Site icon A2Z ADDA

RRR Movie Review : RRR మూవీ రివ్యూ.. ఇద్దరూ ఇద్దరే

RRR Movie Review : RRR మూవీ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెగా, నందమూరి అభిమానులు ఎంతలా ఎదురుచూస్తోన్నారో అందరికీ తెలిసిందే. పలువాయిదాల అనంతరం మొత్తానికి నేడు (మార్చి 25) ఈ చిత్రం విడుదలైంది. ఇక కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఏ మేరకు మెప్పించారో ఓ సారి చూద్దాం.

కథ
గూడెంలో ఓ బిడ్డ(మల్లి)ని తెల్లదొర(స్కాట్) తీసుకొస్తే.. తనను వెనక్కి తీసుకొచ్చేందుకు కోసం కొమురం భీం (ఎన్టీఆర్) తన ప్రయాణాన్ని ఢిల్లీ దిశగా సాగిస్తాడు. ఇక తనకంటూ ఓ నిర్దిష్ట లక్ష్యాన్ని పెట్టుకుని బ్రిటీష్ సైన్యంలో అత్యున్నత పోలీస్ అధికారిగా ఎదిగేందుకు క్రూరమైన ఆఫీసర్‌గా రామరాజు (రామ్ చరణ్) ఢిల్లీలో విధులు నిర్వహిస్తుంటాడు. ఇక భీం తమ కోసం వచ్చాడని బ్రిటీష్ సైన్యానికి సమాచారం వస్తుంది. భీంను పట్టుకుంటే స్పెషల్ ఆఫీసర్‌గా ప్రమోషన్ ఇస్తామని ప్రకటిస్తారు. దీంతో రామరాజు ముందుకు వస్తాడు. భీంను పట్టుకునే పనిలో పడతాడు. ఆ తరువాత ఏమైంది? భీంను పట్టుకునే క్రమంలో రామరాజుకు ఎదురైన పరిస్థితులేంటి? మల్లిని భీం కలుస్తాడా? భీం రామరాజు స్నేహం ఎలా మొదలైంది? అసలు చివరకు వీరిద్దరూ కలిసి ఏం చేశారు? అనేది కథ.

ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది.. చూడాల్సింది ఇద్దరినే. గుర్తుండేది కూడా ఆ ఇద్దరే. అయితే ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా గుర్తుంటారు? అనే ప్రశ్న రావడమూ తప్పే. అలా అనుకోవడమూ తప్పే. ఒకరు నిప్పు. మరొకరు నీరు. ఇందులో ఎవరు గొప్పా? అనే ప్రశ్నే ఉత్పన్నం కాకూడదు. అయితే ఫ్యాన్స్ లెక్కలు వేరే ఉండొచ్చు. అలా అభిమానులను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి కూడా బేరీజు వేసుకున్నట్టున్నాడు.

అందుకే ఒకరిని ఎత్తులో పెట్టేశాడు అని అనుకునేలోపు ఇంకొకరిని అమాంతం పైకి లేపేశాడు. అలా మొత్తానికి రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతమైన మాయజాలంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఒదిగిపోయారు. అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తూ, కళ్లల్లోనే భావాన్ని పలికించి రామ్ చరణ్ చేత అద్భుతమైన నటనను, ఎమోషన్స్‌ను పలికించాడు.

ఇక ఎన్టీఆర్ పాత్ర అమాయకత్వానికి మారుగా, మంచు పర్వతంలాంటి మంచి మనసున్నవాడిలా చూపించాడు. గరళాన్ని కంఠంలో దాచుకున్న శివుడిలా రామ్ చరణ్ పాత్ర ఉంటే.. కొండలను అయినా పిండిచేయగల సమర్థుడు, బలవంతుడిలా ఎన్టీఆర్ కనిపించాడు. నటించేందుకు మాత్రం రామ్ చరణ్‌కే కాస్త ఎక్కువ స్కోప్ దక్కింది.

రామ్ చరణ్ పోషించిన పాత్రలోనే ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. తనతో తనకే శత్రుత్వం, చేరుకునే గమ్యంలో ముళ్లబాటలు, బయటకు కనిపించేది ఒకటి.. లోపల జరిగేది ఇంకొకటి అన్నట్టుగా రామ్ చరణ్ తన కళ్లతోనే నటించాడు. ఇక ఎన్టీఆర్ పాత్ర అయితే ఎక్కడా కూడా తగ్గినట్టు అనిపించదు. ఉరికంభం సీన్‌లో అయితే కొమురం భీముడో అని ఎన్టీఆర్ పాట పాడుతుంటే.. ప్రతీ ఒక్కరి రక్తం ఉరకలెత్తుతుంది.

ఈ సినిమాకు ప్రాణంలా నిలిచే మూడు ఘట్టాలున్నాయి. రాం-భీం ఇంట్రో సీన్లు, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఇలా మూడు పార్టులుగా ఈ సినిమా పీక్స్‌కు వెళ్తుంది. పులితో ఎన్టీఆర్ పోరాడే దృశ్యాలు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటాయి. రెండు వేల మంది గుంపుతో పోరాడే సీన్లలో రామ్ చరణ్ ఎంట్రీ నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది.

అదే ఇంటర్వెల్ సీన్‌లో అయితే ఎన్టీఆర్ ఎంట్రీని ఇది వరకు ఇండియన్ స్క్రీన్‌లో ఎప్పుడూ చూసి ఉండరు. ఇకపై మళ్లీ అలాంటి ఎంట్రీ రాబోదేమో. ఇంటర్వెల్ సీన్‌లో రామ్ చరణ్ ఎంట్రీ సైతం అబ్బురపరుస్తుంది. ఇద్దరూ కలియబడే సీన్లలో అయితే అందరూ కంటతడి పెట్టాల్సిందే. ఇద్దరు హీరోలు అలా కొట్టేసుకుంటే.. అభిమానులే కాదు సగటు ప్రేక్షకుడి గుండె సైతం బరువెక్కేలా ఉంది. అక్కడి ఎమోషన్‌ను కూడా రాజమౌళి చక్కగా ఒదిగేలా చేశాడు. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది.

క్లైమాక్స్ మాత్రం పూర్తిగా రామ్ చరణ్ వశమైనట్టు అనిపిస్తుంది. అల్లూరి గెటప్‌లో రామ్ చరణ్ అందరినీ మాయచేసేశాడు. ఒకవేళ రాముడి పాత్రను పోషించాలంటే అది రామ్ చరణ్ మాత్రమే అనేలా కనిపిస్తాడు. రామ్ చరణ్‌ను క్లైమాక్స్‌లో రాజమౌళి అద్భుతంగా చూపించాడు. అద్భుతం అనే పదం కూడా చిన్నది అవుతుందేమో.

రామ్  చరణ్, ఎన్టీఆర్ తప్పా మిగిలిన వారెవ్వరూ కూడా అంతగా గుర్తుండరు. అలియా కనిపించిన నాలుగైదు సీన్లలో మెప్పిస్తుంది. ఒలివియా సైతం అంతే. శ్రియా, అజయ్ దేవగణ్, సముద్రఖని ఇలా అందరి పాత్రలు పరిమితమే.

కథ కల్పితమని ముందే చెప్పేశాడు రాజమౌళి. అలా జరిగిందా? ఇదంతా ఎక్కడిది? అనే అనుమానాలను పక్కన పెట్టాల్సిందే. తాను అనుకున్న కథను తెరపైకి ఎలా తెచ్చాడు? ఎంత అందంగా మలిచాడు? విజువల్ వండర్‌గా ఎలా తీర్చిదిద్దాడు అనేది మాత్రం చూస్తే సినిమా అందరికీ నచ్చుతుంది. మాస్‌కు కావాల్సిన స్టఫ్, హీరోను ఎలివేట్ చేసే విధానం, చూపించే తీరు కచ్చితంగా రాజమౌళి దగ్గర అందరూ నేర్చుకోవాల్సిందే. ఇలాాంటి ఎలివేషన్‌లు మళ్లీ మళ్లీ వస్తాయో లేదో చెప్పలేం. కానీ కొన్ని సీన్లు మాత్రం రాజమౌళి ప్రతిభకు, పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి.

ఇక సాంకేతికంగా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కీరవాణి సంగీతం, నేపథ్య సంగీతం సినిమా ప్రాణం. సెంథిల్ కెమెరాపనితనం ఆయువుపట్టు. ఇక సాబు సిరిల్ వేసిన ఆర్ట్స్, సెట్స్ అన్నీ కూడా ఆ కాలానికి తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇక సాయి మాధవ్ బుర్రా రాసిన కొన్ని డైలాగ్స్ అందరినీ వెంటాడుతాయి. సీత కనిపించిందా? అని రామ్ చరణ్ అంటే.. కళ్లు తెరిపించింది అంటూ ఎన్టీఆర్ పలికే సంభాషణ మనసును తాకుతుంది. అలా ప్రతీ ఒక్క విభాగంగా తమ పనితనంలో బెస్ట్ ఇచ్చేసింది. ఈ సినిమా ఫ్యాన్స్, తెలుగు వాళ్లకు కన్నులపండువగానే ఉంటుంది. సినిమా నిడివి కాస్త ఎక్కువైనట్టు, సెకండాఫ్ కాస్త స్లోగా ఉన్ట్నట్టు సాధారణ ప్రేక్షకులకు అనిపించొచ్చు. కానీ మెగా, నందమూరి అభిమానులకు మాత్రం ఎక్కడా బోర్ కొట్టదు.

రేటింగ్ : 4.5

చివరగా : RRR.. జక్కన్న మరో అద్భుత సృష్టి

Exit mobile version