Ranga Ranga Vaibhavanga Movie Review వైష్ణవ్ తేజ్ మూడో చిత్రం రంగ రంగ వైభవంగా. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. కొండపొలం సినిమా బోల్తా కొట్టేసింది. ఇక ఇప్పుడు లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయిన రంగ రంగ వైభవంగా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకుందో లేదో చూద్దాం.
కథ
రాముడు చంటి (నరేష్-ప్రభు)లు ప్రాణ స్నేహితులు. వారి కుటుంబాలు కూడా అంతే స్నేహంగా ఉంటాయి. చిన్నప్పుడే రిషి (వైష్ణవ్ తేజ్), రాధ(కేతిక శర్మ)లు అన్నప్రాసన రోజు ఒకరి చేతిని ఒకరు పట్టుకుంటారు. అలాంటి వారు స్కూల్ ఏజ్‌లో ఓ చిన్న గొడవతో మాట్లాడుకోకుండా అయిపోతారు. అయితే వారు ఎలా మళ్లీ కలిశారు? వారికి అర్జున్ (నవీన్ చంద్ర) వల్ల కలిగిన సమస్యలు ఏంటి? ఈ కథలో రానా (సుబ్బరాజు) పాత్ర ఏంటి? చివరకు రాధ, రిషిలు ఫ్యామిలీ కోసం ఏం చేశారు? అన్నదే కథ.
నటీనటులు
రిషి కారెక్టర్‌లో వైష్ణవ్ తేజ్ ఎంతో సులభంగా నటించేశాడు. పైగా ఎక్కువగా ఈజ్‌తో నటించేశాడు. ఎక్స్ ప్రెషన్స్ అదరగొట్టేశాడు. చిరు, పవన్ పోలికలు అక్కడక్కడా కనిపిస్తాయి. వారిని ఇమిటేట్ చేస్తూ చేసినట్టు అనిపిస్తుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్నింట్లోనూ అదరగొట్టేశాడు. కేతిక శర్మ అందంగా కనిపించింది. ఈ ఇద్దరి జోడి బాగుంది. నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, ప్రగతి, తులసి, సుబ్బరాజు ఇలా అందరూ చక్కగా నటించేశారు.
నిన్నేపెళ్లాడుతా, నువ్వే కావాలి ఫార్మూలా మీద ఎన్ని చిత్రాలు వచ్చాయో లెక్క పెట్టలేం. పక్కింట్లోనే ఉండటం, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్నతనం నుంచి స్నేహం, ప్రేమ ఇవన్నీ మంచి కాన్సెప్ట్‌లే. కానీ వాటిని కనెక్ట్ చేసే ఎమోషన్ సరిగ్గా ఉండాలి. అది లేకపోతే సాదా సీదా సినిమాగా మిగిలింది. ఇలాంటి కథతో వచ్చినప్పుడు కథనం ఎంతో ఎమోషనల్‌గా, గ్రిప్పింగ్‌గా ఆకట్టుకునేలా ఉండాలి.
కానీ రంగ రంగ వైభవంగా సినిమాలో అవేమీ ఉండవు. దారుణాతి దారుణమైన సీన్లు ఉంటాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందో ఇట్టే కనిపెడుతుంటారు ప్రేక్షకులు. ఎంతో ఎమోషనల్‌గా సాగే సీన్లు సైతం.. నవ్వుల పాలవుతుంటాయి. తెరపై నటీనటులు ఏడుస్తుంటే.. సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు సెటైర్లు, నవ్వులతో సందడి చేస్తుంటారు. అంటే కథ, కథనం ఎంత పేలవంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రథమార్థాన్ని ఓ మోస్తరుగా పర్వాలేదన్నట్టుగా తెరకెక్కించారు. ఇక ద్వితీయార్థం అయితే సహనానికి పరీక్షలా ఉంటుంది. అరుకు ఎపిసోడ్స్ ఏ మాత్రం రక్తికట్టలేదు. ఇక సత్య కామెడీ, పాటలు పాడే సీన్ కాస్త ఓవర్ అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే మరింతగా నవ్వుతెప్పిస్తుంది. అవుట్ డేటెడ్ సీన్లతో విసిగించేశారు. ఓ నాలుగు మంచి మాటలు చెబితే మారిపోవడం అనేది అరిగిపోయిన క్లైమాక్స్.
పాటలు అంత గొప్పగా ఏమీ అనిపించవు. మాటలు అయితే గుర్తు పెట్టుకునేంత అద్భుతంగా ఉండవు. ఫోటో గ్రఫీ బాగుంది. ఎడిటర్ చాలానే పని మిగిల్చినట్టు అనిపిస్తుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి.
బాటమ్ లైన్ : రంగ రంగ వైభవంగా.. ఘోరాతి ఘోరంగా.. దారుణంగా
రేటింగ్ 2