Site icon A2Z ADDA

ఇండస్ట్రీకి పెద్దగా ఎవ్వరూ అవసరం లేదు!.. దర్శకేంద్రుడు సంచలన కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. మా ఎన్నికలతో చిత్ర పరిశ్రమ అల్లకల్లోలంగా మారింది. ఎప్పుడూ లేనంతగా విబేధాలు బయటకు వచ్చాయి. మెగా ఫ్యామిలీ, మంచు కుటుంబం మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మంచు మెగా ఫ్యామిలీ మధ్య వైరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. మా ఎన్నికల నేపథ్యంలో అది ఇంకా బహిర్గతమైంది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య పోటీలా కాకుండా మంచు వర్సెస్ మెగా ఫ్యామిలీలా ఈ ఎన్నికలు జరిగాయి.

ఆ ఎన్నికల్లో చివరకు మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. కానీ వివాదాలు మాత్రం సద్దుమణగడం లేదు. రోజురోజుకూ గ్యాప్ పెరుగుతోంది. రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోంది. నరేష్ వేసిన మంటలు ఇంకా చల్లారడం లేదు. మోహన్ బాబును ఇండస్ట్రీ పెద్దగా ఉండమని కోరడం, ఆయన సున్నితంగా తిరస్కరించడంతో అసలు కథ మొదలైంది. మా ఎన్నికల నుంచి ఇండస్ట్రీ పెద్ద ఎవరు? అనే వరకు వ్యవహారాన్ని నరేష్ పట్టుకెళ్లాడు.

దీంతో ఇండస్ట్రీ పెద్ద ఎవరనే చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే చిరంజీవి అన్ని విషయాల్లో ముందుండి పెద్దన్న పాత్రను పోషిస్తున్నాడు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. అలాంటి చిరంజీవిని పక్కన పెట్టేయాలని మంచు ఫ్యామిలీ భావిస్తోన్నట్టు కనిపిస్తోంది. అందుకే మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా మెగా ఫ్యామిలీకి ఆహ్వానాన్ని పంపలేదు.

అయితే తాజాగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు ఇండస్ట్రీ పెద్ద అనే అంశం మీద నోరు విప్పాడు. అసలు ఇండస్ట్రీకి పెద్ద అనే వారు ఉండరు. అది అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లోని పిల్లలే మన మాటలు వినరు. ఇండస్ట్రీలో ఇంత మంది ఎలా వింటారు. ఎవరికి తోచింది వారు చేస్తారు. అయినా నేను ఎవ్వరికీ ఉచిత సలహాలు ఇవ్వాలని అనుకోను. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటూ ఉంటూ.. ఎవ్వరితోనూ శత్రుత్వాన్ని పెంచుకోను అని అన్నాడు.

Exit mobile version