- February 13, 2023
కథ వినగానే ‘సార్’ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను – సంయుక్త మీనన్
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(తెలుగు)/ ‘వాతి'(తమిళం). శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. స్టార్ యాక్టర్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రచార కార్యక్రమాలలో భాగంగా తాజాగా కథానాయిక సంయుక్త మీనన్ విలేకర్లతో ముచ్చటించి సార్ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి?
2016 లో మొదటి సినిమా చేశాను. అప్పటికి సినిమానే కెరీర్ గా ఎంచుకోవాలి అనుకోలేదు. నేను కేరళలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయిని. చుట్టు పక్కల వాళ్లకి ఏదో ఒక సినిమా చేశానని చెప్పుకోవాలి అనుకున్నాను. మొదటి సినిమా తర్వాత చదువు కోసం ఒక ఏడాది విరామం తీసుకున్నాను. కానీ విధి మళ్ళీ సినిమాల్లోకి తీసుకొచ్చింది. నటిగా సంతృప్తినిచ్ఛే ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో సినిమాతో ప్రేమలో పడ్డాను. ఇప్పుడు సినిమానే జీవితం అయిపోయింది. నటిగా విభిన్న పాత్రలు పోషించి మెప్పించాలి అనుకుంటున్నాను. తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టాక ఇది నా కెరీర్ లో ఉత్తమ దశ అనిపించింది.
సార్ గురించి చెప్పండి?
నేను తెలుగులో మొదట బింబిసార, ఆ తరువాత విరూపాక్ష సినిమా అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలయ్యాక కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్ లో భీమ్లా నాయక్ లో నటించే అవకాశమొచ్చింది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో నేను పోషించిన పాత్రలో చేసిన మార్పులు నచ్చి, వెంటనే ఆ సినిమా అంగీకరించడం జరిగింది. భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే సార్ చిత్రం. డైరెక్టర్ వెంకీ గారు కథ చెప్పగానే ఈ సినిమా ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు.
ఈ చిత్రంలో పాత్ర కోసం ఏమైనా హోమ్ వర్క్ చేశారా?
కొన్ని పాత్రల కోసం ముందుగానే హోమ్ వర్క్ చేయాలి. కొన్ని కొన్ని పాత్రలు మాత్రం అప్పటికప్పుడు సహజంగా చేస్తేనే బాగుంటుంది. ఇందులో నేను తెలుగు పల్లెటూరి అమ్మాయి పాత్ర పోషించాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలుసుకోవడం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు వెళ్ళాను. అలాగే పాత్ర గురించి బాగా తెలుసుకోవడానికి డైరెక్టర్, రైటర్ తో ఎక్కువ చర్చించాను. అంతేకాకుండా టీచర్ల చీరకట్టు ఎలా ఉంటుంది? వాళ్ళ మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఇలాంటివన్నీ గమనించాను.
ధనుష్ తో కలిసి నటించే అవకాశం రావడం ఎలా అనిపించింది?
చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటినుంచో ఆయన సినిమాలు చూస్తున్నాను. ఆయనకు అభిమానిని. ఆయన మంచి నటుడు, అలాగే పెద్ద స్టార్ కూడా. అలాంటి నటుడితో కలిసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
కెరీర్ ప్రారంభంలోనే పెద్ద హీరోలతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
ముందుగా కథ ఎలా ఉంది?, పాత్ర ఎలా ఉంది? అని చూస్తాను. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఇంకా దానికి స్టార్ తోడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే ఆ హీరో అభిమానుల ప్రేమ కూడా దక్కుతుంది. భీమ్లా నాయక్ సమయంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ప్రేమ చూపించారు.
ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
డైరెక్టర్ వెంకీ గారి గత సినిమాల్లో మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో నేను మీనాక్షి అనే బయాలజీ టీచర్ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో కథానాయకుడి పాత్రతో పాటు నా పాత్ర కూడా బలంగా ఉంటుంది. సినిమా ప్రధాన కథలోకి వెళ్ళినప్పుడు హీరో పాత్రతో పాటు నా పాత్ర ప్రయాణం సాగుతుంది.
సినిమా ఎలా ఉండబోతుంది?
ఇందులో విద్యావ్యవస్థ గురించి సందేశం ఇవ్వడమే కాదు.. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉన్నాయి.
డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి చెప్పండి?
ఆయనలో మంచి రచయిత, దర్శకుడు ఇద్దరూ ఉన్నారు. నటీనటుల నుంచి మంచి ఎమోషన్స్ రాబట్టుకుంటారు. ఆయన సెట్ లో చాలా సరదాగా ఉంటారు. దర్శకుడిగా తన పనిని వంద శాతం చేస్తారు.
డబ్బింగ్ మీరే చెప్పారా?
ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయాను. అదే సమయంలో ఇతర సినిమాల షూటింగ్ లు ఉండటం వల్ల ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది.
ధనుష్ నుంచి ఏం నేర్చుకున్నారు?
ఆయన అద్భుతమైన నటుడు. ఎక్కువ తక్కువ కాకుండా పాత్రకు ఏం కావాలో అది చేస్తారు. ఆయన నుంచి నటనలో మెళకువలు నేర్చుకున్నాను.
మీ తెలుగు గురువు ఎవరు?
నా తెలుగు ట్యూటర్ ఆశ. నాకు తెలుగు బాగా నేర్పించారు. షూటింగ్ సమయంలో నేను తెలుగు బాగా మాట్లాడటం చూసి అందరూ ఎంతో సంతోషించారు.
ఇతర సినిమాలు?
విరూపాక్ష షూటింగ్ చివరి దశలో ఉంది. బింబిసార-2 ప్లాన్ చేస్తున్నాం అన్నారు.