Tollywood Producers టాలీవుడ్ నిర్మాతలు ప్రస్తుతం షూటింగ్‌లు ఆపాలా?వద్దా? ఓటీటీలో విడుదల చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఎవ్వరూ కూడా ఏ విషయం మీదా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. కొందరేమో షూటింగ్‌లు ఆపితేనే అసలు సమస్యలు అందరికీ అర్థమవుతాయని అంటున్నారట. ఇంకొందరు అయితే షూటింగ్‌లు ఆపితే మనకే నష్టం కదా? అని అంటున్నారట. మొత్తానికి ఆగస్ట్‌లో షూటింగ్‌ల పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది.
నిర్మాతలకు సినిమాలు నిర్మించడం తలకు మించిన భారంగా మారుతోంది. దీనికి హీరోలు, దర్శకుల రెమ్యూనరేషన్‌లు ప్రధాన కారణం. సినిమా బడ్జెట్‌లో సింహ భాగం వారికే పోతోంది. హీరోలు 20, 50, 70 కోట్లు అంటూ తీసుకుంటున్నారు. దర్శకులు కూడా అదే రేంజ్‌లో రెమ్యూనరేషన్‌లు తీసుకుంటున్నారు. ఇక సినిమా బడ్జెట్ హద్దులు దాటకుండా ఎలా ఉంటుంది.
వీటికి తోడు హీరోయిన్లు, వారి అసిస్టెంట్లు, హీరోల అసిస్టెంట్లంటూ నిర్మాతకు తడిసి మోపడవుతుంది. ఇవన్నీ చక్క పెట్టుకోకుండా.. సినిమా వ్యయం పెరుగుతోందని, టికెట్ ధరలు పెంచుకోవడంతో మొదటికే మోసం వచ్చినట్టు అయింది. దీంతో థియేటర్లకు జనాలు రావడమే మానేశారు. పెద్ద హీరోల సినిమాలు సైతం డిజాస్టర్లుగా మారుతున్నాయి. దీనికి కారణం నిర్మాతల అత్యాశే అని అర్థమవుతోంది. ఇష్టారీతిన పెంచుకున్న టికెట్ రేట్లతో ఉన్నది పోయింది.. ఉంచుకున్నది పోయిందన్నట్టుగా మారింది.
ఇక ఇప్పుడు సినిమాల ఫలితాలు,దాని కలెక్షన్ల మీద పడ్దాయి. ఆచార్య, థాంక్యూ వంటివి ఘోరాతి ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. అయితే టికెట్ రేట్లు తగ్గించాం మొర్రో.. మా సినిమా సాధారణ టికెట్ రేట్ల మీదే రాబోతోందని నిర్మాతలు చాటింపు వేసుకునే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఆడియెన్స్ మాత్రం వాటి వైపు కూడా రావడం లేదు.
అందరూ కూడా ఓటీటీనే నమ్ముకుంటున్నారు. ఓటీటీలో ఫ్రీగా చూసుకోవచ్చు కదా?అనే ఆలోచనలో ఉన్నారు. ఓటీటీల నిర్మాతలకు అంతో ఇంతో ఆదాయం వస్తోంది. అయితే ఇప్పుడ ఆ ఆదాయాన్ని కూడా కాలితో తన్నుకునేలా ఉన్నారు. చిన్న సినిమాలు అంటే ఆరు కోట్ల లోపు బడ్జెట్తో తెరకెక్కించిన చిత్రాలైతే.. నాలుగు వారాల తరువాత ఓటీటీకి ఇవ్వాలట. అదే పెద్ద సినిమాలు అయితే పది వారాల గడువుతో ఇస్తారట. ఇలా చేస్తే అటు థియేటర్, ఇటు ఓటీటీ కాకుండా.. మధ్యలో పైరసీని ఆశ్రయించే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్ నిర్మాతలు ముందు హీరో, దర్శకుల రెమ్యూనరేషన్ కట్టడి చేస్తే వారి భారాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. టికెట్ రేట్లు కూడా పూర్తిగా తగ్గిస్తే పూర్వ వైభవాన్ని మనం చూడొచ్చు.