Site icon A2Z ADDA

నిలవే రివ్యూ.. ఫీల్ గుడ్ స్టోరీ

సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంట‌గా న‌టించిన చిత్రం ‘నిలవే’. ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తాహెర్ సినీ టెక్‌ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అందరూ కొత్తవాళ్లే కావడంతో ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. కానీ ట్రైలర్‌ రిలీజ్‌ తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. చాలా మంది అర్జున్‌ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
అర్జున్‌(సౌమిత్ రావు) అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్‌ ఏజెన్సీలో అసిస్టెంట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమే అతిథి(శ్రేయాసి సేన్). తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పరిచయం పెంచుకొని దగ్గరకు అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను అంగీకరించలేకపోతుంది. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్‌ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్‌ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్‌, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే…
ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే.అయినప్పటికీ చక్కగా నటించారు. అర్జున్‌ పాత్రకు సౌమిత్‌ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఎమోషనల్‌ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. తెరపై బాలీవుడ్‌ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్‌ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.

ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్‌ లవ్‌స్టోరీ. ఓ మంచి ప్రేమ కథని సంగీతానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే అర్జున్‌ పాత్రను చూస్తే అర్థమవుతుంది. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్‌ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. అర్జున్‌ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై అంచనాలు లేవు కానీ థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.

సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

రేటింగ్ 2.75

Exit mobile version