- August 17, 2025
పని చేసేవాడికి మాత్రమే పరమాన్నం పెడుతుంది.. తెలుసుకుని మసలుకోండి.. వీఎన్ ఆదిత్య

టాలీవుడ్లో సినీ కార్మికులు, యూనియన్స్ నిర్వహిస్తున్న సమ్మె గురించి అందరికీ తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్ పెట్టిన కండీషన్స్‌కి ఫెడరేషన్ ఒప్పుకోక పోవడంతో గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్స్ జరగడం లేదు. దీంతో అటు నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది.. ఇటు షూటింగ్ ఉంటే గానీ, పని దొరికితే గానీ చేతికి డబ్బులు రాని కార్మికుల కడుపులు కాలుతున్నాయి. ఈ క్రమంలో వీఎన్ ఆదిత్య ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. టీజీ విశ్వ ప్రసాద్ మీద జరుగుతున్న దుష్ప్రచారం, సమ్మె మీద తన శైలిలో స్పందించారు.
ఒక్క వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, డబ్బులొస్తేనే తీస్తాను, రాకపోతే వేరే వ్యాపారం లో పెడతాను అనుకోకుండా, లాభమొచ్చినా సినిమాలే తీస్తూ, నష్టమొచ్చినా సినిమాలే తీస్తూ తన బయటి వ్యాపారాలలో వచ్చిన లాభాలు కూడా సినిమా రంగం మీదకే మళ్లిస్తూ ఈ రంగం లో పదేళ్ల లో దాదాపు వెయ్యికోట్ల పైగా పెట్టుబడి పెట్టుకుని, ఫ్లాపుల్ని, ట్రోలింగులని ఎదురీదుతూ మొండిగా తట్టుకుని నిలబడితే.. ఆయన్ని ఎంకరేజ్ చేసి మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలతో, స్వార్ధపూరిత రాజకీయాలతో, కుల వివక్షలతో ఈ రంగం మీద పెట్టుబడిని బయటి రంగాలకి మళ్లించేలా మన ప్రవర్తన ఉంటే ఎవడికిరా నష్టం..
యాభై సినిమాలకు రెండొందల మందికి పైగా పదేళ్ల లో ఆయన పెట్టిన మూడు పూటల భోజనం ఖర్చు మాత్రమే ఒక పది పెద్ద సినిమాల బడ్జెట్టు..
కారు డ్రైవర్లకి, ప్రొడక్షన్ బాయ్స్ కి డబ్బులెగ్గొట్టి, హీరో, హీరోయన్స్ కి మాత్రమే డబ్బులిచ్చి, బడా ప్రొడ్యూసర్స్ లా మార్కెట్ లో పోజు కొట్టే చాలామందిని ఒక్క మాట అనలేని యూనియన్ లీడర్లు ఈయన మీద మాత్రం విరుచుకు పడిపోతారు..
ఏ కార్మిక సంఘం అయినా వర్కర్ కి అన్యాయం చేసిన ప్రొడ్యూసర్ పై పడాలి..
వేలమంది వర్కర్స్ కి పని కల్పించే ప్రొడ్యూసర్స్ మీద కాదు.. ఈ సమ్మె వల్ల కడుపులు కాలుతున్న కార్మికులు లక్షల్లో ఉన్నారు తెలుగు ఇండస్ట్రీ లో.. వాళ్ల ఆకలి బాధలకు ఏ యూనియన్ నాయకుడు సమాధానం చెప్తాడు..
కళారంగంలో పని దొరకడమే మొదటి ప్రాధాన్యత..
దానిని ఆపే సంఘాలు ఉన్నా ఒకటే..
ఊడినా ఒకటే.. చేతనైతే యూనియన్లు అన్నీ కలిసి ఒక్క రోజు షూటింగ్ జరిగేందుకు దోహదపడాలి.. ఆపడానిక్కాదు..
ఎన్నుకున్న నాయకులు షూటింగులకు అంతరాయం కలగకుండా సమస్యలకు పరిష్కారం తేవాలి అది సామర్ధ్యం అంటే..
పనుంటే గాని డబ్బు, అన్నం దొరకని పరిశ్రమలో పని ఆపి, ఎవ్వరూ ఎవ్వరినీ ఉద్ధరించలేరు..
నేను ఏ యూనియన్ లో అయినా సాధారణ సభ్యుడినే గానీ, ఏ పదవిలోనూ ప్రస్తుతం లేను..
అయినా నాకేం తెలుసని ఈ పోస్ట్ పెట్టానని ఎవరైనా అనుకుంటే.. ముప్ఫై అయిదేళ్లుగా సినిమా రంగంలో వస్తున్న ప్రతి మార్పు కి ప్రత్యక్ష సాక్షి ని నేను.. నా అనుభవాన్ని మించిన అర్హత లేదు అని కచ్చితంగా చెప్పగలను..
రెండు శాతం సక్సెస్ రేటున్న రంగానికి ఇన్వెస్ట్ మెంట్లు తెప్పించడం చాలా కష్టం..
రెండు వేల ఎనిమిది నుండి నా ద్వారా వచ్చిన పెట్టుబడులు రెండు వేల కోట్లు..
రాబోయే పెట్టుబడులు మరో వేయి కోట్ల పైనే..
నా వల్ల వచ్చిన గౌరవం ముప్ఫై రెండు జాతీయ,అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు..
ఇంతకన్నా అర్హత కావాలా మాట్లాడడానికి..?
నిర్మాతల్ని సినిమాలు తీయనివ్వండి.. కార్మికులు బావుంటారు.. షూటింగులు ఆపకండి. అడుక్కు తినాల్సి వస్తుంది..
సినిమా అనేది పని చేసేవాడికి మాత్రమే పరమాన్నం పెడుతుంది.. పని లేని రోజున పస్తులు పడుకో పెడుతుంది..
ఇది తెలుసుకుని మసలుకోండి..
సమ్మె చేస్తే గాని సమస్య పరిష్కారం కాలేదంటే ముందు ఆ సంఘం నాయకుణ్ని మార్చెయ్యాలి..
చర్చలతో సమస్య లకి పరిష్కారం తేలేని నాయకుడు ఏ సంఘానికైనా అప్రయోజకుడే..
దాసరి గారైనా, చిరంజీవి గారైనా, తమ్మారెడ్డి
భరద్వాజ గారైనా, మోహన్ బాబు గారైనా, బాలకృష్ణ గారైనా, ఇటువంటి సమస్య వస్తే,
సమ్మె పరిష్కారం కాదని, చర్చలతోనే పరిష్కరించుకుందాం అని ముందే చెప్తారు..
పరిష్కారం తెస్తారు..
ఈ లోగా వచ్చే భత్యాన్ని ఆపద్దని చెప్తారు..
ఎవరైనా ఇదే చెప్తారు.. చెప్పాలి కూడా..
అదీ కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించడం అంటే.. సమ్మె పేరుతో వాళ్లని షూటింగులకు దూరం చేసి, రోడ్డు మీద పడేయడం కాదు లీడర్ షిప్ అంటే..