• July 24, 2025

హరి హర వీరమల్లు రివ్యూ.. ఫ్యాన్స్‌కి మాత్రమే థ్రిల్లు

హరి హర వీరమల్లు రివ్యూ.. ఫ్యాన్స్‌కి మాత్రమే థ్రిల్లు

    హరి హర వీరమల్లు సినిమా మీద గత నెల వరకు ఎవ్వరికీ కూడా అంచనాలు ఉండేవి కావు. ట్రైలర్ వచ్చాక అంతో ఇంతో బజ్ ఏర్పడింది. పాటలు అయితే డిజాస్టర్‌గా మారాయి. ఇక పవన్ కళ్యాణ్ గత వారం నుంచి ప్రమోషన్స్ చేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచారు. దీంతో వీరమల్లు మూవీపై మంచి హైప్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా ప్రీమియర్లు కూడా ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి వేసిన షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూలై 24న తెల్లవారే సరికే రివ్యూలు బయటకు వచ్చాయి. సినిమా ఫలితం తేలిపోయింది. మరి ఈ మూవీ కథ, కథనాలు ఏంటో ఓ సారి చూద్దాం.

    కథ
    వీరమల్లు కథ గురించి కొత్తగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఈ కథ ఏంటో అందరికీ వివరించేస్తూ వచ్చారు. 16వ శతాబ్దానికి చెందిన ఓ కల్పిత కథ అని అందరికీ తెలిసిందే. ఔరంగజేబు పాలన సమయంలో జరిగే ఈ కథలో వీరమల్లు నిజాం ప్రాంతంలో బాధితులకు అండగా నిలుస్తూ ఉంటారు. ఇక వీరమల్లు వీరత్వం తెలిసిన కుతుబ్ షాహీ అతనికి ఓ పని అప్పజెబుతాడు. ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకు రావాలని వీరమల్లుకి కుతుబ్ షాహి డీల్ కుదుర్చుకుంటాడు. మరి ఈ డీల్‌ను వీరమల్లు ఎందుకు ఒప్పుకున్నాడు? ఢిల్లీకి వెళ్లి ఔరంగజేబు వద్ద నుంచి ఈ వజ్రాన్ని ఎలా తీసుకు వస్తాడు? ఈ ప్రయాణంలో వీరమల్లుకి ఎదురైన ఘటనలు ఏంటి? అన్నదే కథ.

    ఎలా ఉందంటే?
    వీరమల్లు సినిమా ఫస్ట్ హాఫ్‌ అదరగొడుతుంది. పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశాలు, ఎలివేషన్స్, పాటలు, స్టెప్పులు, ఫైట్స్ ఇలా అన్నీ కూడా ఐ ఫీస్ట్‌లా ఫ్యాన్స్‌కి అనిపిస్తాయి. ఛార్మినార్ వద్ద ఫైట్, ఇంటర్వెల్‌లో కుతుబ్ షాహీతో సీన్లు ఇలా వెంటవెంటనే అదరగొడతాయి. ఇంటర్వెల్ వరకు సినిమా పరుగులు పెట్టినట్టుగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సైతం ఫైర్ మీదున్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మీద మరింత అంచనాలు పెంచేలా ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.

    కానీ ఆ అంచనాల్ని మాత్రం వీరమల్లు అందుకోలేకపోతాడు. సెకండాఫ్‌ మాత్రం గాడి తప్పుతుంది. ఢిల్లీ ప్రయాణం అంటూ వీరమల్లుని మరింత బోర్ కొట్టించేస్తారు. అన్ని చోట్లా సాగదీతగా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ రూపొందించిన యాక్షన్ సీక్వెన్స్ సెకండాఫ్‌కే హైలెట్ అనిపిస్తుంది. అసలు పోరాటం మాత్రం రెండో పార్ట్‌లో ఉంటుందని ఊరించేశారు. ఔరంగజేబు వర్సెస్ వీరమల్లు పోరాటాలు చూడాలంటే మాత్రం సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఆ సెకండ్ పార్ట్ వస్తుందా? లేదా? అన్నది మాత్రం డౌటే.

    ఎలా తీశారంటే?
    వీరమల్లు మూవీని స్టార్ట్ చేసింది క్రిష్. పూర్తి చేసింది జ్యోతి కృష్ణ. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లోని చాలా సీన్లు క్రిష్ హ్యాండిల్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత అంతా జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లినట్టుగా కనిపిస్తోంది. జ్యోతి కృష్ణ మార్క్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. మరీ అవుట్ డేటెడ్ మేకింగ్‌లా అనిపిస్తుంది. అయినా ఇందులో పవన్ కళ్యాణ్ మార్క్ ఎక్కువగా కనిపిస్తుంది. అంతా ఆయనే తీసుకుంటూ, చేసుకుంటూ వెళ్లినట్టు అనిపిస్తుంది.

    టెక్నికల్ పరంగా కొన్ని చోట్ల వీరమల్లు మెప్పిస్తుంది. మరి కొన్ని చోట్ల చాలా నాసిరకంగా అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ అయితే చాలా చోట్ల తేలిపోయింది. ఇలాంటి హిస్టారికల్, భారీ బడ్జెట్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత ఆలస్యం చేసినా, వాయిదాలు వేసినా కూడా సరైన అవుట్ పుట్ మాత్రం తెప్పించుకోలేకపోయారనిపిస్తుంది. కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంటుంది. కీరవాణి పాటలు తెరపై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. బీజీఎం మాత్రం ఈ మూవీకి పెద్ద బలం అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్ ఇలా అన్ని పర్వాలేదనిపిస్తాయి.

    ఎవరెలా నటించారంటే?
    వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ వన్ మెన్ షో అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ప్రతీ చోట పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు.. వినిపిస్తాడు. ఈ మూవీకి కోసం పవన్ కళ్యాణ్ చాలానే కష్టపడ్డారని అర్థం అవుతోంది. యాక్షన్ సీక్వెన్స్‌లో పవన్ కళ్యాణ్ ఒళ్లు హూనం అయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్‌లా ఉంటుంది. వీరమల్లు టీంలోని  ఆర్టిస్టులు బాగానే నటించారు. ఇక నిధి అగర్వాల్ ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. గ్లామరస్‌గా కనిపించి తెరపై అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక బాబీ డియోల్ యాక్టింగ్ అదిరిపోతుంది. కానీ అసలు సిసలు డ్రామా, యాక్షన్ చూడాలంటే రెండో పార్ట్ కోసం ఆగాల్సిందే అనేలా ఉంది.

    రేటింగ్ 2.5

    వీరమల్లు.. ఫ్యాన్స్‌కు మాత్రమే ఇస్తాడు థ్రిల్లు