- October 17, 2021
చితక్కొట్టుకుంటేనే దేవుడి చల్లని చూపు.. బన్ని ఉత్సవాల్లో హింస

ఒకరినొకరు చితక్కొట్టుకుంటే దేవుడు కరుణిస్తాడట. ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారా? అవును నిజమే. కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో ఏటా కర్ర సాము నిర్వహిస్తుంటారు. అందులో ప్రతీ ఏటా హింస చెలరేగుతూనే ఉంటుంది. ఒకరినొకరు కర్రులతో దాడులకు దిగడంతో ఇది వరకు ఎన్నో మరణాలు సంభవించాయి.
అయితే ఈ ఏడాదిలోనూ అలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. ప్రతీ ఏడాదీ ఈ పండుగ నాడు కనీసం వంద మందికి తగ్గకుండా ప్రతి ఏటా తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. అధికారులు, ప్రభుత్వం కళ్ళెదుటే హింస జరుగుతుంటే.. పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై మాళ మల్లేశ్వర స్వామి ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరునికి దసరా పర్వదినాన కల్యాణం జరిపించి.. దివిటీల వెలుతురులో విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. దీనినే ఇక్కడ బన్ని ఉత్సవం అని కూడా పిలుస్తారు.