, తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం సాఫ్ట్ పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఇంట్లో ఓ ఫ్యామిలీ మెంబర్ లాంటి సాఫ్ట్ పాత్రలకే శరణ్య సూట్ అవుతుంది.. ఇక అంతే.. అనుకునే వాళ్లు అంబాజీపేట చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఓ మాస్ హీరోకు పడే సీన్లు ఆమెకు పడ్డాయి. ఓ మాస్ హీరోకి రావాల్సిన డైలాగ్స్ ఆమెకు వచ్చాయి.

    స్కూల్‌లో సీన్ అయినా, పోలీస్ స్టేషన్ సీన్ అయినా.. చివరకు చచ్చిపోయే ముందు సీన్ అయినా కూడా శరణ్య తన సత్తాను చాటుకుంది. శరణ్య ఈ సినిమాకు మెయిన్ హీరోనా? అన్నట్టుగా ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. సుహాస్ తన స్థాయిలో అద్భుతంగా నటించాడు. చివర్లో యాక్షన్ సీక్వెన్స్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది. కానీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. సుహాస్ ఈ సినిమాలో కామెడీతో నవ్విస్తాడు.. ఎమోషన్‌తో ఏడిపిస్తాడు. సుహాస్ నటనకు అద్దం పట్టే సీన్లు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి. కానీ సుహాస్ సినిమా అని అనుకుని వచ్చే వాళ్లకి.. శరణ్య సర్ ప్రైజ్ ఇవ్వడం మాత్రం ఖాయం.

    టెక్నికల్‌గా అంబాజీపేట బాగుంది. ఓ రెండు పాటలు థియేటర్లో ఊపునిస్తాయి. ఆర్ఆర్ బాగుంది. సినిమా మూడ్‌కు తగ్గట్టుగా కొన్ని చోట్ల ఆహ్లాదకరంగా.. ఇంకొన్ని చోట్ల ఫుల్ ఎమోషనల్‌గా ఉంటుంది. ఒకే ఊర్లోనే షూటింగ్ అంతా తీసేసినట్టుగా ఉన్నారు. విజువల్స్ సహజంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. ఎక్కడా ఫ్లో మిస్ అవ్వలేదు. మాటలు ఈ చిత్రానికి మరో ప్లస్. కుల వివక్ష మీద రాసిన కొన్ని సెటైర్లు బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    రేటింగ్ 3

    చివరగా.. అంబాజీపేటకు సుహాస్‌తో పాటు శరణ్య కూడా హీరోనే