• August 8, 2025

బకాసుర రెస్టారెంట్ రివ్యూ.. క్రింజ్ కంటే దారుణం

బకాసుర రెస్టారెంట్ రివ్యూ.. క్రింజ్ కంటే దారుణం

    నటుడు ప్రవీణ్ కమెడియన్‌గా అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రవీణ్ లీడ్ పాత్రలో ‘బకాసుర రెస్టారెంట్’ అనే సినిమాను చేశారు. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను వైవా హర్ష పోషించారు. ఇక ఈ చిత్రాన్ని ఎస్ జే శివ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ మూవీ ఆగస్ట్ 8న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం కథ ఏంటి? ఎలా ఉంది? అనేది చూద్దాం.

    కథ
    పరమేశ్ (ప్రవీణ్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటారు. సొంతంగా హోటల్ పెట్టుకుని బిజినెస్ చేసుకోవాలనే లక్ష్యంతో ఇష్టం లేని సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేస్తుంటాడు. అయితే పరమేశ్‌, అతని టీం డబ్బులు సంపాదించే క్రమంలో యూట్యూబ్ చానెల్ పెడతారు. అందులో భాగంగా ఓ సారి కాశీ వలి బంగ్లాకు వెళ్తారు. అక్కడ వారికి తంత్ర శాస్త్రానికి సంబంధించిన పుస్తకం దొరుకుతుంది. ఆ బుక్ ఆధారంగా ఆత్మ వశీకరణ చేస్తారు. ఆ తరువాత వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? ఈ గ్యాంగులోకి బక్క సూరి అలియాస్ బకాసుర వచ్చిన తరువాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి? అసలు ఈ బక్క సూరి కథ ఏంటి? చివరకు పరమేశ్ కల నెర వేరుతుందా? లేదా? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

    బకాసుర రెస్టారెంట్ కోసం రాసుకున్న కథ, తీసుకున్న నేపథ్యం, తెరకెక్కించిన తీరు ఇలా ఏ విషయంలోనూ ఎక్కడా కూడా కొత్త దనం కనిపించదు. అసలు ఇలాంటి కథను ఎలా ఓకే చేశారా? అన్నది కూడా అనుమానంగా ఉంటుంది. ఇలాంటి కథలు చెప్పుకునే టైంలో కాస్త బాగానే ఉంటాయి. అంతో ఇంతో నవ్వును తెప్పిస్తాయి. కానీ తెరపైకి వచ్చాక కూడా అదే స్థాయిలో ఎమోషన్స్, కామెడీలు పండించడం అంత సులభం అయితే కాదు.

    ఈ చిత్రంలో అదే మిస్ అయింది. ప్రవీణ్, షైనింగ్ ఫణి తప్ప మిగిలిన కుర్రాళ్లు ఎవ్వరూ కూడా ఆడియెన్స్‌కు తెలియదు. ఆ కుర్రాళ్లు చేసేది కామెడీ అని డైరెక్టర్ భ్రమపడి ఉంటాడు. కానీ అది అతికి అడ్రస్‌లా ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అక్కడక్కడే తిరిగినట్టుగా, చూపించిందే చూపించినట్టుగా.. చాలా బోరింగ్, ఏ మాత్రం ఆసక్తికరంగా సాగదు. అలా ఫస్ట్ హాఫ్ అయిపోయే టైంకి, ఇంటర్వెల్ కార్డ్ పడే టైంకి కాస్త పర్వాలేదనిపిస్తుంది.

    ఇక కీలకమైన సెకండాఫ్‌ని కూడా గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా స్క్రాప్ బ్యాచ్‌ని పెట్టి జనాలకు తలపోటు తీసుకొచ్చాడు. అసలు ఆ ఎపిసోడ్ అలా పెట్టాలని, వారందరినీ తీసుకు రావాలనే ఆలోచన ఎలా వచ్చిందో అని ఆడియెన్స్ అనుకుంటారేమో. అయితే క్లైమాక్స్ అంతో ఇంతో ఎమోషనల్‌గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది.

    నటీనటుల విషయానికి వస్తే ప్రవీణ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ ప్రవీణ్ అటు పూర్తిగా కామెడీ, ఇటు పూర్తిగా ఎమోషన్‌ను పండించలేకపోయారనిపిస్తుంది. ఇక షైనింగ్ ఫణి తిండిపోతుగా పర్వాలేదనిపించాడు. వైవా హర్ష ఎపిసోడ్ కాస్త బాగానే అనిపిస్తుంది. మిగిలిన కుర్రాళ్ల పాత్రలు, వారి యాక్టింగ్ కాస్త అతిగానే అనిపిస్తుంది. గరుడ రామ్ అప్పియరెన్స్, పాత్ర ఓకే అనిపిస్తుంది.

    టెక్నికల్‌గా చూసుకుంటే ఆర్ఆర్ మరీ ఎక్కువ అనిపిస్తుంది. పాటలు ఏ ఒక్కటి కూడా క్యాచీగా అనిపించదు. విజువల్స్ కూడా కొత్తగా అనిపించవు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకోకుండా ఉంటే బెటర్ ఏమో అన్నట్టుగా ఉంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ నాసిరకంగా అనిపిస్తాయి. అసలు ఈ మూవీకి కోట్లు పెట్టారంటే నమ్మడం కాస్త కష్టంగానే ఉండొచ్చు.

    రేటింగ్ 2