Site icon A2Z ADDA

Jilebi Movie Review : జిలేబి మూవీ రివ్యూ.. కొడుకుని హీరోగా నిలబెట్టిన నువ్వు నాకు నచ్చావ్ దర్శకుడు

నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ వంటి క్లాస్ బ్లాక్ బస్టర్ హిట్లు తీసిన విజయ్ భాస్కర్ దర్శకత్వం అంటే అందరికీ మక్కువే.అయితే ఆయన దర్శకత్వంలో సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఆయన ఇప్పుడు తన కొడుకు శ్రీ కమల్‌ను హీరోగా పరిచయం చేస్తూ జిలేబి అనే సినిమాను తీశాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
హాస్టల్లో ఉండే నలుగురు కుర్రాళ్ల చుట్టూ ఈ జిలేబి కథ తిరుగుతుంది. బాయ్స్ హాస్టల్లోఉంటూ చదువుకునే కుర్రాళ్ల జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించిన జరిగే పరిణామాల చుట్టూ తిరుగుతుంటుంది. కమల్ (శ్రీ కమల్)కి, జీఎల్‌బీ (జి లక్ష్మీ భారతి) అలియాస్ జిలేబి (శివానీ రాజశేఖర్)తో పరిచయం ఏంటి? వారిద్దరి కథలోకి బుజ్జి (సాయి కుమార్ బబ్లూ) బాబీ (అంకిత్ కొయ్య), వాషింగ్టన్ (వైవా సన్నీ) ఎందుకు వచ్చారు? ఎలా వస్తారు? జిలేబి తండ్రి ఎంఎల్ఏ రుద్ర ప్రతాప్ రానా (మురళీ శర్మ) వల్ల ఎదురైన పరిస్థితులు ఏంటి? ఈ కథలో హాస్టల్ వార్డెన్ ధైర్యం (రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు
విజయ్ భాస్కర్ కొడుకు అంటే అందరికీ ఓ రేంజ్‌లోనే అంచనాలుంటాయి. స్టార్ డైరెక్టర్ కొడుగ్గా తన మీదున్న అంచనాలను శ్రీ కమల్.. తొలి ప్రయత్నంలోనే అందుకున్నాడు. మొదటి సినిమాలోనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకోసం పడ్డ కష్టం తెరపై కనిపిస్తుంది.పక్కింటి కుర్రాడిలా సహజంగా కనిపించాడు. యాక్షన్, కామెడీ, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. శివానీ రాజశేఖర్ అందంగా కనిపించడమే కాదు నటనతోనూ ఆకట్టుకుంటుంది మిగిలిన పాత్రల్లో మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి వారు తమ అనుభవాన్ని తెరపై చూపించగా.. స్నేహితులుగా కనిపించిన పాత్రలు, అందులో నటించిన వారు కూడా పర్వాలేదనిపిస్తారు.

విశ్లేషణ
విజయ్ భాస్కర్ కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోనూ అలాంటి ఓ కామెడీ టైమింగ్ కనిపిస్తుంది. బాయ్స్ హాస్టల్ చుట్టూ ఈ కథను రాసుకోవడంతో యూత్‌ను ఇట్టే ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు అయింది. ఇందులో విజయ్ భాస్కర్ తన శైలిని వదలకుండా డైలాగ్స్, స్క్రీన్ ప్లేను రాసుకున్నాడు. ప్రథమార్దం కంటే ద్వితీయార్థం ఎక్కువగా అందరినీ ఆకట్టుకుంటుంది.

మొదటి భాగంలో పాత్రల పరిచయానికే ఎక్కువ టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. రెండో భాగంలోనే అసలు కథలు, ట్విస్టులు అంతా ఉంటాయి. ద్వితీయార్దంలో రాజేంద్ర ప్రసాద్ చుట్టూ రాసుకున్న ట్రాక్ అద్బుతంగా వచ్చింది. బాయ్స్ హాస్టర్ వార్డెన్‌గా రాజేంద్ర ప్రసాద్‌తో చేయించిన కామెడీ బాగుంటుంది. చేతబడి చేసే సీన్లు కూడా కడుపుబ్బా నవిస్తాయి. సెకండాఫ్లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆకట్టుకుంటాయి.

విజయ్ భాస్కర్ ఈ కథను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. బాయ్స్ హాస్టల్‌లో అమ్మాయిని పెట్టి.. ఆ పాయింట్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి పాయింట్‌తో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ విజయ్ భాస్కర్ తన మార్క్, స్టైల్‌తో ఈ సినిమాను మలిచాడు. ప్రారంభ సన్నివేశాలు కాస్త బోరింగ్, స్లోగా అనిపించినా.. బాయ్స్ హాస్టల్‌లోకి హీరోయిన్ వచ్చి ఉన్న దగ్గరి నుంచి కథలో వేగం పుంజుకుంటుంది.

విజయ్ భాస్కర్ స్క్రీన్ ప్లే, స్టోరీ, మాటలు అన్నీ కూడా సినిమాకు ప్లస్సుగా మారాయి. సాంకేతికంగానూ సినిమా మెప్పిస్తుంది. మణిశర్మ పాటలు, ఆర్ఆర్ బాగున్నాయి. అవే ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఎం ఆర్ వర్మ ఎడిటింగ్, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ 2.75

Exit mobile version