- October 10, 2025
అరి రివ్యూ.. ప్రతీ ఒక్కరూ చూడాల్సిన చిత్రం

‘పేపర్ బాయ్’ తరువాత దర్శకుడు జయశంకర్ ‘అరి’ చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అరి షడ్వర్గాల కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లోకి వచ్చింది. అనసూయ, వినోద్ వర్మ, సాయి కుమార్ వంటి వారు నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
‘అరి’ చిత్రం మానవుడిలోని ఆరు అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గాల చుట్టూ అల్లబడిన కథ. ఈ ఆరు బలహీనతలకు ప్రతీకగా ఆరు కీలక పాత్రలను పరిచయం చేస్తారు. ప్రతి పాత్ర తమలోని ఒక బలమైన కోరిక లేదా లోపంతో రగిలిపోతుంటుంది.
కామం: షాదాబ్ హోటల్లో టీ మాస్టర్ అయిన అమూల్ కుమార్ (హర్ష చెముడు). అతని జీవిత లక్ష్యం ఒక్కటే – సన్నీ లియోన్‌తో ఒక రాత్రి గడపాలి.
మాత్సర్యం: ఎయిర్ హోస్టెస్ అయిన ఆత్రేయి (అనసూయ). తన సహోద్యోగిపై ఉన్న అసూయతో, తాను ఎప్పటికీ అందంగా ఉండాలని కోరుకుంటుంది.
లోభం (దురాశ): గుంజన్ (శుభలేఖ సుధాకర్). కుటుంబ ఆస్తి మొత్తం తన సొంతం కావాలనే దురాశతో ఉంటాడు.
క్రోధం: నిధి అన్వేషణలో ఉన్న సీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్). ఇతను నిరంతరం ఆగ్రహ జ్వాలల్లో రగిలిపోతుంటాడు.
మోహం: లక్ష్మి (సురభి ప్రభావతి). చనిపోయిన తన భర్తను తిరిగి బ్రతికించుకోవాలనే మోహంతో ఉంటుంది.
మదం (అహంకారం): విప్రనారాయణ పాశ్వాన్ (సాయి కుమార్). తన వారసులు కూడా తనలాగే ఎప్పటికీ డబ్బు, హోదాతోనే బతకాలని అహంకారంతో కోరుకుంటాడు.
సోషల్ మీడియా (ఇన్స్టాగ్రామ్), పేపర్స్, ఫోర్బ్స్ వంటి ప్రతిష్టాత్మక మ్యాగజైన్లలో వచ్చిన ఒకే ఒక్క ప్రకటన – ‘ఇక్కడ మీ కోరికలు తీర్చబడును‘ – ఈ ఆరుగురినీ ఒక చోటుకు చేర్చుతుంది. తమలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల ప్రేరణతో, కోరికలు తీర్చుకోవడానికి ఆ ప్రకటన ఇచ్చిన వ్యక్తి (వినోద్ వర్మ) దగ్గరకు వస్తారు.
ఎప్పుడూ లైబ్రరీలో ఉండే ఆ రహస్య వ్యక్తి, వారి కోరికలు తీరాలంటే తాను చెప్పిన కండిషన్లను పాటించాలని షరతు విధిస్తాడు. అతను పెట్టిన ఆ షరతులు ఏమిటి? ఆ ఆరుగురు వాటిని పాటించారా? మనిషి తన కోరికల కోసం ఎంతటి పనులైనా చేయడానికి సిద్ధపడతాడా? చివరకు వారి కథ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.
కోట్లున్నా సరే.. సరిగ్గా ఒక్క పూట కూడా భోజనం చేయని బతుకు ఎందుకు?
ఎంత డబ్బుంటే ఏంటి.. చనిపోయాక పేరు పెట్టి కూడా పిలవరు.. శవం, బాడీ అని అంటారు.. అలాంటప్పుడు దేని కోసం ఈ ఆరాటం?
చనిపోయిన వ్యక్తిని తీసుకు వచ్చే బదులు.. చనిపోయిన వ్యక్తి కలను నెరవేర్చేందుకు బతుకు అనే ఇచ్చే సమాధానం..
కనిపించిన అమ్మాయిని కామంతో చూడటం మగతనం కాదు.. అమ్మని బాధ్యత చూసుకోవడం మగతనం..
తల్లిదండ్రులుగా పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి..?
వంటి ఎన్నో మంచి విషయాల్ని అరి దర్శకుడు చర్చించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు దాదాపు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్.. అందులో మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా రేంజ్ మారిపోతుంది. ఈ యూనివర్సల్ కాన్సెప్ట్‌తో అరిని అన్ని భాషల్లోనూ రీమేక్ చేసుకోవచ్చు. మరి ఇతర భాషల్లోని మేకర్లు అరిపై గురి పెడతారేమో చూడాలి.
ఆర్టిస్టుల విషయానికి వస్తే వినోద్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వినోద్ వర్మ చాలా వరకు కళ్లతోనే నటించాడు. అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు అద్భుతంగా నటించేశారు. శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష పాత్రలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. అరి లాంటి కాన్సెప్ట్‌ని ఎంచుకున్న నిర్మాతల ధైర్యానికి, గట్స్‌ను మెచ్చుకోవాల్సిందే. మాటలు, పాటలు, విజువల్స్ ఇలా అన్నీ కూడా బాగున్నాయి. అయితే నిర్మాతల నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ లభిస్తే.. మరింత బడ్జెట్ ఉంటే.. ఈ మూవీని మరింత ఎఫెక్టివ్‌గా దర్శకుడు తీసి ఉండేవాడేమో. మొత్తానికి అరి మాత్రం ఓ వర్గాన్ని ఎక్కువగానే ఆకట్టుకునేలా ఉంది.
రేటింగ్ 3