Site icon A2Z ADDA

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రివ్యూ.. ఆద్యంతం నవ్విస్తుంది

తిరువీర్ ఎంచుకునే కథలు ఎంత విభిన్నంగా,సహజంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సారి తిరువీర్ ప్రధాన పాత్రలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమాను రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ చిత్రం నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నవంబర్ 5న స్పెషల్‌గా ప్రీమియర్ వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
రమేష్ (తిరువీర్) మంచి ఫోటోగ్రాఫర్. గ్రామపంచాయితీలో పని చేసే సెక్రటరీ రమ్య (టీనా శ్రావ్య)ని ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రమేష్ అంటే ఇష్టంగానే ఉంటుంది. ఇక ఆనంద్ (నరేంద్ర రవి) తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కావాలని రమేష్ వద్దకు వస్తాడు. మంచి పలుకుబడి ఉన్న ఆనంద్.. ఆ మండలంలో తనదే బెస్ట్ వెడ్డింగ్ షూట్ కావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో సౌందర్య (యామినీ నాగేశ్వరరావు), ఆనంద్‌లకు రమేష్ అద్భుతంగా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేస్తాడు. కానీ చిప్‌ మిస్ అవుతుంది. దీంతో రమేష్ ఆ ఇద్దరి పెళ్లి ఆపితే.. ఫోటో షూట్ గురించి అడగరు కదా? అని అనుకుంటాడు. ఈక్రమంలో రమేష్ చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు ఆనంద్, సౌందర్య కథ ఏం అవుతుంది? పెళ్లి ఆపాలని అనుకున్న రమేష్ మళ్లీ వారిని ఒకటి చేయాలని ఎందుకు అనుకుంటాడు? చివరకు ఏం జరుగుతుంది? అన్నదే కథ.

ప్రీ వెడ్డింగ్ షో అనేది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఎందుకు అయింది? ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు? అన్నది సినిమాను చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఆ పెళ్లిని చెడగొట్టేందుకు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. మాస్టర్ రోహన్, తిరువీర్, నరేంద్ర రవి, టీనా రవి పాత్రలే ఎక్కువగా ఫస్ట్ హాఫ్‌లో కనిపిస్తుంటాయి. ఈ కారెక్టర్స్ మధ్యే సీన్లు నడుస్తుంటాయి. ఎక్కడా గొప్పగా ఉందనే ఫీలింగ్ రాకపోయినా.. బోర్ మాత్రం కొట్టించకుండా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.

ఇక సెకండాఫ్ అంతా కూడా పెళ్లి జరిపించాలని, ఆ జంటను ఒకటి చేయాలని హీరో చేసే ప్రయత్నాలు చాలా చోట్ల నవ్వుతెప్పిస్తాయి. అలా సెకండాఫ్ కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తున్నట్టుగా అనిపించినా.. అక్కడా సరదాగా నవ్వించేశారు. ఇక ప్రీ క్లైమాక్స్‌కి చిప్ పోగొట్టిన సీన్ తెలియడం, అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే చివరకు ఆ చిప్ దొరుకుతుందేమో అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ అలా దొరికితే అది రెగ్యులర్‌గా ఉందే? అని ఆడియెన్స్ అనుకుంటారని దర్శకుడు ఊహించుకుని క్లైమాక్స్ అలానే రాసుకున్నాడేమోననిపిస్తుంది. అలా మొత్తానికి ఆద్యంతం నవ్వించేలా చిన్న పాయింట్‌తో సినిమాను సక్సెస్ ఫుల్‌గా దర్శకుడు నడిపించేశాడు. పెద్ద అంచనాలేమీ లేకుండా వెళ్తే హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసేలా ఉంటుందీ చిత్రం.

నటీనటుల విషయానికి వస్తే రమేష్ పాత్రలో తిరువీర్ నటన సహజంగా అనిపిస్తుంది. కామెడీ, ఎమోషనల్ ఇలా అన్ని సీన్లలో తిరువీర్ ఆకట్టుకున్నాడు. టీనా శ్రావ్య చూడటానికి చూడముచ్చటగా ఉండటంతో పాటుగా పాత్రకు తగ్గట్టుగా నటించేసింది. నరేంద్ర రవి తన పాత్రతో అందరినీ ఆకట్టుకుంటాడు. సౌందర్యగా యామినీ తనకు దొరికిన స్క్రీన్ స్పేస్‌కు తగ్గట్టుగా నటించేసింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తండ్రిదండ్రుల పాత్రలు బాగుంటాయి. మాస్టర్ రోహన్ పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

ప్రీ వెడ్డింగ్ షోలో మాస్ సాంగ్స్ ఉండవు.. హీరో ఎంట్రీ ఫైట్స్ ఉండవు.. హీరోయిజం ఉండదు.. జస్ట్ పాత్రలుంటాయి.. చిప్ పోయిందన్న చిన్న పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.. దానికి తగ్గట్టుగా నేచురల్ విజువల్స్, కథకు తగ్గ మ్యూజిక్, ఆర్ఆర్, మంచి పాటలు.. అవి కూడా కథలో భాగంగా.. కథకు సరిపోయేలానే ఉంటాయి. పెట్టిన ఖర్చుకుని మంచి అవుట్ పుట్ మాత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ మూవీకి థియేటర్ రెవిన్యూ పరంగా ఎలాంటి స్టేటస్ వస్తుందో చూడాలి.

రేటింగ్ 3/5

 

Exit mobile version