తెలుగు ప్రేక్షకులు జానర్లతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తుంటారు. ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ చిత్రాలు ఆడుతున్నాయి. కమర్షియల్ సినిమాలు కూడా ఆడేస్తున్నాయి. ఇలా ఆ జానర్ ఈ జానర్ అన్న తేడా లేకుండా అన్ని చిత్రాలను చూస్తున్నారు. అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌కు యూనివర్సల్‌గా ఆడియెన్స్ ఉంటారు.
కథ
అభిజిత్ (వర్దన్ గుర్రాల), సిరిల్ (మోహన్ సాయి) బాల్య స్నేహితులు అలానే బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఈ ఇద్దరూ సక్సెస్ ఫుల్‌గా మలేషియా ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంటారు. అయితే ఇందులో స్టీఫెన్ వ్యక్తితో కొంత ప్రమాదం ఉంటుందని వారిద్దరికీ తెలుసు. ఇలా బిజినెస్ కొనసాగుతుండగా.. సిరిల్ తాను ప్రేమించిన ఆరాధ్య (అంబికా వాణి)ని పెద్దలకు ఇష్టంలేకపోయినా పెళ్లి చేసుకుంటాడు. కులాంతర వివాహాం కావడంతో ఆరాధ్య అన్న కోపం పెంచుకుంటాడు. వాళ్లను చంపాలని అనుకుంటాడు. ఆ తరువాత ఆరాధ్య, సిరిల్ కనిపించకుండాపోతారు. అలా మిస్ అయిన తన ఫ్రెండ్స్ కోసం అభి పరుగులు పెడుతుంటాడు. అలా అభిని పరుగులు పెట్టించిన ఆ సైకో శాడిస్ట్ కిల్లర్ ఎవరు? అలసు అభి, సిరిల్ జీవితంలోకి ఆ సైకో ఎందుకు వచ్చాడు? ఇందులో మైఖెల్ ఎవరు? చివరకు అభి తన స్నేహితులను కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ.
నటీనటులు
అభి తన ఫ్రెండ్ కోసం ప్రాణం ఇచ్చే కారెక్టర్. అలాంటి పాత్రలో వర్దన్ గుర్రాల మెప్పించాడు. ఎమోషన్స్‌ను బాగానే వర్కౌట్ చేశాడు. అయితే సినిమా అంతా ఒకే ఎమోషన్‌తో ఉన్నట్టుగా అనిపిస్తుంది. చివర్లో ఉండే ఒక యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఓకే అనిపిస్తాడు. సిరిల్ పాత్ర పరిధి తక్కువే గానీ ఓకే అనిపిస్తాడు. హీరోయిన్లు కనిపించినంతలో మెప్పిస్తారు. మైఖెల్ పాత్రతో విలనిజాన్ని చూపించారు. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పించేస్తాయి.
విశ్లేషణ
హీట్ మూవీ మెయిన్ పాయింట్ కొత్తదేమీ కాదు. ఇది వరకు చాలా సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. మైఖెల్ పాత్ర, అక్కడే మొదలయ్యే మెయిన్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ, కథనం పర్వాలేదనిపిస్తుంది. అసలేం జరుగుతుందో అర్థం కానట్టు.. ఆ హత్యలు చేసింది ఎవరు? హీరో ట్రాప్ చేస్తున్నది ఎవరు? అనే ఆసక్తిని కలిగించేలా సినిమాని మల్చడంలో దర్శకులు సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. సినిమా అక్కడక్కడా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ అంతలోనే ఓ ట్విస్ట్ వస్తుండటంతో సినిమా అలా పరుగులు పెట్టినట్టు అనిపిస్తుంది.
ఆ మర్డర్లు చేసేది ఎవరు? అనేది తెరపై క్లియర్‌గా అర్థం అవుతుంది.. కానీ ఎందుకు చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండదు. అసలు కథ ఏమై ఉంటుంది? అని సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ కలిగించేలా సినిమాను మలిచాడు దర్శకుడు. ఆ విషయంలో సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌కు వచ్చే సరికి కథ నీరసంగా అనిపిస్తుంది. చివరి ముగింపు కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.
సాంకేతికంగా ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ పాటల కంటే ఆర్ఆర్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. డైలాగ్స్ మెప్పిస్తాయి. సారీ చెప్పు బ్రదర్.. హర్ట్ అవుతాను బ్రదర్ అనే మ్యానరిజం నవ్వులు పూయిస్తుంది. సినిమాటోగ్రఫర్ తన కెమెరాతో నైట్ విజువల్స్‌ను చక్కగా బంధించాడు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
రేటింగ్ 2.75
