Acharya Review : ఆచార్య రివ్యూ.. అక్కడేమీ లేదయ్యా!

Acharya Review : ఆచార్య రివ్యూ.. అక్కడేమీ లేదయ్యా!

    Acharya Review మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అందరికీ మినిమం అంచనాలుంటాయి. అందులోనూ కొరటాల శివ లాంటి క్లాస్ మాస్ డైరెక్టర్ అంటే అంచనాలు ఆకాశన్నంటుతాయి. ఇక ఇందులో రామ్ చరణ్ స్పెషల్ రోల్ అంటే.. ఇంకెలా ఉంటుంది. అయితే అంచనాలను ఆచార్య అందుకుందా? లేదా? అసలు సినిమా కథ ఏంటి? అది ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

    కథ
    ధర్మస్థలిలో బసవ (సోనూ సూద్) కారణంగా అధర్మం రాజ్యమేలుతుంటుంది. ధర్మస్థలిని కాపాడే పాదఘట్టం సైతం బసవకు ఎదురు నిలవలేకపోతుంది.అక్కడ సిద్ద (రామ్ చరణ్) ఉన్నంత కాలం ధర్మస్థలిలో ధర్మమే ఉండేది. అయితే సిద్ద ఏమైపోయాడో తెలియని జనం ఆశలు వదిలేసుకుని జీవిస్తుంటారు. అలాంటి చోటకు ఆచార్య (చిరంజీవి) వస్తాడు. ధర్మస్థలిలో ధర్మాన్ని నిలబెడతాడు. అయితే సిద్దకు, ఆచార్యకు ఉన్న సంబంధం ఏంటి? అసలు సిద్ద ఏమయ్యాడు? చివరకు ఆచార్య ధర్మాన్ని నిలబెట్టి ధర్మస్థలికి యథారూపాన్ని ఎలా తీసుకొచ్చాడు? అనేది కథ.

    నటీనటులు
    ఆచార్య పాత్రలో చిరంజీవి చక్కగా నటించాడు. కానీ ఆ వయోభారం మాత్రం కదలికల్లో కనిపిస్తూనే వచ్చింది. ఆ వయసులోనూ చిరంజీవి వేసిన స్టెప్పులు, చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక సిద్దగా కనిపించిన రామ్ చరణ్ కొత్తగా అనిపిస్తాడు. ఎంతో సౌమ్యంగా, శాంతంగా చక్కగా నటించాడు. పూజా హెగ్డేకి ఉన్నవే కొన్ని సీన్లు. ఆ సీన్లలో అందంగానే కనిపించింది. బసవగా సోనూ సూద్, రాథోడ్‌గా జిషుసేన్ గుప్తాలు చక్కగా సూట్ అయ్యారు. అజయ్, నాజర్, తణికెళ్ల భరణి ఇలా అందరూ పర్వాలేదనిపించారు.

    ఎలా ఉందంటే..
    కొరటాల శివ సినిమాలు అంటే కథలు ఏమీ అంత గొప్పగా ఉండవు. కొత్త కథలతో కొరటాల శివ సినిమా తీస్తాడని ఏ ప్రేక్షకుడూ ఊహించడు. ఆశించడు. అయితే ఇది వరకే ఉన్న కథలు, చూసిన కథలకు మెరుగులు అద్దుతాడు. ఇది వరకు చేసింది కూడా అంతే. అయితే ఇంత వరకు కొరటాలకు అపజయం అన్నది రాలేదు. తీసిని ప్రతీ సినిమా హిట్, బ్లాక్ బస్టర్ హిట్‌గానే నిలిచింది.

    అలా కొరటాల మార్క్ ప్రేక్షకుల్లో బలంగా పడిపోయింది. అయితే ఆచార్య విషయానికి వస్తే ఆ ముద్ర మాత్రం ఎక్కడా కనిపించలేదు. కొరటాల శివ సినిమాల్లో ఉండే ఆ మ్యాజిక్ మిస్ అయింది. ఈ కథలోనే అసలు లోపం ఉంది. ప్రేక్షకుడిని ఏ ఒక్క చోట కూడా కట్టిపడేసే ఎమోషన్ కనిపించలేదు. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించలేదు.

    మరీ మూస ధోరణిగా అనిపించింది. తీరా సినిమా ఎప్పుడు ముగుస్తుందా? అనే ఆలోచన, విసుగుతో ప్రేక్షకుడు ఉంటాడు. ఈ సినిమా ఎలా ముగుస్తుందో కూడా ప్రేక్షకుడు ఎప్పుడో ఊహించేస్తాడు. ఈ ఫార్మాట్ కథలు, సినిమాలను చూసి చూసీ ప్రేక్షకుడికి విసుగు కూడా పుట్టి ఉండొచ్చు. మళ్లీ ఆచార్యను కూడా అదే కోవలోకి తీసుకొచ్చి పెట్టాడు కొరటాల.

    అసలు ఇది కొరటాల రాసుకున్న కథేనా? అని అనిపిస్తుంది. ఏ డైలాగ్ కూడా మైండ్‌లో రిజిష్టర్ కాదు. అసలు ఏ సీన్ కూడా విజిల్స్ వేయించేలా ఉండదు. కానీ మెగా అభిమానులకు మాత్రం సెకండాఫ్ విపరీతంగా నచ్చుతుంది. చిరు, చెర్రీలను అలా కలిపి చూడటం, ఇద్దరూ కలిసి స్టెప్పులు వేయడం, ఫైట్స్ చేయడం బాగానే అనిపిస్తుంది.

    ఓ సీన్, ఆ తరువాత ఫైట్, ఓ సీన్ ఆ తరువాత ఫైట్ అన్నట్టుగా నెక్ట్స్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఇట్టే పసిగట్టేస్తుంటాడు. అసలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేని కథ,కథనాలు సినిమాను దెబ్బకొట్టేస్తాయి. మణిశర్మ కూడా ఈ సినిమాకు ఉపయోగపడలేకపోయాడు. తిరు ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాజల్‌ను లేపేసినట్టు.. చాలా సీన్లను లేపేయాల్సింది. నిర్మాణ విలువలు భారీగానే ఉన్నా.. వాటి ఫలితం మాత్రం శూన్యంగానే కనిపిస్తోంది.

    బాటమ్ లైన్: ఆచార్య.. ఆహా అనిపించేలా అక్కడేమీ లేదయ్యా

    రేటింగ్ : 2

    Leave a Reply