తెలుగు పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఏవేవో నడుస్తూ వచ్చాయి. సినిమాలు చూడటం లేదని, జనాలు థియేటర్లకు రావడం లేదని, తాము తీవ్రంగా నష్టపోతోన్నామని ఇలా ఏవేవో అన్నారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఇష్టారీతిన టికెట్ రేట్లు కొంప ముంచాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆర్ఆర్ఆర్ తరువాత ఆ స్థాయి సినిమా రాలేదు. కానీ టికెట్ రేట్లు మాత్రం ఆ స్థాయిలోనే పెంచుకున్నారు.
అందుకే ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు దెబ్బ పడింది. మధ్యలో విక్రమ్ గట్టిగా హిట్ కొట్టేశాడు. మేజర్ కూడా పర్వాలేదనిపించాడు. ఆ తరువాత ఏ ఒక్క సినిమా కూడా హౌస్ ఫుల్ అయిన దాఖలాలు లేవు. విడుదలైన సినిమా విడుదలైనట్టే వెనక్కి తన్నేసింది. రామ్ వారియర్, రవితేజ రామారావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. వాటికి టికెట్ రేట్లు ఓ కారణం అయితే.. అందులోని కంటెంట్ మరో కారణం.
సినిమా బాగా లేకపోతే.. కంటెంట్ నచ్చకపోతే.. అది ఏ సినిమా అని, ఏ హీరో అని కూడా చూడటం లేదు ప్రేక్షకులు. నిర్మొహమాటంగా మొహాన్నే తిప్పి కొట్టేస్తున్నారు. అదే సినిమా అదిరిపోయిందనే టాక్ వస్తే మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితే రిపీట్ అవుతుంది. గత మూడు నాలుగు రోజులుగా బింబిసార, సీతారామం సినిమా హాళ్లు నిండిపోతోన్నాయి. జనాలతో థియేటర్లు కిక్కిరిసిపోతోన్నాయి.
బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బింబిసార అయితే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సీతారామం ఓవర్సీస్‌లోనూ దుమ్ములేపుతోంది. ఆల్రెడీ అక్కడ హాఫ్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసింది. సో.. కంటెంట్ బాగుంటే సినిమాకు జనాలు వస్తారు. ముందు కథ, కథనాలు మీద నిర్మాతలు దృష్టి పెడితే బాగుంటుంది. ఈ బంద్‌లు, రెమ్యూనరేషన్‌లు, టికెట్ రేట్ల మీద కాదని తెలుసుకుంటే మంచిది.