Site icon A2Z ADDA

మిరాయ్ రివ్యూ.. లోపాలివే

Mirai Telugu Movie Review మిరాయ్ మూవీ మీద మంచి బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. హనుమాన్ తరువాత తేజ సజ్జాకి సూపర్ హీరో స్టేటస్ వచ్చింది. ఆ క్రేజ్‌తోనే ఈ మిరాయ్ మూవీ మీద మంచి హైప్ ఏర్పడింది. సూపర్ యోధగా తేజ సజ్జా మిరాయ్‌లో మెప్పించాడా? అసలు ఈ మిరాయ్ ఏంటి? అంత శక్తి ఎందుకు వచ్చింది? దాని కథ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం.

కథ
అశోకుడు తన శక్తినంతా తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేయడం.. ఆ తొమ్మిది గ్రంథాల్ని కాపాడే బాధ్యతను కొంత మందికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తొమ్మిది గ్రంథాల శక్తిని అందుకుని దేవుడిగా మారి ప్రపంచాన్ని శాసించాలని అనుకునే వాడు మహామీర్ లామా (మంచు మనోజ్). భవిష్యత్తుని చూసిన అంబికా ప్రజాపతి (శ్రియా) గర్భంలో ఉన్న కొడుకుని త్యాగం చేసి వదిలేస్తుంది. ఆ కొడుక్కి వేద ప్రజాపతి (తేజా సజ్జా) అని పేరు పెడుతుంది. ఎక్కడెక్కడో పెరుగుతూ, తన గురించి తనకే తెలియకుండా, ఈ గ్రంథాల గురించి తెలీకుండా పెరిగే వేదను తిరిగి తీసుకు రావడానికి సమయం ఆసన్నం అవుతుంది. ఆ పనిని విభా (రితికా నాయక్) చేస్తుంది? మరి వేద తన గతాన్ని ఎలా తెలుసుకుంటాడు? మిరాయ్‌ని పొందేందుకు ఎలా కష్టపడతాడు? మిరాయ్‌ను సాధించిన తరువాత ఏం చేస్తాడు? దేవుడు అవ్వాలనుకునే మహాబల్ కోరిక నెర వేరుతుందా? చివరకు ఏం జరుగుతుంది? అన్నదే కథ.

విశ్లేషణ
మిరాయ్ కథ ఏంటి? అన్నది కార్తిక్ ఘట్టమనేని ముందే చెప్పేశాడు. అశోకుడు, కళింగ యుద్దం, 9 గ్రంథాలు.. వాటిని సంరక్షించేందుకు యోధులు, వాటిని చేజక్కించుకునేందామనే ఓ విలన్ అని ఇలా అన్నీ క్లియర్‌గా ముందే చెప్పేశాడు. సినిమా చూశాక కూడా అదే అనిపిస్తుంది. కథ అంతా తెలిసిన తరువాత మూడు గంటల సేపు ఎలా కూర్చుండ బెడతాడు? అంత ఇంట్రెస్టింగ్‌గా ఏం ఉంటుంది? అని అంతా అనుకుని ఉంటారు. అయితే కథ ప్రారంభం అదిరిపోయింది. పది, 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.

తేజ సజ్జా పాత్ర ఎంట్రీ తరువాత కథ పూర్తిగా గాడి తప్పినట్టు అనిపిస్తుంది. హీరో, హీరో ఇంట్రో ఫైట్, అక్కడి సీన్లు, ఆ తరువాత హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ సీన్లు ఇవేవీ కూడా ఓ గొప్ప సినిమాను చూడబోతోన్నామన్న ఫీలింగ్‌ను తీసుకు రాదు. హీరో, హీరోయిన్ల ట్రాక్ కూడా అంతగా సెట్ కాదు. ఇక సినిమాలో నెక్ట్స్ సీన్ ఏంటి? అన్నది ఇట్టే చెప్పేయొచ్చు. కొన్ని డైలాగ్స్ కూడా సీటులో కూర్చున్న ప్రేక్షకుడే గెస్ చేసేస్తాడు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఒంటిపై ముద్ర కనిపించే సీన్ కూడా బాగానే ఉంటుంది.

ఇక ద్వితీయార్దంలో అయినా కథనం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా? అంటే అక్కడా నిరాశ తప్పదు. అగస్త్య మునిని అంత కామెడీగా ఎందుకు చూపించాలి? జెన్ జీ కిడ్స్ కోసం అలా మునితో కామెడీ చేయించాలా? అని అనిపిస్తుంది. ఇలాంటి లోపాలు సినిమా స్థాయిని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. మిరాయ్ శక్తిని చూపించే యాక్షన్ సీక్వెన్స్ బాగానే ఉంటుంది. అయితే మిరాయ్, బ్లాక్ స్వాడ్ తలపడినప్పుడు రావాల్సిన ఎఫెక్ట్ మాత్రం రాలేదనిపిస్తుంది. అమృతం చేజక్కించుకున్న వాడ్ని ఎవరు చంపలేరు అన్నది మనకు తెలుసు. కానీ ఇందులో అలా జరగదు. శ్రీరాముడి బాణంతో వధించి క్లైమాక్స్‌ని ఏదో అలా చుట్టేసినట్టుగా అనిపిస్తుంది.

రానా చివర్లో వచ్చి చేసిన హడావిడి సినిమాకు ప్రాధాన్యత పెంచదు. అదేదో యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది తప్పా.. మిరాయ్ రెండో పార్ట్ అని, రెండో పార్ట్‌లో రానా విలన్ అని ఏ మాత్రం కూడా అనిపించదు. అలా అనిపించకపోవడానికి రానా మేకోవరా? రానా యాక్టింగ్? కార్తిక్ ఘట్టమనేని మేకింగా? అన్నది చెప్పడం కష్టమే.

సాంకేతికంగా మాత్రం ఈ మూవీ మెప్పిస్తుంది. ఇంత చిన్న బడ్జెట్‌లో అంత గొప్పగా ఎలా చూపించారబ్బా? అని ఆశ్చర్యపోతారు. కెమెరా వర్క్ అబ్బుర పరుస్తుంది. గౌర హరీ ఆర్ఆర్ రోమాల్ని నిక్కబొడుస్తుంది. కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ నాలెడ్జ్ మెప్పిస్తుంది. ఎడిటింగ్, ఆర్ట్, ప్రొడక్షన్ ఇలా అన్నీ కూడా ఓకే అనిపిస్తాయి. ఈగల్ మాధిరిగా కాకుండా ఇందులో కార్తిక్ డైలాగ్స్ కొన్ని చోట్ల ఓకే అనిపిస్తాయి.

నటీనటుల విషయానికి వస్తే తేజ సజ్జా మళ్లీ సూపర్ హీరో పాత్రలో మెప్పించాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి పాత్రలే ఇక తేజకు సూట్ అవుతాయనిపిస్తోంది. మంచు మనోజ్ కొన్ని చోట్ల మెప్పిస్తాడు. కానీ మరీ అంత విలనిజం పండలేదు.. పండించలేదని చెప్పుకోవచ్చు. మనోజ్‌కి ఈ మూవీతో గొప్ప పేరు అయితే రాకపోవచ్చు. రితికా నాయక్‌ పాత్ర ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటే బాగుండేదనిపించింది. ఆమెతో కూడా యాక్షన్ సీక్వెన్స్ పెడితే బాగుండేదేమో. శ్రియా పాత్ర బెటర్ అనిపిస్తుంది. జగపతి బాబు కారెక్టర్ పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన కారెక్టర్‌లు ఓకే అనిపిస్తాయి. గెటప్ శ్రీను, పోలీసుల ట్రాక్ చిరాగ్గా అనిపిస్తాయి.

అవేంజర్స్, హాలీవుడ్ సూపర్ హీరోస్, డాక్టర్ స్ట్రేంజ్ వంటి చిత్రాలు చూసిన కళ్లకు ఈ మిరాయ్ గొప్పగా అయితే కనిపించకపోవచ్చు. మిరాయ్ చిన్న పిల్లలకు, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కే అవకాశం ఎక్కువే కనిపిస్తోంది. అలా మిరాయ్ కనుక కనెక్ట్ అయితే మళ్లీ మిరాకిల్స్ సృష్టిస్తాడు తేజ సజ్జా. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.

మిరాయ్.. కలికితురాయ్ కాలేకపోవచ్చు

రేటింగ్ 3

Exit mobile version