- December 5, 2021
Upasana : సింహాలను దత్తత తీసుకున్న ఉపాసన.. నెట్టింట పిక్స్ వైరల్

Upasana Konidela మెగా కోడలు ఉపాసన కొణిదెలకు జంతువులంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఉపాసన తన ఫాం హౌస్‌లో ఎన్నో జంతువులను పెంచి పోషిస్తుంటుంది. అంతరించిపోయే జాతులపై ఉపాసన ఎక్కువగా దృష్టి పెడుతుంది. అలా ఇప్పటికే ఉపాసన వద్ద ఓ పులి కూడా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పులికి పాలు పడుతూ ఉపాసన పోజులివ్వగా అవి తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి రెండు సింహాలు చేరాయి. ఉపాసన తాజాగా రెండు సింహాలను దత్తత తీసుకుంది.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను ఉపాసన దత్తత తీసుకుంది. ఆ రెండు సింహాలను సంరక్షణ బాధ్యతలు.. ఆహారపు ఖర్చులను సంవత్సరంపాటు ఉపాసన కొణిదెల చూసుకోనుందట. ఇందుకోసం రూ. 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్.రాజశేఖర్‌కు అందించారు.
పార్కులోని అన్ని జంతువుల సంరక్షణ, మంచి ఆరోగ్య పరిస్థితి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఉపాసన చెప్పుకొచ్చింది. క్యూరేటర్.. అతని టీం సభ్యులను ఉపాసన అభినందించింది. జూలో ఉంచిన 2000 జంతువుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు.. జూలో సరైన పరిశుభ్రతను నిర్వహించడంలో సిబ్బంది అంకితభావం.. జంతువుల కోసం జూ నిర్వహకులు చేస్తున్న సేవకు ఉపాసన ప్రశంసలు కురిపించింది.

ఉపాసన కొణిదెల మంచి మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. జూ పార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ఒక సంవత్సరం పాటు సింహాల జతను దత్తత తీసుకోవడానికి ఉపాసన కామినేని కొణిదెల, అనుష్ పాలా కామినేని ఆసక్తి చూపించారు. వన్యప్రాణుల పరిరక్షణ కోసం వారి నిబద్ధత చాలా మందికి స్ఫూర్తిదాయకమని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్ ఎస్. రాజశేఖర్ అన్నారు.