• October 7, 2022

స్వాతి ముత్యం.. ఇది ప్రేక్షకుల విజయం -నిర్మాత ఎస్. నాగవంశీ

స్వాతి ముత్యం.. ఇది ప్రేక్షకుల విజయం -నిర్మాత ఎస్. నాగవంశీ

  *ప్రేక్షకుల నవ్వులు ఈ సినిమా విజయానికి నిదర్శనం.
  -హీరో గణేష్

  *ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకి కృతజ్ఞతలు.

  -చిత్ర విజయ సమ్మేళనం సందర్భంగా స్వాతిముత్యం చిత్ర బృందం

  ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ఘనంగా విజయోత్సవ వేడుకకు నిర్వహించింది.

  ఈ సందర్భంగా

  చిత్ర దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. ” మా సినిమాకి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ పట్ల చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి చాలా సహజంగా మన మధ్యలో జరిగినట్లు ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. విమర్శకులు కూడా అన్ని పాత్రలకు ప్రాధాన్యమిస్తూ మంచి వినోదాన్ని పంచామని ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఓ సాధారణ కుటుంబంలో అనుకోని సమస్య వస్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు అనే దాని మీదే ఈ సినిమా చేశాం. అదే అందరికీ బాగా నచ్చింది. మా ఊరు కాకినాడ, పిఠాపురం నుంచి ఫోన్లు చేసి సినిమాలోని పాత్రలు వాళ్ల నిజ జీవితంలో చూసిన పాత్రల్లా సహజంగా ఉన్నాయని చెబుతున్నారు. మొదటి నుంచి ఈ కథని నమ్మి, మా అందరికీ కూడా అదే నమ్మకాన్ని కలిగించిన నిర్మాత నాగ వంశీ గారికి ధన్యవాదాలు. అలాగే గణేష్ కి కూడా ధన్యవాదాలు. నేను కథ చెప్పగానే నచ్చి దానిని ముందుకు తీసుకెళ్ళాడు. మా ఇద్దరికీ ఈ విజయం చాలా కీలకం. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఇద్దరం చాలా సంతోషపడ్డాం” అన్నారు.

  వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.. మళ్ళీ చెబుతున్నాను. కొత్త వారికి అవకాశం ఇవ్వడం అనేది నాగ వంశీ గారికి చిన్న విషయం అయ్యుండొచ్చు. కానీ నాకు అది చాలా పెద్ద విషయం. ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విడుదలకు ముందే ఈ సినిమా చూసి నవ్వుకుంటూ బయటకు వస్తారని మేం చెప్పాం. అయితే మేం ఊహించిన దానికంటే ఎక్కువగా నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. దానిని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఎంత పెద్ద విజయమో. దర్శకుడు లక్ష్మణ్ ని అందరూ ప్రశంసించడం సంతోషంగా ఉంది. గణేష్ మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించడం ఆనందంగా ఉంది. సురేఖవాణి గారు నాకు తల్లిగా నటించారు కానీ నాకు ఆమె అక్కలా ఉన్నారు. దివ్య స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేసింది. రావు రమేష్ గారు, నరేష్ గారు, గోపరాజు రమణ గారు సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.” అన్నారు.

  గణేష్ మాట్లాడుతూ.. ” ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. మా సినిమాకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నటుడిగా నన్ను ప్రేక్షకులు అంగీకరించారు. ప్రతి ఒక్కరూ తెర మీద గణేష్ కనిపించలేదు, బాల అనే కుర్రాడు మాత్రమే తెర మీద కనిపించాడు అన్నప్పుడు.. నటుడిగా ఓ పది మార్కులు వేయించుకున్నాను అని చిన్న తృప్తి కలిగింది. నా నుంచి నటనను రాబట్టినందుకు, నా దగ్గరకు ఈ కథను తీసుకొచ్చినందుకు లక్ష్మణ్ కి ధన్యవాదాలు. అలాగే ఈ కథను మా కంటే ఎక్కువగా నమ్మి, అన్నీ సమకూర్చి, ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సితార వారికి, నాగ వంశీ గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. ఇంతమంచి విజయాన్ని అందించినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అన్నారు.

  నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “స్వాతి ముత్యం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. మా సినిమాకి లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది. చిత్ర విడుదలకు ముందు చిరంజీవి గారు పెద్ద మనసుతో మా సినిమాకి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు స్వాతి ముత్యం, గాడ్ ఫాదర్ రెండు చిత్రాలూ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. స్వాతి ముత్యం చిత్రానికి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఈ వారాంతానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముంది” అన్నారు.

  దివ్య శ్రీపాద మాట్లాడుతూ.. “ఈ సినిమాలో శైలజ అనే పాత్ర పోషించడం సంతోషంగా ఉంది. ఇలాంటి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. లక్ష్మణ్ గారు పిలిచి ఈ కథ చెప్పినప్పుడే ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా అనిపించింది. సితార లాంటి పెద్ద బ్యానర్ లో, ఎందరో ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం వెలకట్టలేనంత సంతోషం ఇచ్చింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాగ వంశీ గారికి, లక్ష్మణ్ గారికి ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను” అన్నారు.

  సురేఖా వాణి మాట్లాడుతూ.. “నన్ను చాలామంది ఎక్కువ సినిమాలు ఎందుకు చేయట్లేదు, ఇలాంటి పాత్రలు ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. అవకాశమొస్తే ఎందుకు చేయను. దర్శకుడు లక్ష్మణ్ మొదటిసారి నన్ను కలిసి ఈ సినిమాలో నా పాత్ర గురించి నాకు చెప్పినప్పుడు.. నిజంగానే ఈ పాత్ర కోసం మొదట నన్నే అనుకున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు మా వరకూ రావట్లేదు. వస్తే తప్పకుండా చేస్తాం. నేను సినిమాలు మానేశాను అని కొందరు అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని, ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంటాను. నాకు ఇంతమంచి పాత్ర ఇచ్చిన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇక మా అబ్బాయి గణేష్ నిజంగానే బంగారు కొండ. మొదటి సినిమానే ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉంది. అలాగే దర్శకుడు లక్ష్మణ్ గారు ఇంకా ఎన్నో ఇలాంటి మంచి సినిమాలు తీయాలని, మా లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.