ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ ఇప్పుడు రెండు కోట్ల పెనాల్టీ చుట్టే తిరుగుతోంది. గడువులోగా ఆ పెనాల్టీని కట్టి తన భర్తను కాపాడుకోవాలని తులసి ప్రయత్నిస్తోంది. అలా తులసి అన్నంత పని చేసి మంచి పేరు ఎక్కడ కొట్టేస్తుందో అని లాస్య తెగ కంగారు పడుతోంది. అందుకే వీలైనంత చెడగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. చిన్న సందు దొరికితే చాలా నందు, తులసి మధ్య మరింత గొడవ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అలా ఆఫీస్‌లో ఎంప్లాయిస్ అన్న మాటలకు తులసి మీద నందు భగ్గుమంటే.. ఆదూరాన్ని ఇంకా పెంచాలని చూసింది. అలా మొత్తానికి సోమవారం నాడు అంటే ఎపిసోడ్ నంబర్ 465లో ఏం జరిగిందంటే..
కూతరు ఫీజ్‌ను తులసి అరేంజ్ చేస్తుంది. నా కూతురు నాలా కష్టపడకూడదు.. నా భవిష్యత్తువి నువ్.. నేను సాధించలేనివి నువ్ సాధించాలి.. ఇంకెప్పుడూ నా నుంచి ఏదీ దాచకూడదు.. వెంటనే నీ ఫీజు కట్టే ఏర్పాటు చేస్తాను అమ్మా అంటూ కంపెనీ మేనేజర్‌కు ఫోన్ చేసి తన అకౌంట్‌కు యాభై వేలు ట్రాన్సఫర్ చేసుకుంది. అలా అకౌంట్లను బాగానే మ్యానేజ్ చేస్తోంది అంటూ అమ్మ మీద దివ్య సెటైర్ వేసింది. నేర్పించింది ఎవరు? నా కూతురు దివ్య అని తులసి గర్వంగా చెప్పుకుంది.
ప్రాజెక్ట్ పని పూర్తి అవ్వదు.. పెనాల్టీ కట్టరు.. ఈ ఇళ్లు అమ్మేస్తారు మనం వెళ్లిపోదాం.. మునిగిపోయే పడవలో మనం ఎందుకు అన్నట్టుగా అభితో అంకిత అంటుంది. అలా చేయడం తప్పు.. మా అమ్మ మీద నమ్మకం ఉంది.. తను అనుకుంటే చేసేస్తుంది.. అయినా ఇలా మధ్యలో వదిలేయడం చాలా తప్పు అని అభి వారిస్తాడు. కానీ అంకిత వినదు. తప్పొప్పుల మనకు ఎందుకు ఫస్ట్ మనం అంటూ ఉండాలి కదా? అని అంకిత చెప్పుకొచ్చింది. ఎప్పుడెప్పుడు వేరు కాపురం పెట్టేద్దామా? అని అంకిత ఆత్రంగా ఉంది.
ఇక మంచి గరం మీదున్న నందుకు ఇంకాస్త ఎక్కించింది లాస్య. ఒకానొక స్టేజ్‌లో నువ్ తులసికి లొంగిపోయావ్ ఏమో అని నీ మీద ఆశలు వదులుకున్నాను అంటూ నందుతో లాస్య ముచ్చట్లు పెట్టేసింది. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంది.. ఆఫీస్‌లో నిన్ను అంతలా అవమానిస్తుందా? ఇప్పుడు వచ్చి తులసి నీ కాళ్లు పట్టుకుంటే క్షమిస్తావా? నందు అని లాస్య అంటుంది. క్షమించే ప్రసక్తే లేదని నందు తెగేసి చెబుతాడు. ఆ సమయంలోనే ప్రేమ్ వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు.కానీ నందు వీరావేశంతో ఊగిపోతాడు. మధ్యలో లాస్య కూడా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. చివరకు ప్రేమ్ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆఫీస్‌కు వెళ్లను, తులసితో కలిసి పని చేయను అంటూ చెప్పేస్తాడు. ఆమె మీకు మాత్రమే అమ్మ.. నాకు భార్య కాదు అంతకంటే ఎక్కువ ఊహించుకోవద్దని చెప్పు అని నందు అంటాడు.
ఆఫీస్‌కు వస్తున్నారా? అంటూ బయటకు వచ్చిన నందును తులసి అడుగుతుంది. నిన్నే చెప్పాను కదా? ఆఫీస్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని.. మళ్లి ఎందుకు వస్తాను అని అంటాడు నందు. ఏదో ఉక్రోషంలో అలా అన్నావని అనుకున్నానురా అంటూ నందు తండ్రి వచ్చి సముదాయించే ప్రయత్నం చేస్తాడు. కానీ నందు వినడు. ఆ అప్పు భారం ఎవ్వరి మీద వేయను.. నాది నేనే చూసుకుంటాను.. నన్ను ఎవ్వరూ ఉద్దరించాల్సిన అవసరం లేదని వెళ్లిపోతాడు.
అలా నందు వెళ్లగానే.. ఇలా గయ్యాలి అత్త ఎంటర్ అవుతుంది. తులసిని ఆడిపోసుకుంటుంది. ఇంట్లో ఉండాల్సింది అలా బయటకు వెళ్లింది అంటూ నానా రకాల మాటలు అనేస్తుంది. అప్పుడు శ్రుతీ వచ్చి.. లాస్య కూడా అలానే వెళ్తోంది కానీ ఎందుకు అనరు అని అడుగుతుంది. లాస్యకు తులసికి పోలిక ఏంటి. నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది అని గయ్యాలి అత్త అంటుంది. మీకు తులసి ఆంటీ ఎదగడం ఇష్టం లేదు అందుకే ఇలా అంటున్నారు.. అది ఒప్పుకోండి అని శ్రుతీ నిలదీస్తుంది. తన కోసం ఎవ్వరూ గొడవ పడకండి.. సమస్యను తానే పరిష్కరించుకుంటాను అని తులసి చెప్పేసింది.
అలా సీన్ కట్ చేస్తే నందు.. జీకే వద్దకు వెళ్తాడు. కానీ నందును పూచికపుల్లను తీసిపారేసినట్టు అవతల పారేస్తాడు జీకే. నువ్ తులసి మాజీ భర్తవు కాబట్టి ఈ మాత్రం అయినా గౌరవం ఇస్తున్నాను అంటూ అనేస్తాడు. నా కంపెనీ కష్టాల్లో ఉంది. మీరు పెట్టుబడి పెట్టండి.. లాభాలు తీసుకోండి.. నేను పని సిన్సియర్‌గా చేస్తాను అని నందు అంటాడు. మనిషే సిన్సియర్‌గా లేనప్పుడు పని ఎలా సిన్సియర్‌గా చేస్తాడు. నువ్ కట్టుకున్న భార్యను మోసం చేశావ్.. నన్ను మోసం చేశావ్ అంటూ నందును నానా రకాలుగా తిట్టిపారేస్తాడు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇక ఇళ్లు ముక్కలు అవుతుంది.. తలొదిక్కులా వెళ్లిపోతారు అంటూ లాస్య అనడం ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ తులసి సవాల్ విసరడమే ఈ వారం ముఖ్య ఘట్టంలా ఉన్నట్టుంది. ఎవరు ఎవరిని గెంటేస్తారో.. ఏం జరుగుతుందో చూడాలి.
