HBD Krishna Vamsi కృష్ణవంశీ సినిమాలంటే తెలుగు సంస్కృతికి, సంప్రదాయలు, బంధాలు, అనుబంధాలకు ప్రతీకగా ఉంటాయి. ఆయన సినిమాల్లోని మాటలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.. పాటలు ప్రశ్నిస్తాయి. నిసత్తువగా పడి ఉన్న చైతన్యానికి చైతన్యం ఇస్తాయి. ఇదంతా ఆయనలోని ఒక కోణం. ఇంకో కోణంలో ప్రేమను ఎంతో మాధుర్యంగా చూపిస్తారు. స్వచ్చమైన ప్రేమ, ఆరాధణ ఆయన సినిమాలో మనకు కనిపిస్తుంది. పట్టుదల, పంతం, మొండిఘటాలను, మొరటు మనుషులను కూడా ఆయన తెరపై ఆవిష్కరించారు.
వెండితెరకు సింధూరం పూసినా అది కృష్ణవంశీకే సాధ్యమైంది. అర్ద శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా? అంటూ సమాజాన్ని ప్రశ్నించినా అది ఆయనే చెల్లింది. అసలేం గుర్తుకు రాదు అంటూ ఇలాంటి హృద్యమైన ప్రణయ గీతాన్ని అందంగా చూపించాలన్నా కూడా కృష్ణవంశీ. మురారి అంటే కృష్ణుడు. కృష్ణవంశీ అన్నా కృష్ణుడే. అందుకే ఆ మురారిని ఈ కృష్ణుడు అంత అందంగా తీర్చి దిద్దగలిగాడు. నిన్నే పెళ్లాడుతా అంటూ సరికొత్త ట్రాక్, మేకింగ్, టేకింగ్‌తో అందరినీ మెప్పించాడు.
ఖడ్గం అంటూ మతవేర్పాటు వాదుల ఆలోచనలను చీల్చాడు. ప్రతీ ఒక్కరిలోనూ ఉన్న దేశభక్తిని తట్టిలేపాడు. అలా కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాలన్నీ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి. అయితే గత కొన్నేళ్లుగా కృష్ణవంశీ నుంచి ప్రేక్షకులు కోరుకునే అద్భుతాలు రావడం లేదు. ఈ విషయంలోనే ఆయన అభిమానులు కాస్త నిరాశతో ఉన్నారు.
అయితే రంగ మార్తాండ అంటూ ఈ సారి కృష్ణవంశీ మార్క్ కనిపించే చిత్రం రాబోతోంది. మరాఠీలో వచ్చిన సినిమాను తెలుగు వారి అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి కృష్ణవంశీ తెరకెక్కించాడు. ఈ చిత్రం త్వరలోనే ముందుకు రానుంది. ఈ క్రమంలోనే నేడు(జూలై 28) పుట్టిన రోజు జరుపుకుంటున్న కృష్ణవంశీ గారికి A2Z ADDA తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఎన్నెన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి.