Maa Awara Zindagi Review: ఆవారా జిందగీ రివ్యూ.. నవ్వించిన శ్రీహాన్

Maa Awara Zindagi Review: ఆవారా జిందగీ రివ్యూ.. నవ్వించిన శ్రీహాన్

    aa Awara Zindagi Review: బిగ్ బాస్ షోతో శ్రీహాన్‌కు మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్ షో కంటే ముందుగా యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేసుకుంటూ వచ్చాడు. లఘు చిత్రాలతో శ్రీహాన్‌కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు శ్రీహాన్ సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చాడు. ఆవారా జిందగీ అంటూ అందరినీ నవ్వించి ఎంటర్టైన్ చేసేందుకు ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చాడు. మరి శ్రీహాన్ ఈ ప్రయత్నం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

    కథ
    బిగ్ బాస్ శ్రీహాన్, జబర్దస్త్ అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్‌లు ఉద్యోగం సద్యోగం లేకుండా ఆవారాల్లా తిరుగుతుంటారు. ఇంట్లో ఎన్ని చీవాట్లు పెడుతున్నా పట్టించుకోకుండా తినడం, తిరగడమే తమ పనిలా పెట్టుకుని బతుకుతుంటారు. ఇక అజయ్‌ది అయితే అమ్మాయిలను ఏడిపిస్తూ నిత్యం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పాత్ర. అజయ్ వల్ల ఫ్రెండ్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్సై రెడ్డి (షియాజీ షిండే)తో దెబ్బలు, చీవాట్లు తింటూ ఉంటారు. ఓ సారి ఎస్సై కూతురు కనిపించకుండా పోతుంది? ఆమెను ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఆ గ్యాంగ్‌కు ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎలా చిక్కారు? చివరకు ఆ అమ్మాయిని ఈ నలుగురు ఎలా కాపాడారు? అనేది కథ.

    నటీనటులు
    బిగ్ బాస్ శ్రీహాన్, జబర్దస్త్ అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్‌లు ఎంతో సహజంగా నటించినట్టు అనిపిస్తుంది. పక్కింటి కుర్రాళ్లా ఎంతో ఈజీగా నటించారు. నిజమైన ఆవారాల్లానే అనిపిస్తారు. నలుగురి కామెడీ టైమింగ్ బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ కూడా బాగుంది. సినిమాల్లో ఈ నాలుగు పాత్రలే హైలెట్ అవుతాయి. ఎస్సైగా కనిపించిన షియాజీ షిండే కూడా మెప్పిస్తాడు. కానీ ఆయన డబ్బింగ్ మాత్రం కాస్త కొత్తగా, వింతగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు ఓకే అనిపిస్తాయి.

    విశ్లేషణ
    ప్రస్తుతం సమాజం ఎలా ఉంది? ఉద్యోగాలు లేకపోతే కుర్రాళ్లను ఎలా చూస్తున్నారు? ముప్పై దాటినా పెళ్లిళ్లు కావడం లేదంటూ ఎలా ఫ్రస్ట్రేట్‌ అవుతున్నారు? సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడు అయితే చాలు ఎలాంటి మర్యాదలు ఇస్తున్నారు? అనే పాయింట్లను టచ్ చేస్తూ దర్శకుడు చక్కని వినోదాత్మకంగా సినిమాను మలిచాడు. అమ్మాయిలు కనిపించకుండా పోవడం, వారితో ఇల్లీగల్ వ్యాపారాలు చేయిస్తుండటం అనే పాయింట్లను కూడా టచ్ చేశాడు డైరెక్టర్.

    గే కల్చర్ ఎక్కువ అవ్వడం, సమాజంలో మగాళ్లకు కూడా రక్షణ లేదన్నట్టుగా చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు. డైరెక్టర్ తాను అనుకున్న పాయింట్‌లను ఎంతో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో దర్శకుడు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మాటలు అక్కడక్కడా పేలుతాయి. బూతు డైలాగ్స్ వినిపించకుండా సెన్సార్ వాళ్లు అడ్డుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ప్రథమార్థం రొటీన్ సీన్లతో సాగితే.. ద్వితీయార్థంలో నవ్వించే సీన్లు ఎక్కువగా వస్తాయి.

    ద్వితీయార్థంలో నలుగురు కలిసి మసాజ్ సెంటర్‌కు వెళ్లడం, ఆ తరువాత ఓ వేశ్య దగ్గరికి వెళ్లడం, అటుపై మళ్లీ ఓ రిచ్ వేశ్య దగ్గరికి వెళ్లే సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక క్లైమాక్స్‌ కూడా ఎంతో సహజంగా అనిపిస్తుంది. రొటీన్‌కు భిన్నంగా రాసుకున్నారు. సాంకేతికంగానూ ఈ సినిమా ఓకే అనిపిస్తుంది. ఆర్ట్, ఎడిటింగ్, కెమెరా, సంగీతం, ఆర్ఆర్ ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాణ విలువలు పర్వాలేదనిపిస్తాయి.

    రేటింగ్ 2.75