నందమూరి నటసింహం బాలయ్య ఆహా షో కోసం చేస్తోన్న అన్ స్టాపబుల్ షో గురించి అందరికీ తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ షో దీపావళి సందర్భంగా ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో మొదటి గెస్టుగా మంచు ఫ్యామిలీ వచ్చింది. మోహన్ బాబుతో చేసిన ఈ మొదటి ఎపిసోడ్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో ఎన్నో రకాల వివాదాలకు సమాధానం దొరికేలా ఉంది. ఎన్నెన్నో రహస్యాల గురించి ఇరువురు ప్రశ్నలు సంధించారు.
చిరంజీవి గారి మీదున్న నిజమైన అభిప్రాయం ఏంటి? అని మోహన్ బాబును బాలయ్య ఇరుకున పెట్టేశారు. పై వాడికి తెలుసు అంటూ ఏదో డిప్లమెటిక్‌గా ఆన్సర్ చెబుతున్న మోహన్ బాబుపై బాలయ్య కౌంటర్లు వేశాడు. పొలిటికల్ డిప్లమెటిక్‌గా ఆన్సర్ చెప్పొద్దు అని అంటే.. కొట్టి కొట్టి మరీ చెబుతాను అన్నాడు. అయితే ఏం చెప్పాడన్నది మాత్రం ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది. ఇక కొన్నేళ్లుగా తెలుగు ప్రజల గుండెల్లో నానుతున్న ప్రశ్నను మోహన్ బాబు సంధించాడు.
అన్న గారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆయన తదనంతరం మీరు పగ్గాలు చేపట్టకుండా.. ఆయనకు ఎందుకు ఇచ్చారు? అంటూ బాలయ్యను నేరుగా నిలదీశాడు మోహన్ బాబు. దానికి బాలయ్య ఏం సమాధానం చెబుతాడో చూడాలి. మీరు ఆయన స్థాపించిన పార్టీని వదిలి.. వేరే పార్టీకి ఎందుకు వెళ్లారు? అంటూ బాలయ్య కూడా మోహన్ బాబును అడిగేశాడు. మధ్యలో ఒకడు పుల్లలు పెట్టేవాడు ఉన్నాడు అంటూ మోహన్ బాబు చెప్పేశాడు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉన్న కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు బయటకు వచ్చేలా ఉన్నాయి.