Site icon A2Z ADDA

గేదెల రాజు మూవీ రివ్యూ.. డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే చిత్రం

రఘు కుంచె కీలక పాత్రలో నటిస్తూ సంగీతం సమకూర్చిన తాజా చిత్రం ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్రావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి ఇతర పాత్రలు పోషించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించిన ఈ మూవీ నేడు(ఏప్రిల్‌ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ
కాకినాడకు చెందిన రౌడీ షీటర్‌ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్‌ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్‌ అయ్యంగార్‌) కూడా టికెట్‌ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు.

ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్‌ (వికాస్‌)-మీరా(మౌనిక), విజయ్‌ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..
గేదెల రాజు పాత్రకు రఘు కుంచె న్యాయం చేశాడు. ఒక రౌడీ షీటర్ మాట తీరు ఎలా ఉంటుందో, ఎలా కోపంగా చూస్తాడో తెరపై రఘు కుంచె అలానే నటించాడు. గోదావరి యాసను కూడా బాగా మ్యానేజ్‌ చేశాడు. శివయ్యగా రవి ఆనంద్‌ బాగా నటించాడు. రిచ్‌గా వికాస్‌, విజయ్‌గా రామచంద్రంతో పాటు టీనా శ్రావ్య, మౌనికలు కూడా తమదైన నటనతో ఆకట్టుకున్నారు.

ఎలా ఉందంటే..
నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ స్టోరీ ఇది. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు అని ఈ సినిమాకు క్యాప్షన్‌ పెట్టారు. అలా ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. హత్య చేసిందెవరు అనేది సినిమా చూసే ప్రేక్షకులు చివరి వరకు కనిపెట్టకుండా ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు చైతన్య మోటూరి.

గేదెల రాజు మర్డర్‌ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత దుర్గ పాత్ర ఎంట్రీ.. కార్పోరేటర్‌ బరిలో ఇద్దరూ ఉండడంతో ఈ హత్య అతనే చేయించాడేమో అనుకునేలోపు అతనికి సంబంధం చూపించారు. ఆ తర్వాత రిచ్‌ పాత్ర ఎంట్రీ..అతని నేపథ్యం.. మీరాతో ప్రేమాయణం చూపిస్తూనే మరోవైపు విజయ్‌-సత్యల ప్రేమకథను నడిపించారు.

గేదెల రాజు హత్యకు ఈ జంటలకు ఏదో సంబంధం ఉంటుందని అనుకునేలోపు.. డెక్క, శివయ్య పాత్రలను పరిచయం చేసి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశారు. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ సీన్‌ ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చివరిలో వచ్చే ట్విస్ట్‌ మాత్రం ఎవరూ ఊహించరు. మహాభారతంలోని కనిక నీతి కథకు ఈ కథను ముడిపెట్టిన తీరు బాగుంది.

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. రఘు కుంచె నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ 3

Exit mobile version