Salaar Movie Review: సలార్ మీద ఎన్నో అనుమానాలు.. ఎంతో మంది నమ్మకాలున్నాయి. ఉగ్రం కథనే అటూ ఇటూ మార్చి తీస్తున్నాడు.. కొత్త పాయింటేమీ కాదని కొందరు.. కేజీయఫ్ సీరిస్ తరువాత ప్రశాంత్ నీల్ ఓ మూవీని, ఓ కథను మళ్లీ తెరకెక్కిస్తున్నాడంటూ అందరిలోనూ సహజంగానే ఉండే అంచనాలు. అది కూడా ప్రభాస్ వంటి స్టార్‌తో మూవీ అంటే అంచనాలు ఆకాశన్నంటుతాయి. ప్రభాస్ తరువాత సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వంటివి డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చలేకపోయాయి. మరి అన్నింటిని దాటుకుని సలార్ అందరినీ ఆకట్టుకుందా? లేదా? అన్నది చూద్దాం.
కథ:
అసోం ప్రాంతంలోని బొగ్గు గనుల్లో తన అమ్మ (ఈశ్వరీ)తో కలిసి దేవా (ప్రభాస్) ప్రశాంతంగా జీవిస్తుంటాడు. గొడవల జోలికి అస్సలు వెళ్లడు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాడు. అలాంటి దేవా ఓ సారి ఆరాధ్య (శ్రుతి హాసన్)ను కాపాడాల్సి వస్తుంది. ఆరాధ్య మూలాన మళ్లీ గొడవలకు వెళ్తాడు దేవా. అయితే ఖాన్సార్ ముద్ర పడిన తరువాత కూడా ఆరాధ్యను కాపాడటం, ఆ ముద్ర ఉన్న ట్రక్కులను దేవా అడ్డుకోవడంతో చిచ్చు మొదలవుతుంది. అసలు ఆ ముద్ర ఏంటి? ఖాన్సార్‌తో దేవాకు ఉన్న సంబంధం ఏంటి? నిబంధనను ఉల్లంఘించాడంటూ దేవాను చంపాల్సిందే అని ఖాన్సార్ రాజు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎందుకు అంటాడు? అసలు ఖాన్సార్ సింహాసనం. మీద వరదను కూర్చోబెట్టింది ఎవరు? అసలు ఆ సింహాసనానికి అసలు సిసలు అర్హత కలిగిన వ్యక్తి ఎవరు? అసలు ఈ ఖాన్సార్ కథ ఏంటి? అన్నది తెలియాలంటే సలార్ సీజ్ ఫైర్ చూడాల్సిందే.
ఉగ్రంలోని మెయిన్ పాయింట్‌ను ప్రశాంత్ నీల్ తీసుకున్నాడు. తన మొదటి సినిమా, మొదటి కథ కావడంతో దాని మీద ప్రేమను ఇంకా చంపుకోలేకపోయాడేమో. అందుకే ఆ టైంలో తన మొదటి ప్రాజెక్ట్ కావడంతో అనుకున్నంత బడ్జెట్ కూడా లేదేమో. ఉగ్రం కథను అప్పటికి తన స్థాయిలో తీసేశాడు. కానీ కేజీయఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. అందుకే మళ్లీ తనకు ఇష్టమైన ఆ కథకు గ్రాండియర్‌ను అద్దాడు. ఉగ్రం కథను కేజీయఫ్ స్టైల్లో తీస్తే అదే సలార్ అవుతుంది.
కేజీయఫ్‌లో గోల్డ్ మైన్స్ అనే ఓ ప్రపంచాన్ని సృష్టించాడు. ఇక ఇక్కడ ఖాన్సార్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఈ దేశంతో పని లేకుండా నడిచే ఓ ప్రాంతమే ఖాన్సార్. కానీ ఆ ఖాన్సార్ ప్రాంతమే దేశాన్ని శాసిస్తుందని చూపించాడు. దేశంలో జరిగే ఏ బిజినెస్, ఏ క్రైమ్ అయినా కూడా ఖాన్సార్ కనుసన్నలోనే జరుగుతుందని తెరపై చూపించాడు ప్రశాంత్ నీల్. ఇక ప్రశాంత్ నీల్ మేకింగ్, స్టైల్ ఆఫ్ కట్స్, యాక్షన్ మేకింగ్ అన్నీ కూడా తెలిసిందే.
కేజీయఫ్‌ను చూసి ఎక్కడెక్కడ ఆడియెన్స్ థ్రిల్ అయ్యారో ప్రశాంత్ నీల్ బాగా నోట్ చేసుకున్నట్టుగా ఉన్నాడు. అలాంటి హై ఇచ్చే మూమెంట్స్‌ను సలార్‌లో కావాల్సినన్ని జొప్పించాడు. ఇంకెప్పుడు మన హీరో పిడికిలి బిగిస్తాడు.. రౌడీలను ఏరి పారేస్తాడు అని ప్రేక్షకుడు పంటి బిగువన పట్టుకుని చూస్తారు. ఇక పాతాళంలో దాగి ఉన్న అగ్ని పర్వతం ఒక్కసారిగా బద్దలైనట్టుగా ఇంటర్వెల్ సీన్ కనిపిస్తుంది.
అయితే అంత వరకు కాస్త చప్పగా, స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. ఇదేంట్రా మాకు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రభాస్ యాక్షన్‌లోకి దిగిన తరువాత కథ వేగం పుంజుకుంటుంది. యాక్షన్ ఎపిసోడ్‌కు కనెక్ట్ అయ్యే ప్రేక్షకులు ఎమోషనల్ సీన్లకు మాత్రం అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. పూర్తి కథ, ఎమోషన్స్ తెలియకపోవడం వల్లే ఆ ఫీలింగ్ వస్తుందేమో. రెండో పార్టులో ఎమోషనల్ పాళ్లు ఎక్కువగా ఉంటాయేమో చూడాలి.
ఇంటర్వెల్ చూసిన తరువాత సెకండాఫ్‌ను మరింత హైలో ఊహిస్తారు ప్రేక్షకులు. కానీ ద్వితీయార్దం ప్రారంభం కూడా చప్పగానే సాగుతుంది. ప్రభాస్ మళ్లీ కత్తి, గొడ్డలి పట్టి రంగంలోకి దిగి ఊచ కోత కోసే వరకు అదే నీరసం ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ ఎపిసోడ్ మొదలయ్యాక ఇక ర్యాంపేజ్ అన్నట్టుగా తీసుకెళ్లాడు ప్రశాంత్ నీల్. క్లైమాక్స్ అయితే రక్తంతో ఖాన్సార్ కాకుండా సిల్వర్ స్క్రీన్ ఎరుపెక్కినట్టుగా అనిపిస్తుంది. రెండో పార్ట్ కోసం వదిలిన లీడ్స్ చూస్తే ఆ సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూడకమానరు.
టెక్నికల్‌గా కొత్తగా ఏమీ అనిపించదు. కేజీయఫ్ తరహాలోనే సాగుతుంది. రవి బస్రూర్ ఆర్ఆర్, భువన గౌడ కెమెరా పనితనం, ప్రశాంత్ నీల్ సినిమా ఎడిటింగ్ స్టైల్ అందరికీ తెలిసిందే. అన్నీ కూడా కలిసి సలార్‌ను ప్రభాస్ కమ్ బ్యాక్‌లా, డార్లింగ్ అభిమానుల ఆకలి తీర్చే చిత్రంగా బయటకు వచ్చింది.
సలార్ సీజ్ ఫైర్‌లో ప్రభాస్ నటన కన్నా.. యాక్షన్ ఎపిసోడ్స్‌కే ఎక్కువ మార్కులు పడతాయి. ఆ కటౌట్‌ను ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లో గూస్ బంప్స్ తెప్పిస్తాయి. పృథ్వీరాజ్ సుకుమార్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ దుమ్ములేపేశాడు. శ్రుృతి హాసన్ ఆటలో అరటిపండు టైపు. జగపతి బాబు, ఈశ్వరీ రావు, బ్రహ్మాజీ, బాబీ సింహా, గరుడ ఇలా చాలా మంది చాలా పాత్రలను పోషించారు. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉంది. రకరకాల పేర్లు, రకరకాల ప్రాంతాలను ఖాన్సార్‌లో చూపించిన ప్రశాంత్ నీల్.. అన్నింటికి తగిన ప్రాధాన్యం ఇచ్చాడు.
బాటమ్ లైన్.. రాజమౌళి తరువాత ప్రభాస్‌ను వాడుకోవడం తెలిసిన దర్శకుడే ప్రశాంత్ నీల్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. సలార్ ఇక రికార్డులన్నీ పరార్.
రేటింగ్ 3.5/5