• August 9, 2024

సింబా రివ్యూ.. కొత్త పాయింట్‌తో మెప్పించే మేకింగ్

సింబా రివ్యూ.. కొత్త పాయింట్‌తో మెప్పించే మేకింగ్

    అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ చేశారు. మరి ఈ చిత్రం దర్శకుడిగా మురళికి ఎలాంటి విజయాన్ని అందించింది.. కథకుడు, నిర్మాతగా సంపత్ నందికి ఎలాంటి సక్సెస్‌ను అందించింది అన్నది చూద్దాం.

    కథ
    అక్షిక (అనసూయ) ఓ మిడిల్ క్లాస్ మహిళ. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. అలాంటి అక్షిక ఓ సారి ఓ హత్య చేస్తుంది. ఆ హత్యను కనిపెట్టేందుకు జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్), పోలీస్ అనురాగ్ (వశిష్ట) ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో మరోసారి అక్షిక, ఫాజిల్ కలిసి మరో వ్యక్తిని హత్య చేస్తారు. కానీ అక్షిక,ఫాజిల్‌కు ఎలాంటి పరిచయం కానీ బంధం కానీ ఉండదు. వీరిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తారు. కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో విలన్ పార్థ (కబీర్ సింగ్) గ్యాంగ్ వీరిపై అటాక్ చేస్తుంది. ఈ క్రమంలో అక్షిక, ఫాజిల్, మరో డాక్టర్ కలిసి విలన్ గ్యాంగ్‌ను చంపేస్తుంది. అసలు వీళ్లు ఎందుకు హత్యలు చేస్తున్నారు? వీళ్లకి తెలియకుండానే ఎలా చేస్తున్నారు? వాళ్ల బాడీలో ఏం జరుగుతోంది? ఏ శక్తి ఆవహించి ఉంటుంది? ఈ కథలో పురుషోత్తం రెడ్డి (జగపతి బాబు), కబీర్ సింగ్ పాత్ర ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.

    నటీనటులు
    జగపతి బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పర్యావరణ పరిరక్షకుడిగా జగపతి బాబు ఫుల్ ఎమోషనల్ కనెక్ట్ అవుతాడు. అనసూయలో కొత్త కోణాన్ని చూస్తారు. తెరపై అనసూయ పాత్ర బాగుంటుంది. శ్రీనాథ్, వశిష్ట పాత్రలు సినిమాకు సపోర్టివ్‌గా నిలిచాయి. ఆ ఇద్దరూ చక్కగా నటించారు. ఇక దివి పాత్రతో ఈ సినిమాకు గ్లామర్ యాడ్ అయింది. ఆమె తెరపై అందంగా కనిపించింది. మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.

    విశ్లేషణ
    సంపత్ నంది తీసుకున్న పాయింట్ కొత్తగానే ఉంటుంది. కానీ రాసుకున్న కథనంలో అంత పస కనిపించదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. ఇక దర్శకుడు మురళీ ఈ సినిమాను తనకు వీలైనంత వరకు కాపాడే ప్రయత్నం చేశాడు. ఎంగేజింగ్‌గా మలిచేందుకు, పాత్రలను డిజైన్ చేసిన తీరు, సినిమాను తీసిన తీరు బాగుంటుంది. నటీనటుల నుంచి మంచి పర్ఫామెన్స్‌ను రాబట్టుకున్నాడు.

    టెక్నికల్ టీంను బాగానే వాడుకున్నాడు దర్శకుడు. మంచి విజువల్స్, ఆర్ఆర్‌లతో తన సినిమాను బాగానే ప్రజెంట్ చేసుకున్నాడు. కొత్త దర్శకుడైనా కూడా అనుభవరాహిత్యం మాత్రం కనిపించలేదు. తొలి ప్రయత్నంలోనే మురళీ తన మేకింగ్ నాలెడ్జ్‌ను చూపించాడనిపిస్తుంది. ఆయన మేకింగ్, టేకింగ్‌కు సరైన కంటెంట్ పడి ఉంటే సింబా రిజల్ట్ వేరేలా ఉండేదనిపిస్తుంది.

    ఫస్ట్ హాఫ్ మెప్పించినంతగా.. సెకండాఫ్ మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఆడియెన్స్‌కి కనిపించే ఎగ్జైట్మెంట్ ద్వితీయార్దంలో కనిపించదు. సెకండాఫ్‌ చాలా కష్టంగా సాగుతుంది. చాలా చోట్ల సిల్లీగా అనిపిస్తుంది. కానీ సింబా మాత్రం ఓ మంచి మెసెజ్‌ను ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింబా అవసరం ఉందనిపిస్తుంది.

    రేటింగ్ 3