Site icon A2Z ADDA

వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ : నాగార్జున

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న సందర్భంగా మంగళవారం నాడు రాజమండ్రిలో బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో

నాగార్జున మాట్లాడుతూ.. ‘ప్రపంచమంతా భయపడింది. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేస్తే చూస్తారా? అని అనుకున్నారు. నార్త్ ఇండియాలో సినిమాలను ఆపేశారు. కానీ మన తెలుగు సినీ ప్రేమికులు మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయమని అన్నారు. వారంతా కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. వారికి నా పాదాభివందనాలు. నా మీదున్న నమ్మకంతోనే సినిమా ఇంత హిట్ అయిందని నా యూనిట్ అంటుంది. కానీ నాకు తెలుగు ప్రేక్షకుల మీదున్న నమ్మకం. సినిమా అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే సినిమా అని మరోసారి రుజువు చేశారు. రాజమండ్రిలో సినిమా ఇంకా హౌస్ ఫుల్‌లో ఆడుతోందని విన్నాను. అన్ని థియేటర్లో ఇంకా హౌస్ ఫుల్ ఉందని విన్నాను. నేను కలెక్షన్ల గురించి మాట్లాడేందుకు రాలేదు. మీ ప్రేమ ముందు కలెక్షన్స్ నథింగ్. ఇదంతా చూసినప్పుడల్లా మాకు అక్కినేని నాగేశ్వరరావు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనిపిస్తోంది. మిమ్మల్ని, మీ ప్రేమంతా ఆయన చూపించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మొన్న నా మిత్రులు చిరంజీవి గారితో మాట్లాడాను. వైఎస్ జగన్ గారిని కలిసొచ్చారు.. ఏం మాట్లాడారు అని అడిగాను. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని వైఎస్ జగన్ గారు చెప్పారు అని చిరంజీవి గారు అన్నారు. వైఎస్ జగన్ గారికి కూడా థ్యాంక్స్. బంగార్రాజు అచ్చమైన తెలుగు సినిమా. మా పంచెకట్టుతో, మన సంబరాలు, మప సరసాలతో అచ్చమైన తెలుగు సినిమా. బంగార్రాజు మేం కాదు. మా నాన్న గారు. ఇక్కడే ఎక్కడో ఆయన ఉండి చూస్తుంటారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు రెండు కళ్లు అని అంటారు. నేడు ఎన్టీఆర్ గారి వర్దంతి. ఆయన్ని మనం ఎప్పుడూ తలుచుకోవాలి. ఎన్టీఆర్ లివ్స్ ఆన్. ఏఎన్నార్ లివ్స్ ఆన్’ అని అన్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘మా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. కెరీర్ బెస్ట్ కలెక్షన్లు ఇవ్వబోతోన్నారు. ఇది జీవితంలో ఎప్పటికీ మరిచిపోను. ఈ పాత్ర ఎలా ఉంటుందో అని సినిమా ప్రారంభంలో భయపడ్డాను. కానీ కళ్యాణ్ కృష్ణ దగ్గరుండి నాతో చేయించాడు. రారండోయ్ వేడుకచూద్దాం సినిమాతో ప్రేక్షకులకు దగ్గర చేశాడు. ఈ సినిమాతో మరింత దగ్గరయ్యేలా చేశాడు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మీరంతా కూడా బంగారం లాంటి టీం. కృతి శెట్టి హ్యాట్రిక్ కొట్టేసింది. రమ్యకృష్ణ గారు, రావు రమేష్, దక్ష, ఝాన్సీ ఇలా అందరికీ థ్యాంక్స్. మంచి సినిమాతో ఎలా ఉంటుందో నాకు తెలుసు. కమర్షియల్ బ్లాక్ బస్టర్‌తో వస్తే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. వాసివాడి తస్సాదియ్యా’ అని అన్నారు.

మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘రాజమండ్రిలో ఈ రోజు నిర్వహిస్తున్న బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను చూస్తుంటే సంతోషంగా ఉంది. సంక్రాంతికి అసలైన కలర్ యాడ్ చేసిన నాగార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత రెండేళ్లు కరోనా వల్ల జనాలు బయటకు రావడం లేదు. ఈ సినిమా వల్ల అందరూ బయటకు వచ్చారు. నిజంగా సంతోషంగా ఉంది. ఇంకా మంచి చిత్రాలు వస్తాయని నమ్ముతున్నాను. నన్ను ఇక్కడకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు’ అని అన్నారు.

ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘నేను అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానిని. ఆయన చిరునవ్వు, ఆయన ఆశీస్సుల వల్లే ఈ సినిమా హిట్ అయింది. అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మ.. నాగార్జున, నాగ చైతన్యలోకి వచ్చింది. అందుకే ఈ సినిమా హిట్ అయింది. 2022లో సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టి ఆడిస్తున్న ప్రేక్షకులదే ఈ విజయం వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అని అన్నారు.

మంత్రి మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘బంగార్రాజు సక్సెస్ మీట్‌ను మన రాజమండ్రిలో ఏర్పాటు చేసినందుకు టీం అందరికీ థ్యాంక్స్. మన మార్గాని ఎస్టేట్‌లో ఏ ఫంక్షన్ చేసినా కూడా సినిమా హిట్ అవుతుంది. అది బంగార్రాజు సినిమాతో మరోసారి నిరూపితమైంది. నేను చిన్నప్పటి నుంచి నాగార్జున గారి సినిమాలు చూసి ఆ స్టైల్‌ను ఫాలో అయ్యేవాడిని. నాగార్జున గారిని కలవడం ఇదే మొదటి సారి. నాగ చైతన్యను ఇది వరకే కలిశాను. ఈ సినిమాను ఇంకా చూడలేదు. చూశాక మా మంత్రి కన్నబాబు గారి సోదరుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బాగా చేశారని అనుకుంటున్నాను. కృతిశెట్టిని ఉప్పెన సినిమాకు ఇక్కడే కలిశాం. ఈ సినిమా మరింతగా హిట్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘గోదావరి ఎక్కడ పుట్టిందో.. ఎక్కడ కలుస్తుందో తెలీదు. కానీ గోదావరి అంటే రాజమండ్రి గుర్తుకు వస్తుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇక్కడే నిర్వహిద్దామని నాగ్ సర్ అన్నారు. ఈ సక్సెస్ మీట్‌ను ఇక్కడ పెడదామని అన్నారు. ఆయనకు రాజమండ్రి అంటే అంత ఇష్టం. కృతి శెట్టి చాలా మంచి వ్యక్తి. ఆమెతో పని చేసేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. చై నిజంగానే బంగారం. ఈ మాట ఎన్ని సార్లైనా చెబుతాను. ఈ సినిమాతో ఎక్కువగా ట్రావెల్ అయ్యాను. తమ్ముడు లాంటి ఫ్రెండ్ దొరికాడు అని అనుకుంటున్నాను. ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ‘సినిమాను పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో నాకు అవకాశం ఇచ్చిన నాగార్జున గారు, నాగ చైతన్య గారు, నా ఫ్రెండ్ కళ్యాణ్ కృష్ణకు థ్యాంక్స్’ అని అన్నారు.

కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘బంగార్రాజు అంటేనే నాగార్జున గారు, నాగ చైతన్య గారు అనిపిస్తారు. నిజ జీవితంలో వారు బంగారాలే. వారితో కలిసి నటించడం నాకు ఆనందంగా ఉంది. కథ విన్నప్పుడే నాకు ఈ పాత్రను ఎంజాయ్ చేశాను. నేను మంచి సర్పంచ్‌ని కాబట్టి దర్శకుడికే క్రెడిట్ ఇస్తాను. కళ్యాణ్ కృష్ణ గారు మామూలు మంచి డైరెక్టర్ కాదు..చాలా మంచి డైరెక్టర్. రమ్యకృష్ణ గారు అద్బుతమైన నటి. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.

Exit mobile version