Sirivennela Seetharama Sastry తెలుగు చిత్రసీమకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. మొన్న పాటకు సరితూగే ఆటలు, నృత్యాలను రూపొందించే శివ శంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. నేడు ఆ పాటలకు ప్రాణం పోసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అస్తమించారు. శివ శంకర్ మాస్టర్ చనిపోయారన్న విషాదం నుంచి కోలుకోక ముందే ఇలా మరో సారి అందరినీ ఏడిపించేసింది విధి. తెలుగు సినీ ప్రపంచంలో సిరివెన్నెలది ఆకాశమంతా చరిత్ర ఉంటుంది.
ఆది భిక్షువునేమి అడిగేది అన్నా.. మయూక తంతులపైన అంటూ ఎవ్వరికీ తెలియని కొత్త పదాలను ప్రయోగించినా.. తరిలిరాదా? తనే వసంతం అన్నా.. ఎవరైనా చూసి ఉంటారా? నడిచే నక్షత్రాన్ని.. నిగ్గదీసి అడుగు అని సమాజాన్ని నిలదీసినా.. జగమంత కుటుంబం నాది అని నిర్వేదంతో రాసినా సిరివెన్నెలకు సాటి రారెవ్వరూ. మొన్నటికి మొన్న రాసిన ఆర్ఆర్ఆర్ దోసీ.. జడవానికు భడవాగ్నికి దోస్తీ.. అంటూ ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు.
అలాంటి సిరివెన్నెల లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. న్యూమెనియాతో గత ఐదారు రోజుల నుంచి హాస్పిత్రలో చికిత్స తీసుకుంటున్న సిరివెన్నెల నేడు తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల లేరన్న వార్త విని తెలుగు చిత్ర సీమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అర్దరాత్రి ఉదయించే సూర్యుడు అంటూ త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి చెవుల్లో మార్మోగిపోతోన్నాయి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతదేహం రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారు. ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో నే సిరివెన్నెల గారి మృతదేహాన్ని ఉంచనున్నారు.
సిరివెన్నెల’ మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాం అంటూ చిరంజీవి కన్నీరు మున్నీరయ్యారు.
సిరి వెన్నెల సీతారామశాస్త్రి… నాకు అత్యంత సన్నిహితుడు… సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది… ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యాడు.
ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ శ్రీ చేంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి మరణం పట్ల సీఎం శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం తెలిపారు. సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని అన్నారు. ఆయన మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ వేశారు.
