Tees Maar Khan Movie Review ప్రేమ కావాలి, లవ్ లీ సినిమాలతో ఆది సాయి కుమార్ బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తరువాత మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. మధ్యలో కొన్ని ప్రయోగాలు చేశాడు. ఇక ఇప్పుడు మళ్లీ మాస్ కమర్షియల్ సినిమా అంటూ తీస్ మార్ ఖాన్‌తో రాబోతోన్నాడు. ఇక ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ
తీస్ మార్ ఖాన్ (ఆది సాయి కుమార్), వసు (పూర్ణ) వారి వారి ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక్కటిగా కలిసిపోతారు. వరుసకి అక్క అయినా కూడా తన ఆకలి తీర్చడంతో అమ్మగా పిలుస్తుంటాడు. అమ్మకు రక్షణగా తీస్ మార్ ఖాన్ నిలుస్తాడు. అలాంటి అమ్మను ఒకరు హత్య చేస్తారు. ఈ హత్య చేసింది ఎవరు? మినిస్టర్ రంగరాజన్ (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్ర నేపథ్యం ఏంటి? తీస్ మార్ ఖాన్ ప్రియురాలు అనగ (పాయల్ రాజ్‌పుత్) పాత్ర ఏంటి? ఈ కథలో జీజా (అనూప్ సింగ్ ఠాకూర్), తల్వార్ (కబీర్ సింగ్) పాత్రలు ఏంటి? అసలు రౌడీ, స్టూడెంట్, పోలీస్‌గా తీస్ మార్ ఖాన్ ఎందుకు మారాల్సి వచ్చింది? చివరకు తీస్ మార్ ఖాన్ ఏం చేశాడు? అనేది కథ.
నటీనటులు
తీస్ మార్ ఖాన్ పాత్రలో ఆది సాయి కుమార్ చక్కగా నటించాడు. ఎంతో అవలీలగా తన పాత్రను పోషించాడు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్స్ ఇలా అన్నింట్లోనూ ఆది కొత్తగా, స్టైలీష్‌గా కనిపించాడు. ఇక పాయల్ అందాలను తెరపై అందరినీ ఆకట్టుకుంటాయి. పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదనిపిస్తోంది. పూర్ణ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆమె కూడా చక్కగా నటించింది. సునీల్ పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్ తన స్టైల్లో ఆకట్టుకున్నాడు. కబీర్ సింగ్, తల్వార్, హీరో ఫ్రెండ్స్ ఇలా అందరూ పర్వాలేదనిపించారు.
విశ్లేషణ
తీస్ మార్ ఖాన్ సినిమా కథ అంతా కూడా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. వరుసకి అక్క అయినా కూడా అమ్మలా చూసుకునే కుర్రాడు.. తనకు కష్టం వస్తే ప్రాణం అడ్డు పెట్టే ధైర్యం, దమ్మున్న కుర్రాడి కథ ఇది. తీస్ మార్ ఖాన్ పాయింట్ కాస్త కొత్తగానే అనిపిస్తుంది. కానీ ట్రీట్మెంట్ మాత్రం పాత పద్దతిలోనే సాగినట్టు అనిపిస్తుంది. ఓ కామెడీ సీన్, రొమాన్స్, యాక్షన్, పాట అన్నట్టుగా లెక్కలేసుకుని కథనాన్ని రాసుకున్నట్టు అనిపిస్తుంది.
కథలోని ఎమోషన్‌ను ప్రేక్షకుడు అంతగా ఫీల్ కాలేడేమో, సినిమాలో అంతగా లీనమయ్యేట్టు చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తుంది. ప్రథమార్థం మరీ బొత్తిగా బోర్ కొట్టేసినట్టు అనిపిస్తుంది. కానీ ద్వితీయార్థంలోని కొన్ని సీన్లతో సినిమా మెప్పిస్తుంది. చివర్లో వచ్చే ట్విస్టులు అందరినీ మెప్పిస్తాయి. వాటిని ముందే పసిగట్టేసినా కూడా కథనంలో చూస్తుంటే అందరూ షాక్ అవుతారు.
పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్‌తో ఆదికి మంచి ఎలివేషన్ సీన్లు పడ్డాయి. మాటలు అక్కడక్కడా పంచ్‌ల పేలుతుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా తీస్ మార్ ఖాన్.. మెప్పించేశాడు ఆది సాయి కుమార్
రేటింగ్ 2.75